అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అగ్రరాజ్యాలు తమ దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా చనిపోయారు. ఇక ఇరాన్ పనైపోయింది అనుకుంటున్న టైమ్ లో.. ఒక చిన్న డ్రోన్‌తో అమెరికాకు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. ఎక్కడో గల్ఫ్‌లో అమెరికా కట్టుకున్న 10 వేల కోట్ల రూపాయల రాడార్ సిస్టమ్‌ను మట్టికరిపించింది. అసలు ఈ రాడార్ పేలిపోతే ఏమవుతుంది? అగ్రరాజ్యం గుడ్డిది ఎలా అవుతుంది? తక్కువ ఖర్చుతో తయారయ్యే 'షహీద్' డ్రోన్లతో ఇరాన్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ వల్ల పెట్రోల్ రేట్లు ఎలా భగ్గుమంటాయో ఒకసారి చూద్దాం.
కళ్లు పోయాయంటున్న పెంటగాన్.. ఏంటీ రాడార్?
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దళాల మధ్య యుద్ధం పీక్స్ కి చేరుకుంది. అమెరికా తన దగ్గరున్న అధునాతన బాంబర్లు, స్టెల్త్ ఫైటర్లతో దాడులు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో తయారయ్యే 'షహీద్' (Shahed) డ్రోన్లతో గురిచూసి కొడుతోంది.
తాజాగా ఖతార్‌లో అమెరికా ఏర్పాటు చేసుకున్న అత్యంత కీలకమైన AN/FPS-132 'ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్'ను ఇరాన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దీని విలువ అక్షరాలా 1.1 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.10 వేల కోట్లు). 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు క్షిపణులను కూడా ఇట్టే పసిగట్టే ఈ రాడార్ పేలిపోవడంతో.. గల్ఫ్‌లో తమ కంటి చూపు పోయినంత పనైందని పెంటగాన్ మాజీ సలహాదారు డౌగ్లస్ మెక్‌గ్రేగర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుడ్డిదైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్
ఈ రాడార్ మామూలుది కాదు. ఇరాన్, సిరియా, టర్కీ, హిందూ మహాసముద్రం.. ఇలా ఎక్కడినుంచి ముప్పు వచ్చినా ముందే పసిగట్టి, అమెరికాకు చెందిన థాడ్ (THAAD), పాట్రియాట్ (Patriot) మిసైల్ సిస్టమ్స్‌ను అప్రమత్తం చేస్తుంది.
ఇప్పుడు ఈ రాడార్ (మెదడు లాంటిది) దెబ్బతినడంతో ఆ మిసైల్ సిస్టమ్స్ అన్నీ గుడ్డిగా పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో అమెరికా నిఘా సామర్థ్యం దారుణంగా పడిపోయిందని, ఇలాంటి భారీ రాడార్‌ను వెంటనే భర్తీ చేయడం అసాధ్యమని మిలిటరీ అనలిస్టులు చెబుతున్నారు. ఇరాన్ వేసిన ఈ మాస్టర్ స్కెచ్‌తో అమెరికా రక్షణ వ్యవస్థ నెట్‌వర్క్‌లో భారీ గ్యాప్ ఏర్పడింది.
హోర్ముజ్ బంద్.. ఎయిర్‌పోర్టులపై దాడులు
ఇరాన్ వ్యూహం కేవలం రాడార్లకే పరిమితం కాలేదు. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి'ని ఇప్పటికే మూసివేసింది. చమురు తీసుకెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది.
సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీతో పాటు, దుబాయ్, బహ్రెయిన్ ఎయిర్‌పోర్టులపైనా భీకర దాడులకు దిగింది. తక్కువ ఆయుధ సంపత్తి ఉన్నప్పటికీ, శత్రువుకు ఎక్కువ ఆర్థిక నష్టం కలిగించడమే లక్ష్యంగా ఇరాన్ తన 'వ్యూహాత్మక పోరాటం' (Strategic Warfare) సాగిస్తోంది.
ఇరాన్ దగ్గర ఆయుధాలు తక్కువే ఉండొచ్చు, కానీ టెక్నిక్ మాత్రం భయంకరంగా ఉంది. కేవలం పది వేల రూపాయలు కూడా చేయని డ్రోన్లతో పది వేల కోట్ల రూపాయల రాడార్‌ను పేల్చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ యుద్ధతంత్రం వల్ల రాబోయే రోజుల్లో అమెరికా అహానికి దెబ్బతగిలి, దాడులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. హోర్ముజ్ జలసంధి క్లోజ్ అవ్వడం, ఆయిల్ రిఫైనరీలపై దాడులు జరుగుతుండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు భగ్గుమంటాయి. దీని ఎఫెక్ట్ మన ఇండియాలో పెట్రోల్ రేట్ల పెంపు రూపంలో కనిపిస్తుంది కాబట్టి, సామాన్యులు తమ ప్రయాణ, ఆర్థిక ప్రణాళికల్లో కాస్త జాగ్రత్త వహించడం ఎంతో ఉత్తమం.

