నసీమ్ షాకు పీసీబీ భారీ షాక్: రూ. 68 లక్షల జరిమానా!

naveen
By -

పాక్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఫైన్.. నసీమ్ షాకు బిగ్ షాక్.


క్రికెట్ పిచ్‌పై బంతులతో నిప్పులు చెరిగే స్టార్ పేసర్ నసీమ్ షా.. సోషల్ మీడియాలో వేసిన ఒక రాంగ్ యార్కర్‌తో దారుణంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు! ఒకే ఒక్క ట్వీట్ అతడి జేబుకు కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ చిల్లు పెట్టింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చరిత్రలోనే ఇది అతిపెద్ద జరిమానా. ఈ హై-వోల్టేజ్ డ్రామా ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది!


ఒక్క ట్వీట్.. అక్షరాలా 68 లక్షల ఫైన్! 


పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆరంభ వేడుకల్లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్‌పై చేసిన ఒక వివాదాస్పద పోస్ట్‌కు గాను.. పీసీబీ నసీమ్ షాపై కన్నెర్రజేసింది. అతడికి ఏకంగా 72,000 డాలర్లు (సుమారు రూ. 68 లక్షలు లేదా పాకిస్థాన్ కరెన్సీలో 2 కోట్ల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో (ESPNcricinfo) నివేదిక ప్రకారం, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడికి పడిన అత్యంత భారీ ఫైన్ ఇదే. నసీమ్ షా పీసీబీ నుంచి అందుకునే వార్షిక వేతనంలో ఇది ఏకంగా మూడింట రెండు వంతులు (2/3rd) కావడం గమనార్హం!


ఖాళీ స్టేడియం.. రాజకుమారికి మర్యాదలు! 


ఈ వివాదం లాహోర్‌లోని ప్రఖ్యాత గడ్డాఫీ స్టేడియంలో మొదలైంది. దేశంలో నెలకొన్న తీవ్రమైన పెట్రోలియం సంక్షోభం కారణంగా.. పీఎస్ఎల్ మ్యాచ్‌లను ముందుగా అనుకున్న ఆరు వేదికలకు బదులు కేవలం రెండు వేదికలకే కుదించడమే కాకుండా, స్టేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతించబోమని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ముందే ప్రకటించారు. ఇలాంటి క్లోజ్డ్ డోర్స్ (closed doors) నడుమ జరిగిన ఆరంభ వేడుకలకు ఇతర ప్రముఖులతో పాటు సీఎం మర్యం నవాజ్ హాజరయ్యారు.


పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె అయిన మర్యం నవాజ్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ అధికారులను, ఆటగాళ్లను కలుసుకున్నారు. ఇది చూసి రగిలిపోయిన నసీమ్ షా.. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా విరుచుకుపడ్డాడు. "లార్డ్స్ (Lord's) మైదానంలో ఒక రాణికి ఇచ్చినట్లుగా ఆమెకు అంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు?" అంటూ సెటైరికల్ పోస్ట్ చేశాడు.


అకౌంట్ హ్యాక్ అయిందన్న కవరింగ్.. మేనేజర్‌పై వేటు 


ఆ పోస్ట్ కాస్తా వైరల్ అవ్వడంతో నిమిషాల వ్యవధిలోనే దానిని డిలీట్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్.. తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పీసీబీ వదిలిపెట్టలేదు. అధికారిక నోటీసు పంపడంతో నసీమ్ దిగివచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. సోమవారం లాహోర్‌లో ముగ్గురు సభ్యులతో కూడిన క్రమశిక్షణా ప్యానెల్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ వివాదానికి కారణమైన తన సోషల్ మీడియా మేనేజర్‌ను కూడా విధుల నుంచి తొలగించాడు.


క్రమశిక్షణ తప్పితే వేటే.. పీసీబీ వార్నింగ్ 


నసీమ్ షా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని పలు నిబంధనలను అతిక్రమించాడని నిర్ధారించిన బోర్డు.. అతడిపై క్రమశిక్షణా చర్యలను ఖరారు చేసింది. "నసీమ్ ఇప్పటికే తన సోషల్ మీడియా సలహాదారుని తొలగించినట్లు మేం గుర్తించాం. అంతేకాదు, పీసీబీ పరిధిలోకి వచ్చే ఏ ఆటగాడితోనూ ఆ మేనేజర్ భవిష్యత్తులో అస్సలు పనిచేయకుండా అతడిని బ్లాక్‌లిస్ట్‌లో (Blacklisted) పెడుతున్నాం" అని బోర్డు కఠినంగా వ్యవహరించింది.


గతంలో ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్‌కు కూడా పగిలింది! 


పాక్ ఆటగాళ్లు ఇలా రాజకీయపరమైన మెసేజ్‌లు ఇచ్చి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాక్ ఆల్‌రౌండర్ ఆమేర్ జమాల్.. మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా ఒక నినాదాన్ని ప్రదర్శించినందుకు 4,000 డాలర్ల జరిమానా కట్టాడు. గతేడాది డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ సెషన్‌లో.. జమాల్ తన ఫ్లాపీ హ్యాట్ (టోపీ) కింద '804' అని రాసుకుని వచ్చాడు. ఆగస్టు 2023 నుంచి జైలులో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ ఖైదీ నంబరే ఈ 804.


గ్రౌండ్‌లో వికెట్లు పడగొట్టే ఆటగాళ్లు.. రాజకీయాల పిచ్‌పైకి ఎక్కి నోరుజారితే తమ కెరీర్‌నే ఎలా క్లీన్ బౌల్డ్ చేసుకుంటారో చెప్పడానికి నసీమ్ షా ఘటనే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ!