పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచాన్ని మూడో మహా సంగ్రామం అంచున నిలబెడుతున్నాయి. నిన్నటి దాకా పరోక్ష దాడులకే పరిమితమైన ఇరాన్.. ఇప్పుడు ప్రళయ భైరవుడిలా విజృంభిస్తోంది. తమ మాట వినకపోతే ప్రాంతీయ శాంతికి గ్యారెంటీ లేదంటూ గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్రస్థాయిలో అల్టిమేటం జారీ చేయడం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది!
గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఫైనల్ వార్నింగ్
శాంతి కావాలంటే తాము గీసిన గీత దాటొద్దని, అక్షరం పొల్లుపోకుండా తమ ఆదేశాలు పాటించి తీరాల్సిందేనని గల్ఫ్ దేశాలను ఇరాన్ కఠినంగా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తమ గగనతలాలను వినియోగించుకోకుండా తక్షణమే నిషేధం విధించాలని హుకుం జారీ చేసింది.
తాము చెప్పినట్లు నడుచుకుంటేనే గల్ఫ్ దేశాలపై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అత్యంత కఠినమైన భాషలో తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రత కోరుకునే వారెవరైనా.. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు తమ భూభాగాన్ని అస్సలు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.
ఎక్స్ వేదికగా అణుబాంబు లాంటి పోస్ట్
ఇరాన్ ఎన్నడూ ముందస్తు దాడులకు తెగబడదని తాము ఎన్నోసార్లు స్పష్టం చేశామని పెజెష్కియాన్ గుర్తుచేశారు. కానీ, రాజధాని టెహ్రాన్‌లోని తమ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను గనక ఏమాత్రం లక్ష్యంగా చేసుకున్నా.. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
"గల్ఫ్ దేశాలకు నేను చెప్పేది ఒకే ఒక్క మాట.. మీకు శాంతి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డ మీద నుంచి యుద్ధం చేయనివ్వకండి" అంటూ ఆయన ఏకంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు దౌత్య వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు?
ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు ఇరాన్ తన దాడుల పరంపరను ముమ్మరం చేసింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఈ భయానక ఉద్రిక్తతల నడుమ.. దుబాయ్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఉన్న రెండు అమెరికా సైనిక 'దాగుడు స్థావరాలపై' తాము ఇప్పటికే దాడి చేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' ఒక సంచలన నివేదికను విడుదల చేసింది.
హార్మూజ్ జలసంధిలో సరికొత్త ఎత్తుగడ
ఇక సముద్ర మార్గాలపై కూడా పట్టు బిగించేందుకు ఇరాన్ బరిలోకి దిగింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇకపై అధికారికంగా సుంకం వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ పార్లమెంటులో అతి త్వరలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోంది. సముద్ర మార్గాలపై తమ ఆధిపత్యాన్ని చాటుకునే ఈ విషయాన్ని ఇరాన్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి (UN) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అంతర్జాతీయ వార్తలు ఘోషిస్తున్నాయి.
చైనా కరెన్సీలో వసూళ్లు.. ఇది ఆర్థిక ఉగ్రవాదమే!
ఇరాన్ చెప్పిన మాటలు అప్పుడే ఆచరణలోకి వచ్చేశాయి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక ప్రకారం.. ఇప్పటికే రెండు భారీ నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి మరీ హార్మూజ్ జలసంధిని దాటాయి. సముద్ర ప్రయాణాలపై ఇరాన్ ఇలా పన్నులు వసూలు చేయడం పచ్చి ‘ఆర్థిక ఉగ్రవాదమే’ అని, ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’.. ఇజ్రాయెల్‌పై ప్రయోగం!
అయితే, ఈ యుద్ధ వాతావరణంలో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న మరో అంకం.. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులపై ఉన్న సందేశాలు! ఇరాన్ తన విధ్వంసకర క్షిపణులపై ఏకంగా ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ (భారత ప్రజలకు ధన్యవాదాలు) అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది. ఇందుకు సంబంధించిన వాస్తవ విజువల్స్‌ను ఇరాన్ అధికారిక మీడియాతో పాటు, ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో గర్వంగా షేర్ చేయడం అత్యంత సంచలనంగా మారింది.
భారత్‌తో మైత్రి.. మిగతా దేశాలకు సైతం..
కేవలం భారత్‌కే కాకుండా.. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్ దేశాలకు కూడా ఇరాన్ అచ్చం ఇలాగే క్షిపణుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుండటం విశేషం. తమకు ప్రపంచంలో మిగిలి ఉన్న అతి కొద్ది అత్యంత సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ కూడా ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మాటల యుద్ధం నుంచి విధ్వంసకర క్షిపణుల దాడుల వరకు.. ఇరాన్ తీసుకుంటున్న ఈ అత్యంత దూకుడు నిర్ణయాలు ప్రపంచాన్ని ఇంకెలాంటి వినాశనం వైపు నడిపిస్తాయో అన్న భయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది!

