గల్ఫ్‌ను గుప్పెట్లో పెట్టిన కమాండర్ మృతి? ఇరాన్‌కు మరో బిగ్ షాక్.. ఆత్మరక్షణలో అమెరికా!
పశ్చిమాసియా రణరంగంలో మృత్యుఘోష ఆగడం లేదు. అగ్రరాజ్యాల పవర్ గేమ్‌లో మరో కీలక వికెట్ పడిందన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్‌కు మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందా? ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రాణనాడి అయిన హర్మూజ్ జలసంధిని తన గుప్పెట్లో పెట్టుకుని.. నౌకల రాకపోకలను దిగ్బంధించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావల్ కమాండర్ అలీరెజా టాంగ్సిరి దారుణంగా హత్యకు గురయ్యారా? అవుననే అంటోంది ప్రముఖ వార్తా సంస్థ 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్'.
బందార్ అబ్బాస్ తీరంలో నెత్తుటి మరకలు..
హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న టాంగ్సిరి.. బందార్ అబ్బాస్ తీర ప్రాంతం వద్ద ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. అయితే, ఈ భయంకరమైన వార్తపై అటు ఇరాన్ గానీ, ఇటు ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఒకవేళ ఈ వార్తే గనుక నూటికి నూరు శాతం నిజమైతే.. ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ మహా సంగ్రామంలో ఇరాన్ తన అత్యంత కీలకమైన అస్త్రం లాంటి మరో నేతను కోల్పోయినట్లే!
హర్మూజ్‌ను శాసించిన కమాండర్ ఆయనే!
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటినుంచో పన్నిన ఎన్నో హత్యాయత్నాలను, కుట్రలను తట్టుకుని ఇప్పటివరకు ప్రాణాలతో నిలబడిన అతికొద్ది మంది ఇరాన్ ప్రముఖులలో టాంగ్సిరి ఒకరు. 2018 నుంచి తన బాధ్యతల్లో ఉన్న ఆయన ఒక అపారమైన అనుభవజ్ఞుడైన కమాండర్. పశ్చిమాసియాలో ఈ యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంలో ఆయనది అతి పెద్ద పాత్ర. ఆయన వ్యూహం కారణంగానే ఆ జలసంధిలో చమురు, సహజవాయువు రవాణా పూర్తిగా నిలిచిపోయి.. నేడు అంతర్జాతీయంగా అతిపెద్ద ఇంధన సంక్షోభం తలెత్తింది.
95 శాతం నౌకలు బంద్.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!
నిజంగా హర్మూజ్‌లో ఏం జరిగిందో వింటే గుండెభీతిల్లక మానదు. ప్రఖ్యాత నౌకాయాన పరిశ్రమ నిఘా వెబ్‌సైట్ 'లాలిడ్ లిస్ట్' (Lloyd's List) లెక్కల ప్రకారం.. ఈ యుద్ధానికి ముందు ఆ జలసంధి నుంచి రోజూ ఏకంగా 120 భారీ వాణిజ్య నౌకలు దర్జాగా ప్రయాణించేవి. కానీ, ఈ మార్చి 1 నుంచి 25వ తేదీల మధ్య.. కేవలం 155 ట్యాంకర్లు మాత్రమే భయంభయంగా హర్మూజ్‌ను దాటగలిగాయి. ఇందులో 99 కేవలం చమురు, గ్యాస్ ట్యాంకర్లే. అంటే ఏకంగా 95 శాతం మేర నౌకల రాకపోకలు ఆగిపోయాయంటే.. ఇరాన్ దిగ్బంధనం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అగ్రనేతలు రాలిపోతున్నా.. ఏమాత్రం తగ్గని ఇరాన్!
ఇదిలా ఉండగా, ఈ రక్తపాత యుద్ధంలో తమ అగ్రనేతలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా.. ఇరాన్ మాత్రం తన స్థైర్యాన్ని ఏమాత్రం కోల్పోవడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఫిబ్రవరి 28న పక్కా ప్లాన్‌తో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో దాడులు ప్రారంభించిన మొదటి రోజునే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా ఎందరో ముఖ్య నేతలు, కమాండర్లు మృత్యువాత పడ్డారు. దీంతో ఇరాన్ పనైపోయిందని, ఇక వారు లొంగిపోవడం ఖాయమని అమెరికా సహా దాదాపు ప్రపంచ దేశాలన్నీ బలంగా అభిప్రాయపడ్డాయి. కానీ, ఆ అభిప్రాయం పచ్చి అబద్ధమని కేవలం కొద్ది గంటల్లోనే తేలిపోయింది. ఇరాన్ ప్రతీకార దాడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇప్పుడు దారుణంగా బోల్తాపడ్డాయి.
అమెరికాను ఆత్మరక్షణలో పడేసిన ఇరాన్ దెబ్బ!
పశ్చిమాసియాలో పాతుకుపోయిన అమెరికా సైనిక స్థావరాలతో పాటు.. వారి మిత్రులైన గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను నేరుగా టార్గెట్ చేసుకుని ఇరాన్ సైన్యం ఇప్పుడు ఏకధాటిగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. నిప్పులు కురిపిస్తున్న ఈ వ్యూహం అగ్రరాజ్యం అమెరికాను తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. ఈ ఊహించని పరిణామంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వెనక్కితగ్గి శాంతి చర్చలకు దిగొచ్చారు. ఇప్పుడు ఎలాగైనా ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
హత్యలతో భయపెట్టాలని చూసిన అగ్రరాజ్యాలకు.. ఇప్పుడు ప్రాణభయంతో పోరాడుతున్న ఇరాన్ చూపిస్తున్న తెగింపు చుక్కలు చూపిస్తోంది!
Also Read:
నల్ల సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. పెట్రోల్ మంట తప్పదా?ఏఐ స్టార్టప్‌తో రైతుల కష్టాలు తీరుస్తున్న 17 ఏళ్ల కుర్రాడు!
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్.. హార్మూజ్ జలసంధి ఓపెన్!
తారిఖ్ రంజాన్‌కు 18 ఏళ్ల జైలు: ఆక్స్ఫర్డ్ మాజీ ప్రొఫెసర్ అత్యాచార పర్వం!
బంగ్లాదేశ్ పద్మా నదిలో మునిగిన బస్సు: 23 మంది జలసమాధి

