ఎక్కడో ఇరాన్‌లో బాంబులు పడితే మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా? కానీ, ఆ దాడులు జరిగింది సాధారణ బిల్డింగుల మీద కాదు, అత్యంత ప్రమాదకరమైన 'అణు కేంద్రాల' మీద. ఏ చిన్న పొరపాటు జరిగి రేడియేషన్ లీక్ అయినా.. ఆ విషగాలి ప్రపంచమంతా వ్యాపించి పర్యావరణానికి, మన ప్రాణాలకు అతిపెద్ద ముప్పుగా మారుతుంది. ఇరాన్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయెల్ ఏకంగా 4000 బాంబులతో దాడి చేసి ధ్వంసం చేయడంతో ఇప్పుడు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అసలు ఆ రహస్య బంకర్లలో ఏం జరిగింది, ఈ భయంకరమైన దాడులతో రాబోయే రోజుల్లో మనకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో కచ్చితంగా తెలుసుకోండి.
నేలమట్టమైన ఇరాన్ భూగర్భ అణు స్థావరం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. టెహ్రాన్ శివార్లలోని 'మింజాదెహై' ప్రాంతంలో ఇరాన్ రహస్యంగా నిర్మించిన భూగర్భ అణు స్థావరాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) పూర్తిగా ధ్వంసం చేశాయి.
అలాగే టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న ప్రసిద్ధ 'నంతాజ్' అణు కేంద్రంపై కూడా భీకర దాడులు జరిగినట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) నిర్ధారించింది. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి ఎలాంటి రేడియోధార్మికత (రేడియేషన్) లీక్ కాలేదని, ముప్పు లేదని ప్రకటించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
4000 బాంబులు.. 1600 యుద్ధ విమానాలు
ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే.. గత శనివారం నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే ఇరాన్ పై ఏకంగా 4000 బాంబులు, 1600 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్న ప్రాంతంపై తొలిరోజే 30 బాంబులు వేసి ఆయనను అంతమొందించిన విషయం తెలిసిందే.
జూన్ 2025లో 12 రోజుల పాటు సాగిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' కంటే ఇప్పుడు ప్రయోగించిన పేలుడు పదార్థాలే ఎక్కువని ఐడీఎఫ్ ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. పాత దాడుల తర్వాత ఇరాన్ తన అణు ప్రాజెక్టును ఈ రహస్య స్థావరానికి మార్చిందని పక్కా సమాచారంతోనే ఈ దాడి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలే ఇజ్రాయెల్ టార్గెట్
అణు కేంద్రాలే కాకుండా ఇరాన్ సైనిక స్థావరాల నడ్డి విరవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. గత వారం నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 300 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను, వైమానిక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది.
అణు కార్యక్రమాలను ఆపకుండా ఇరాన్ దొంగచాటుగా ఆయుధాలు తయారుచేస్తోందన్న కోపంతోనే ఇజ్రాయెల్ ఈ మారణహోమానికి దిగుతోందని డెఫ్రిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించిన శాటిలైట్ దృశ్యాలను ఐడీఎఫ్ తమ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
అణు కేంద్రాలపై బాంబులు వేయడం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే. ఇజ్రాయెల్, అమెరికా తమ ఆధిపత్యం కోసం అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నా.. ఏ చిన్న పొరపాటు జరిగి రేడియేషన్ లీక్ అయినా అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదు, ప్రపంచ మానవాళికి ఒక పీడకలగా మారుతుంది. అగ్రరాజ్యాలు తమ ఇగోల కోసం సామాన్యుల ప్రాణాలను, పర్యావరణాన్ని గాలికి వదిలేస్తున్నాయనడానికి ఈ దాడులే నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంధన కొరత, ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, సామాన్యులు తమ ఆర్థిక ప్రణాళికల పట్ల అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

