గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాలను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామే. ఈ కేసులో వందల కోట్ల చేతులు మారాయంటూ ఈడీ, సీబీఐ చేసిన అరెస్టులు మామూలు సంచలనం రేపలేదు. సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ నేత కల్వకుంట్ల కవిత లాంటి వాళ్లు ఏకంగా తీహార్ జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా ఈ కేసులో నిందితులు అందరికీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఊహించని బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత కవిత నేరుగా తిరుమల కొండకు ఎందుకు వెళ్తున్నారు? ఆమె రాబోయే రాజకీయ ప్రణాళికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధారాలు లేవు.. కేసులన్నీ కొట్టివేత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అధికారులు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కానీ కోర్టు హాల్ లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులపై సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోయింది. దీంతో ఈ కేసును విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ నిందితులందరికీ అతిపెద్ద ఊరట కల్పించింది.
కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై ఈ తప్పుడు కేసులు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, బీఆర్ఎస్ వర్గాలు మొదటినుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు కారణంగానే కవిత దాదాపు ఆరు నెలల పాటు తీహార్ జైలులో రిమాండ్ అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో వారి వాదనకు బలం చేకూరింది.
మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు..
ఎన్నో నెలలుగా తనను వెంటాడుతూ, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఎట్టకేలకు క్లీన్ చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మిక బాట పట్టారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. సన్నిహితుల సమాచారం ప్రకారం, ఈనెల 5వ తేదీన కవిత తిరుపతికి చేరుకుని, అదే రోజున అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన కాలి నడకన తిరుమల కొండకు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు అంటే ఈనెల 6వ తేదీన ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు.
కవిత కొత్త పార్టీ? తిరుమల టూర్ వెనుక అసలు స్కెచ్
కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదని, దీని వెనుక భారీ రాజకీయ ప్రాధాన్యత ఉందంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ జాగృతి ద్వారా విస్తృతంగా ప్రజా కార్యక్రమాలు చేపట్టిన కవిత, రాబోయే రెండు నెలల్లోనే తన సొంతంగా 'కొత్త పార్టీ' పెడతానని ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. ఆ దిశగా ఆమె క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత, తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై, కొత్త పార్టీ విధివిధానాలపై కవిత సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కోర్టు నుంచి క్లీన్ చిట్ రావడంతో కవితకు ఒక పెద్ద గండం గట్టెక్కినట్లయింది. అయితే, బీఆర్ఎస్ పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటానని బహిరంగంగా ప్రకటించిన కవిత, క్షేత్రస్థాయిలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఒక పెద్ద సవాల్. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ ఇమేజ్ తో గెలిచిన ఆమె, ఇప్పుడు ఒంటరి పోరాటం చేసి సామాన్య ప్రజలను, తెలంగాణ యువతను ఎలా ఆకర్షిస్తారనే దానిపైనే ఆమె భవిష్యత్ రాజకీయ మనుగడ ఆధారపడి ఉంటుంది. శ్రీవారి ఆశీస్సులతో ఆమె పొలిటికల్ ఇన్నింగ్స్ 2.0 ఎలా ఉండబోతోందో వేచి చూడాలి!

