Global Oil Crisis: బ్యారెల్ $150కి చేరితే మన పరిస్థితేంటి?

naveen
By -

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మన సామాన్యుడి వంటగదిని, బైక్ పెట్రోల్ ట్యాంక్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తోంది. ముడిచమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి' మూసుకుపోవడంతో.. బ్యారెల్ ఆయిల్ ఏకంగా 150 డాలర్లకు చేరొచ్చని ఖతార్ ఎనర్జీ మంత్రి తాజాగా బాంబు పేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే వారాల్లో మన దగ్గర పెట్రోల్ రేట్లు సెంచరీ దాటి ఎక్కడికో వెళ్లిపోతాయి. అసలు గల్ఫ్ దేశాలు ఆయిల్ ఎగుమతులు ఎందుకు ఆపేస్తున్నాయి? ఈ విపత్కర పరిస్థితుల్లో మన ఇండియా సేఫ్‌గా ఉందా లేదా? అన్నది ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం.


Qatar Warning on Oil Prices


ఆగిపోయిన ఎగుమతులు.. గ్లోబల్ ఎకానమీకి పెను ముప్పు!


యుద్ధం ఏడో రోజుకు చేరుకోవడంతో శుక్రవారం గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన 'బ్రెంట్ క్రూడ్' (Brent crude) ధర 2.53% పెరిగి బ్యారెల్ కు $87.57 కి చేరుకుంది. ప్రపంచంలోని 20 శాతం ఆయిల్, గ్యాస్ ఎగుమతులు జరిగే 'హోర్ముజ్ జలసంధి' బ్లాక్ అవ్వడమే దీనికి ప్రధాన కారణం.


ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన మార్గం గుండా ట్యాంకర్లు వెళ్లలేకపోతే.. రాబోయే రెండు మూడు వారాల్లో క్రూడాయిల్ ధర 150 డాలర్లకు చేరుతుందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి (ఖతార్ ఎనర్జీ సీఈవో) అల్-కాబీ ఫైనాన్షియల్ టైమ్స్ కు సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు.


గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్


ప్రపంచ ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరాలో 20 శాతం వాటా ఉన్న ఖతార్.. ఇరాన్ దాడుల భయంతో సోమవారం తమ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది.


  • రాస్ లాఫన్, మెసయీద్ ఇండస్ట్రియల్ సిటీల్లోని ఖతార్ ఎనర్జీ ఫెసిలిటీలపై మిలిటరీ దాడుల కారణంగా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని ఆపేసినట్లు కంపెనీ ప్రకటించింది.
  • గల్ఫ్ ప్రాంతంలోని ఇతర ఎగుమతిదారులు కూడా త్వరలోనే 'ఫోర్స్ మజ్యూర్' (అనుకోని విపత్తుల వల్ల ఒప్పందాలు అమలు చేయలేకపోవడం) ప్రకటించే అవకాశం ఉందని అల్-కాబీ హెచ్చరించారు.
  • ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఫ్యాక్టరీలు మూతపడి ఉత్పత్తుల కొరత ఏర్పడుతుందని, ప్రపంచ జీడీపీ (GDP) దారుణంగా పడిపోతుందని ఆయన స్పష్టం చేశారు.


ఇండియా సేఫేనా? అమెరికా ఇచ్చిన 30 రోజుల ఛాన్స్


గల్ఫ్ నుంచి ఆయిల్ ఆగిపోతే ఇండియా పరిస్థితి ఏంటన్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక గుడ్ న్యూస్ చెప్పాయి.


మన దగ్గర ముడి చమురు, గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎల్‌పీజీ (LPG) రిఫైనరీల ఉత్పత్తిని పెంచాలని ఆదేశించామని తెలిపాయి. హోర్ముజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన ఇంధనం కంటే.. మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ వనరులే ఎక్కువగా ఉన్నాయని, ఇతర దేశాల నుంచి సప్లై పెంచుకుంటామని స్పష్టం చేశాయి.


దీనికి తోడు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి అమెరికా మనకు 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు (Waiver) ఇచ్చింది. "ఇది సముద్రంలో ఇప్పటికే ఆగిపోయిన ఆయిల్‌కు మాత్రమే వర్తిస్తుంది, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక లాభం ఉండదు. మార్కెట్లో ఇంధన కొరత లేకుండా చూడటానికే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు" అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ క్లారిటీ ఇచ్చారు.


బ్యారెల్ క్రూడాయిల్ 150 డాలర్లకు చేరడం అంటే.. మన వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.130 నుంచి రూ.150కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు! ప్రస్తుతానికి ఇండియా దగ్గర సరిపడా ఆయిల్ నిల్వలు ఉండటం, అమెరికా ఇచ్చిన 30 రోజుల మినహాయింపు ఉండటం వల్ల ఆ తక్షణ ఎఫెక్ట్ మన బంకుల మీద పడకపోవచ్చు.