Operation Roar of the Lion: మోజ్తాబా ఖమేనీకి చావు తప్పదన్న ఇజ్రాయెల్.. భయపెడుతున్న కొత్త మిషన్!

naveen
By -

ఎక్కడో పశ్చిమాసియాలో బాంబులు పడుతుంటే మనకెందుకులే అని లైట్ తీసుకునే పరిస్థితి ఇక లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్.. ఇప్పుడు ఆయన కొడుకు, ఇరాన్ కొత్త లీడర్ మొజ్తబా ఖమేనీకి కూడా మరణశాసనం రాసింది. 'రోర్ ఆఫ్ ది లయన్' పేరుతో సరికొత్త మిషన్ స్టార్ట్ చేసింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఏకంగా 40 క్షిపణులు, 230 డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకు మంటలు వ్యాపించడం అంటే.. అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల ప్రాణాలకు, అలాగే మన దేశంలో పెట్రోల్ రేట్లకు డైరెక్ట్ గా ముప్పు రావడమే. అసలు ఇజ్రాయెల్ ఇచ్చిన ఆ ఓపెన్ వార్నింగ్ ఏంటి? ఈ మారణహోమం సామాన్యుడి జేబును ఎలా కొల్లగొట్టబోతోందో చూద్దాం.


Operation Roar of the Lion


మోజ్తాబాకు చావు తప్పదు.. ఇజ్రాయెల్ ఓపెన్ వార్నింగ్


ఖమేనీ మరణంతో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ఒత్తిడి మేరకు.. అసెంబ్లీ ఎక్స్‌పర్ట్ కమిటీ కొత్త సుప్రీం నేతగా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీని ఎన్నుకుంది. ఆయన త్వరలోనే అధికారికంగా ఇరాన్ పగ్గాలు చేపట్టనున్నారు.


సరిగ్గా ఖమేనీ అంత్యక్రియలు జరిగే ముందే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెలీ కాట్జ్ సంచలన ప్రకటన చేశారు. టెహ్రాన్ ప్రభుత్వం ఎవరిని నాయకుడిగా నియమించినా, వారికి తమ చేతుల్లో చావు తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అతడు ఎవరైనా, ఎక్కడ దాక్కున్నా తమ నుంచి తప్పించుకోలేడని శపథం చేశారు.


నెతన్యాహు కొత్త మిషన్.. 'రోర్ ఆఫ్ ది లయన్'


ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకునే వారిని, ఇరాన్ పౌరులను అణచివేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాట్జ్ స్పష్టం చేశారు. పరోక్షంగా మోజ్తాబాను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరియు తాను.. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.


'రోర్ ఆఫ్ ది లయన్' అనే కొత్త ఆపరేషన్ ద్వారా మరో మిషన్ కోసం సంసిద్ధం కావాలని ఆర్మీకి సూచించారు. అమెరికా భాగస్వామ్యంతో ఇరాన్ పాలనా సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ఇజ్రాయెల్ బల్లగుద్ది చెబుతోంది.


సీక్రెట్ అణు కేంద్రం ధ్వంసం.. కువైట్‌పై ఇరాన్ ప్రతీకారం


గతేడాది (2025) జూన్‌లో జరిగిన దాడుల తర్వాత ఇరాన్ రహస్యంగా ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ అణు ప్రాజెక్ట్ ను తాజాగా తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.


ఇటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు తీవ్రం చేసింది. ఏకంగా కువైట్ లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ 40 క్షిపణులు, 230 డ్రోన్లతో ఐఆర్‌జీసీ భీకర దాడికి పాల్పడింది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ సంస్థ (HRANA) లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇరాన్ లో 1,097 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఒక దేశ అత్యున్నత నాయకుడిని చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తోందో మనకు అర్థమవుతోంది. ఇరాన్ ప్రతిదాడులతో కువైట్ లాంటి ప్రశాంతమైన గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు యుద్ధ భూమిగా మారుతున్నాయి. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే, గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల ఉపాధికి ముప్పు వాటిల్లడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రాబోయే రోజుల్లో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు మండిపోవడం ఖాయం. కాబట్టి సామాన్యులు ఇప్పటినుంచే ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం, ఫైనాన్షియల్ గా అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఎంతో ఉత్తమం.