Formula E Race Scam: ఐఏఎస్ అర్వింద్ కుమార్ సస్పెండ్

naveen
By -

రోజూ ఉదయాన్నే లేచి బస్సులో, ఆటోలో ఆఫీసులకు వెళ్లే సామాన్యుడు కట్టే పన్నుల డబ్బు.. రాజకీయ నాయకుల, బ్యూరోక్రాట్ల చేతుల్లో ఎలా కార్ రేసుల్లా మాయమవుతోందో ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం కళ్లకు కడుతోంది. కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై రేవంత్ సర్కార్ వేసిన సస్పెన్షన్ వేటు.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలీ స్కామ్ ఏంటి? ఏసీబీ విచారణ ఎటువైపు వెళ్తోందో చూద్దాం.


Formula E Race Scam


ఫార్ములా-ఈ రేసుల వెనుక అవినీతి కథ


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఫార్ములా ఈ-కార్ రేసు'లో భారీగా నిధులు దారిమళ్లాయనేది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ.


నిబంధనలను గాలికి వదిలేసి కోట్లాది రూపాయల ప్రజాధనం చేతులు మారిందని, దీని వెనుక అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని అవినీతి నిరోధక శాఖ (ACB) ఆధారాలు సేకరించింది.


కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అర్వింద్ కుమార్‌ సస్పెండ్


అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ రూపొందించిన ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు.


ఏసీబీ విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం 45 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కార్.. అర్వింద్ కుమార్‌ను మాత్రం ఏ బాధ్యతలు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టి, ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేయడం గమనార్హం.


కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?


ఈ ఫార్ములా ఈ-రేస్ స్కామ్‌లో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే కాకుండా, నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.


కేటీఆర్‌ను విచారించేందుకు కొన్ని నెలల క్రితమే గవర్నర్ అనుమతి ఇవ్వడం, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా విచారించేందుకు సీఎస్ (CS) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం బీఎల్‌ఎన్ రెడ్డి రిటైర్ అయినా విచారణ మాత్రం ఆగదు.


Tags: