పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ఇరాన్ దాడులతో అట్టుడుకుతున్న తమ దేశానికి భారత్ అందిస్తున్న తిరుగులేని మద్దతుపై ఆయన బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నాడు ప్రధాని మోదీ స్వయంగా నెతన్యాహుకు ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడటం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఏం జరిగింది, నెతన్యాహు వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బీట్ షెమేష్ శిథిలాల వద్ద నెతన్యాహు భావోద్వేగం
ఇరాన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన బీట్ షెమేష్‌లోని ఒక ప్రార్థనా మందిరం శిథిలాలను పరిశీలించిన నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నిన్న తాను తన ఆప్తమిత్రుడు నరేంద్ర మోదీతో చాలా సేపు ఫోన్లో మాట్లాడానని, ఇజ్రాయెల్ వైపు, సత్యం వైపు నిలబడినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపానని స్పష్టం చేశారు. భారత ప్రజలు ఇజ్రాయెల్‌పై చూపిస్తున్న అపారమైన ప్రేమ, స్నేహం వెలకట్టలేనిదని, వారిని ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే ప్రేమిస్తారని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీతో జరిగిన ఆ సుదీర్ఘ ఫోన్ కాల్‌లో దౌత్యపరంగా ఏయే విషయాలు చర్చించారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. మోదీ ఒక్కరే కాకుండా ఇతర దేశాల నేతలతో కూడా తాను నిరంతరం టచ్ లో ఉన్నానని వెల్లడించారు.
ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని పిలుపు
ఇదే సమయంలో ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నెతన్యాహు అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ ప్రజలు తమ నియంతృత్వ పాలకులను గద్దె దించేలా ప్రోత్సహించడమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ విముక్తి రోజు మరెంతో దూరంలో లేదని, ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో ఇజ్రాయెల్, అమెరికా వారికి పూర్తిగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇప్పటికే ఇరాన్ ప్రజలను ఉద్దేశించి తమ దేశాన్ని తామే దక్కించుకోవాలని వ్యాఖ్యానించిన విషయాన్ని నెతన్యాహు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆగని దాడులు.. అప్రమత్తమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ (ఐడీఎఫ్)
మరోవైపు సోమవారం సాయంత్రం కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు తెగబడ్డాయి. అయితే ఇరాన్ ప్రయోగించిన మూడు అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు గాలిలోనే సమర్థవంతంగా ధ్వంసం చేశాయని ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు ప్రమాద హెచ్చరికలు అందిన వెంటనే బంకర్లు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ధైర్యం చెప్పడం అంతర్జాతీయ దౌత్య నీతిలో ఒక కీలక పరిణామం. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలు ఈ సంక్షోభ సమయంలో మరింత బలపడుతున్నాయని నెతన్యాహు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు అరబ్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్ కు సైతికంగా మద్దతు పలుకుతూ భారత్ అనుసరిస్తున్న బ్యాలెన్సింగ్ విధానం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.

