అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైండ్ గేమ్ మొదలైంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ, తెర వెనుక జరుగుతున్నది వేరు! ఈ శాంతి వచనాలు కేవలం శత్రువును ఏమార్చే వ్యూహం మాత్రమేనని, అమెరికా భయంకరమైన భూతల దాడికి సిద్ధమవుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు అతిపెద్ద సాక్ష్యం.. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' సమీపంలో గురువారం రాత్రి గుట్టలు గుట్టలుగా ఆర్డర్ అయిన 'పిజ్జాలే'!
పిజ్జా ఆర్డర్లు.. యుద్ధానికి సంకేతాలు!
వినడానికి వింతగా ఉన్నా ఇది నగ్న సత్యం. అమెరికా ఏదైనా భారీ సైనిక ఆపరేషన్ చేసే ముందు పెంటగాన్‌కు పిజ్జాల డెలివరీలు అమాంతం పెరిగిపోవడం చరిత్రలో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెనిజులాపై భీకర దాడి చేయడానికి ముందు రాత్రి కూడా సరిగ్గా ఇలాగే భారీ సంఖ్యలో పిజ్జాలు డెలివరీ అయ్యాయి.
ఇరాన్‌పై పక్కా స్కెచ్ వేసిన ట్రంప్.. చర్చల కోసం ఇరాన్ కేవలం ఒక వారం సమయం అడిగితే, "నేను మీకు 10 వారాల సమయం ఇస్తాను" అని ఉదారంగా ప్రకటించారు. హర్మూజ్ జలసంధి నుంచి 10 వాణిజ్య నౌకలను సురక్షితంగా వెళ్లేందుకు ఇరాన్ బహుమతిగా అనుమతించినందుకే తాను ఈ ఉదారత ప్రదర్శించానని ట్రంప్ పైకి చెబుతున్నారు.
ట్రంప్ ఎత్తుగడ.. పది వేల సైన్యంతో చుట్టుముట్టే ప్లాన్!
కానీ విశ్లేషకుల అంచనా మరోలా ఉంది. ఇరాన్ సమీపంలో వేలాది మంది అదనపు సైనికులను సమీకరించుకునేందుకు సమయం సంపాదించడానికే ట్రంప్ ఈ అద్భుతమైన ఎత్తుగడ వేశారని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదిక కూడా బలంగా ధృవీకరిస్తోంది. ట్రంప్ శాంతి చర్చల దిశగా ఆలోచిస్తున్నప్పటికీ.. పెంటగాన్ ఇప్పటికే మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు కల్పిస్తూ పశ్చిమాసియాకు భారీగా సైనిక దళాలను పంపిందని, అదనంగా ఏకంగా 10,000 మందిని భూతల దాడుల కోసం పంపాలని చూస్తోందని ఆ రిపోర్ట్ బాంబు పేల్చింది.
దానికి తోడు.. మరో శనివారం సమీపిస్తుండటం మరింత టెన్షన్ పెంచుతోంది. మార్కెట్లు ముగిసిన తర్వాత వీకెండ్‌లో, ముఖ్యంగా శనివారం రోజు దాడులు ప్రారంభించడం ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన సెంటిమెంట్. ఇరాన్‌పై గత యుద్ధం, జనవరిలో వెనిజులాపై దాడి శనివారమే జరగడం ఇక్కడ మనం గమనించాలి. అందుకే అమెరికా ప్రత్యక్షంగా తన బలగాలను రంగంలోకి దించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా ముందున్న మూడు ప్రత్యామ్నాయాలు ఇవే..
అమెరికా ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ డేనియల్ డేవిస్ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం మోహరించిన భూతల దళాల సంఖ్య పరిమితంగా ఉన్నందున, సిద్ధాంతపరంగా అమెరికా ముందు మూడు అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది.. హర్మూజ్ జలసంధి సమీపంలోని 'ఖేష్మ్' ద్వీపాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం. పర్షియన్ గల్ఫ్‌లోనే అత్యంత భారీ ద్వీపమైన ఖేష్మ్.. అమెరికాకు ఒక సంభావ్య లక్ష్యంగా మారింది. ఆ ద్వీపంలోని రహస్య సొరంగాల్లో ఇరాన్ భారీగా నౌక విధ్వంసక క్షిపణులు, మందుపాతరలు, డ్రోన్లు, మెరైన్ బోట్లను భద్రపరిచినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక రెండో ప్రత్యామ్నాయం.. వ్యూహాత్మక చమురు కేంద్రమైన 'ఖర్గ్' ద్వీపంపై దాడి చేయడం. ఇరాన్ చమురు ఎగుమతులలో ఏకంగా 90 శాతాన్ని ఈ ద్వీపమే నిర్వహిస్తుంది. దీన్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఇరాన్ ఆర్థిక మూలాలను శాశ్వతంగా దెబ్బతీయొచ్చు. ఇక మూడో ఆప్షన్.. ఇరాన్ రహస్యంగా శుద్ధి చేసినట్లు ఆరోపిస్తున్న 400 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడం. అయితే అది కచ్చితంగా ఎక్కడ ఉందనేది అమెరికా ముందుగా గుర్తించాల్సి ఉంటుంది.
గూఢచారుల పిజ్జా మీటర్.. చరిత్ర చెబుతున్న నిజం!
ఇప్పుడు మళ్లీ అందరి దృష్టి ఆ 'పిజ్జా మీటర్' పైనే పడింది. మారుతున్న ట్రంప్ వ్యూహాల నేపథ్యంలో, గురువారం రాత్రి పొద్దుపోయాక పెంటగాన్ పరిసరాల్లో పిజ్జా ఆర్డర్లు మామూలు రోజులతో పోలిస్తే వందల రెట్లు పెరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'పెంటగాన్ పిజ్జా వాచ్' వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. పెంటగాన్‌కు కేవలం 2.4 మైళ్ల దూరంలో ఉన్న 'పాపా జాన్స్ పిజ్జా' ఆర్డర్లు 296 శాతం పెరిగాయి. 1.4 మైళ్ల దూరంలోని 'డొమినోస్ పిజ్జా' ఆర్డర్లు 208 శాతం, 2.2 మైళ్ల దూరంలోని 'పిజాటో పిజ్జా' ఆర్డర్లు ఏకంగా 200 శాతం మేర రాత్రికి రాత్రే పెరిగిపోయాయి.
ఈ ఫుడ్ డెలివరీలకు, యుద్ధానికి లింక్ ఏంటంటే.. 1970వ దశకంలో సోవియట్ గూఢచారులు ఈ రహస్యాన్ని పసిగట్టారు. పెంటగాన్‌లో అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీలు భారీగా పెరిగాయంటే.. అమెరికా సైన్యం పెద్ద ఆపరేషన్ చేయబోతోందని, లోపల రక్షణ శాఖ ఉన్నతాధికారుల అత్యవసర సమావేశాలు జరుగుతున్నాయని ఇది ఒక సంకేతం.
1991లో కువైట్‌పై ఇరాక్ దాడికి ముందు కూడా అమెరికా సీఐఏ ఆఫీసులో పిజ్జా ఆర్డర్లు ఇలాగే అమాంతం పెరిగిన నివేదికలు ఉన్నాయి. ఈ పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ అధికారికం కాకపోయినా, గత చరిత్రను చూస్తే అవి నిజమేనని నిరూపితమయ్యాయి. శత్రువులకు ఇలాంటి ఫుడ్ ఆర్డర్ల సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు ఇప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిందంటే ఈ థియరీ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
పైకి పది రోజుల గడువు ఇస్తూనే, లోపల పది వేల సైన్యంతో చుట్టుముడుతున్న అమెరికా వ్యూహం.. ఈ శనివారం రాత్రి పశ్చిమాసియాలో ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందోనని ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది!
Also Read:
ట్రంప్ సంచలన నిర్ణయం: ఇరాన్‌పై దాడులు 10 రోజులు వాయిదా!డాలర్‌పై ట్రంప్ సంతకం: 165 ఏళ్ల అమెరికా చరిత్ర బ్రేక్!
Bab el-Mandeb Strait | గ్లోబల్ యాక్షన్ థ్రిల్లర్: పెట్రోల్ ధరలు పెంచేలా ఇరాన్ మాస్టర్ ప్లాన్
ఇరాన్ నావల్ కమాండర్ మృతి? హర్మూజ్‌ను శాసించిన టాంగ్సిరి ఇజ్రాయెల్ దాడిలో హతం
నల్ల సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. పెట్రోల్ మంట తప్పదా?

