Middle East War Updates: రంగంలోకి పాకిస్థాన్.. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?

naveen
By -

పశ్చిమాసియాలో బాంబుల మోతతో ఎక్కడికక్కడ విమానాలు ఆగిపోయాయి.. క్రూడాయిల్ సప్లై నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధంలోకి మన దాయాది దేశం పాకిస్థాన్ ఎంటర్ అవ్వడం ఇప్పుడు సరికొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఇరాన్ వేసిన ఒక చిన్న డ్రోన్ దాడి.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న ఒక రహస్య 'అణు' ఒప్పందాన్ని తెరమీదకు తెచ్చింది. అసలు సౌదీ కోసం పాకిస్థాన్ ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? అణు బాంబులున్న పాక్ ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? దీనివల్ల రాబోయే ఆర్థిక సంక్షోభం మన సామాన్యుడి బతుకును ఎలా మార్చబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.


Middle East War Updates


సౌదీ, పాకిస్థాన్ సీక్రెట్ డీల్ (SMDA)


ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఐదో రోజుకు చేరిన యుద్ధం రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాలు వణికిపోతున్నాయి. అయితే సౌదీ అరేబియాపై ఇరాన్ చేసిన ఒక చిన్న ఆత్మాహుతి డ్రోన్ దాడి.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం వైపు లాగుతోంది.


దీనికి ప్రధాన కారణం 2025 సెప్టెంబరులో సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య కుదిరిన 'వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం' (SMDA). ఈ సీక్రెట్ డీల్ ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా.. ఇద్దరిపైనా దాడి జరిగినట్లే పరిగణించాలి. సౌదీపై దాడులు చేయొద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్‌కు వార్నింగ్ ఇవ్వడం వెనుక అసలు కారణం ఇదే.


కాగితాలకే పరిమితమైన ఒప్పందం?


అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చిన తొలి రియాక్షన్ ఇదే కావడం గమనార్హం. "మా రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం ఉందని ఇరాన్ కు స్పష్టంగా చెప్పాను" అని దార్ పేర్కొన్నారు.


కానీ విచిత్రం ఏంటంటే.. గత వారం నుంచి అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్లు పాకిస్థాన్‌పై భీకర దాడులు చేస్తున్నా, మిత్రదేశం సౌదీ అరేబియా కనీసం నోరు మెదపలేదు. దీనిని బట్టి చూస్తే పాక్, సౌదీల ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితమా అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.


తెరపైకి అణు బాంబుల భయం


ఈ రక్షణ ఒప్పందంలో ప్రపంచాన్ని భయపెడుతున్న, అత్యంత వివాదాస్పదమైన అంశం 'అణు భద్రత'. సౌదీ అరేబియాకు పాకిస్థాన్ తన అణు సామర్థ్యాలను (Nuclear Umbrella) విస్తరించిందా అన్న అనుమానాలు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను వణికిస్తున్నాయి.


గతేడాది (2025 సెప్టెంబర్) దోహా, ఖతార్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత.. గల్ఫ్ భద్రతను కాపాడటంలో అమెరికా సామర్థ్యంపై నమ్మకం కోల్పోయిన సౌదీ, పాక్ తో ఈ డీల్ కుదుర్చుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పాక్ విదేశాంగ మంత్రి కేవలం దౌత్యపరమైన వార్నింగ్ ఇచ్చారే తప్ప, సౌదీ తరఫున నేరుగా సైన్యాన్ని పంపుతామని ఎక్కడా చెప్పలేదు.


ఐక్యరాజ్యసమితి రూల్స్ బ్రేక్ అయినట్లేనా?


పాకిస్థాన్ ఒక అణ్వాయుధ దేశం. అణ్వాయుధాలు లేని సౌదీ లాంటి మిత్రదేశానికి ఆ అణు భద్రతను కల్పిస్తే.. అది ఐక్యరాజ్యసమితి 'అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి' (NPT) పూర్తిగా విరుద్ధం. పాక్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినా అనుమానాలు మాత్రం ఆగట్లేదు.


ఈ ఒప్పందంలో నేరుగా అణ్వాయుధాల ప్రస్తావన లేకపోయినా.. ఇది ప్రపంచ భద్రతకు, అణ్వస్త్ర విస్తరణకు ఒక దారుణమైన ఉదాహరణగా నిలుస్తుందని లండన్‌కు చెందిన 'ఛాతమ్ హౌస్' (Chatham House) థింక్ ట్యాంక్ విశ్లేషకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.


గల్ఫ్ దేశాల ఆధిపత్య పోరులో పాకిస్థాన్ లాంటి అస్థిర దేశం ఎంటర్ అవ్వడం అంటే, ఒక 'అణుశక్తి' దేశం యుద్ధ బరిలోకి దిగడమే. ఈ రహస్య ఒప్పందాల వెనుక ఉన్న అసలు భయం.. యుద్ధం ముదిరి ఎక్కడ అణు బాంబుల దాకా వెళ్తుందో అన్నదే! యుద్ధం ఎంత పొడిగితే.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అంతగా దెబ్బతిని, మన దగ్గర ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు అంతలా మండిపోతాయి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో, సామాన్యులు తమ పొదుపు ఖాతాలను పెంచుకుని, అనవసరపు ఖర్చులకు, కొత్త ఈఎంఐలకు దూరంగా ఉండటమే ఆర్థిక శ్రీరామ రక్ష.