అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి. నగరం నడిబొడ్డున పగటిపూటే పర్వతాలు కరిగిపోతున్నాయి.. రక్షకులే భక్షకులుగా మారి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ వేదికగా బ్రహ్మాస్త్రం సంధించారు. శనివారం (మార్చి 28న) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్రమ మైనింగ్‌పై ఆయన చేసిన సింహగర్జన సభను కుదిపేసింది. కంచే చేను మేసిన చందంగా అధికార పార్టీ నేతలే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు.
అనుమతులు నిల్.. దోపిడీ ఫుల్!
హరీష్‌రావు తన ప్రసంగంలో 'రాఘవ కన్స్ట్రక్షన్స్' పేరును నేరుగా ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థ నడుపుతున్న క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవని కుండబద్దలు కొట్టారు. పర్యావరణాన్ని రక్షించే కీలకమైన 'జీవో 111'ను పాతరేసి మరీ ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఒక క్రషర్ నడపాలంటే కనీసం ఎనిమిది రకాల అనుమతులు తప్పనిసరి అని, కానీ అవేమీ లేకుండానే యథేచ్ఛగా నిబంధనలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడుతోందని, అయినా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తప్పైతే నన్ను ఉరితీయండి.. ఆ ధైర్యం ఉందా?
అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధిత శాఖల వైఫల్యాన్ని హరీష్‌రావు ఎండగట్టారు. మైనింగ్ శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసులతో పాటు డిమాండ్ నోటీసులు ఇచ్చిందని, రెండవసారి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిందని సభ దృష్టికి తెచ్చారు. ఏమాత్రం అనుమతులు లేని ఆ క్రషర్‌ను తక్షణమే మూసివేయాలని సాక్షాత్తూ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలికి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు) లేఖ రాసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నేను చెప్పేది ఏమాత్రం అబద్ధమైనా.. నన్ను ఉరితీయండి" అంటూ హరీష్‌రావు చేసిన సవాల్ సభలో తీవ్ర ఉత్కంఠను రేపింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు ఒక క్లస్టర్‌లో చిన్న తప్పు చేస్తే.. రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పోలీసులు, ఇప్పుడు అధికార పార్టీ అండదండలు ఉన్న ముఖ్య నేతల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు.
మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి!
ఈ అక్రమ మైనింగ్ వెనుక ఉన్నది అధికార పార్టీ ముఖ్య నేతలేనని హరీష్‌రావు ఆరోపించారు. ఆ ముఖ్య నేత సంస్థ తప్పులు చేసింది కాబట్టే అధికారులు నోటీసులు ఇచ్చారని, అయినా ఆ క్లస్టర్‌పై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ భారీ అక్రమ మైనింగ్ దందాకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని హరీష్‌రావు గట్టిగా డిమాండ్ చేశారు.
వ్యక్తిగత దూషణలు సహించం.. శ్రీధర్ బాబు కౌంటర్!
హరీష్‌రావు చేసిన ఈ సంచలన ఆరోపణలపై మంత్రి శ్రీధర్‌బాబు వెంటనే స్పందించారు. అక్రమ మైనింగ్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్లుగానే ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. కానీ, అలాగని ఇష్టానుసారం 'స్లీపింగ్ రిమార్క్స్' చేస్తామంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అంతేకాకుండా, హరీష్‌రావు చేసిన ఆరోపణలను సభా రికార్డుల నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.
ఒకవైపు ప్రతిపక్షం దండెత్తుతుంటే.. మరోవైపు అధికార పక్షం ధీటుగా బదులివ్వడంతో అసెంబ్లీలో మైనింగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఈ అక్రమాల వెనుక దాగిన అసలు నిజాలు ఆ విచారణలో బయటపడతాయా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది!
Also Read:
అడ్డుపడితే శివతాండవమే.. ప్రతిపక్షాలకు రేవంత్ మాస్ వార్నింగ్!అమెరికాలో తెలుగు వాడి భారీ స్కామ్: నకిలీ CIA ఏజెంట్ అరెస్ట్!
తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌కు ఐటీ షాక్.. కిలోల కొద్దీ బంగారం సీజ్!
నకిలీ వాటర్ ట్యాంకర్లతో జాగ్రత్త.. లోగో చూసి మోసపోకండి!

