విద్యార్థినికి క్లాస్‌లోనే 'ఐ లవ్ యూ' చెప్పి చెప్పుదెబ్బలు తిన్న ప్రొఫెసర్!

naveen
By -

విద్యార్థినికి క్లాస్‌లోనే 'ఐ లవ్ యూ' చెప్పి చెప్పుదెబ్బలు తిన్న ప్రొఫెసర్!


క్లాస్‌రూమ్‌లో కీచక పర్వం.. విద్యార్థినికి 'ఐ లవ్ యూ' చెప్పి చెప్పుదెబ్బలు తిన్న ప్రొఫెసర్!


విద్యాబుద్ధులు నేర్పి దారి చూపాల్సిన ప్రొఫెసర్.. బుద్ధి వక్రీకరించి అడ్డదారి తొక్కితే ఏమవుతుంది? ఆ విద్యాలయం అగ్నిగుండంగా మారుతుంది! కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని ఒక ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో సరిగ్గా ఇదే జరిగింది. నిండు క్లాస్‌రూమ్‌లో అందరు విద్యార్థుల ముందే.. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తన విద్యార్థినికి సిగ్గులేకుండా 'ఐ లవ్ యూ' చెప్పి ప్రపోజ్ చేయడం పెను సంచలనంగా మారింది. ఈ కీచక పర్వంతో రగిలిపోయిన విద్యార్థులు.. ఆ ప్రొఫెసర్‌కు దేహశుద్ధి చేసి, చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన రియల్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత సంచలనాత్మక విషయం ఏమిటంటే.. ఈ కీచక ఘటన జరిగిన 'శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ (SSMC)' సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వరది కావడం గమనార్హం!


క్లాస్‌రూమ్‌లో చాక్లెట్లు.. కీచక ప్రపోజల్! 


సరిగ్గా క్లాస్ జరుగుతున్న సమయం. అబ్దుల్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరి ముందూ మైక్ పట్టుకుని ఒక వింతైన స్పీచ్ అందుకున్నాడు. "మీ బ్యాచ్ చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమను నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకే.. మీ బ్యాచ్‌లోనే అత్యంత ముఖ్యమైన, అందమైన అమ్మాయిలలో ఒకరికి ఇప్పుడే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను" అని ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రకటించాడు. 


"నేను మీ బ్యాచ్ మొత్తానికి సంతోషంగా చాక్లెట్లు ఇస్తాను" అని చెబుతూనే, ఏకంగా ఆ మెడిసిన్ విద్యార్థిని వైపు చూస్తూ 'ఐ లవ్ యూ' అని చెప్పేశాడు. ఇదంతా క్లాస్‌లో ఉన్న మరో విద్యార్థి తన మొబైల్‌లో వీడియో తీయడంతో.. ఈ కీచక పర్వం మొత్తం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది.


ఆధారాలు ఉన్నాయంటూ బుకాయింపు.. 


అతడు పోడియం పైనుంచి కిందకు దిగుతుండగానే.. ఆ విద్యార్థిని షాక్‌లోంచి తేరుకుని అతడిని నిలదీసింది. నేరుగా వెళ్లి ప్రిన్సిపాల్‌‌కు ఫిర్యాదు చేస్తానని తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఆ ప్రొఫెసర్ ఏమాత్రం భయపడకుండా, పైగా ఎదురుదాడికి దిగాడు. ఈ వాగ్వాదం సమయంలో.. అసలు ఆమే ముందు తనపై ప్రేమను వ్యక్తం చేసిందని, ఇందుకు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ బుకాయించడం గమనార్హం.


"నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదా?" అని అందరి ముందే ప్రొఫెసర్ అనడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఖంగుతింది. "నేను నీకు ఎప్పుడు చెప్పాను?" అని ఆ విద్యార్థిని గట్టిగా నిలదీస్తే.. "నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది" అని ఆయన దబాయించాడు. వెంటనే ఆ ఆధారం ఏంటో బయటపెట్టాలని ఆమె కరాఖండీగా నిలదీయడంతో, నీళ్లు నమిలిన ఆ ప్రొఫెసర్ "రేపు నీతో పర్సనల్‌గా మాట్లాడుతాను" అని చెప్పి అక్కడినుంచి జారుకునే ప్రయత్నం చేశాడు.


చెప్పు దెబ్బలు.. కారులో ఛేజింగ్! 


ఆ కీచకుడితో కనీసం మాట్లాడటానికి కూడా ఆ విద్యార్థిని ససేమిరా అనడంతో.. "పర్వాలేదు" అని క్యాజువల్‌గా అన్న ఆ ప్రొఫెసర్, విద్యార్థులందరినీ టేబుల్ మీద ఉన్న చాక్లెట్లు తీసుకోవాలని కోరి, దర్జాగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఈ కీచక వార్త కాలేజీ అంతటా వ్యాపించడానికి ఎంతో సమయం పట్టలేదు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థుల రక్తం మరిగిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులంతా ఏకమై ఆ ప్రొఫెసర్‌ను చుట్టుముట్టి నిలదీశారు.


మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత విద్యార్థులంతా కలసి ఆ కీచక ప్రొఫెసర్‌పై మూకుమ్మడి దాడికి దిగారు. బాధితురాలైన ఆ విద్యార్థిని ఏకంగా తన చెప్పు తీసి ఆ ప్రొఫెసర్‌ను చెంపపగిలేలా కొట్టడం, మిగతా విద్యార్థులు ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించడం మరో వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. భయంతో పరుగులు తీసిన ఆ ప్రొఫెసర్‌ను విద్యార్థులు వెంబడించి మరీ ఛేజ్ చేశారు. ఆయన తన కారులో ఎక్కి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేయగా.. అక్కడే కారులో ఉన్న అతడిపై దాడి చేసినట్లు సమాచారం.



యాజమాన్యం సీరియస్.. సస్పెన్షన్ వేటు! 


విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ప్రొఫెసర్.. చివరికి అక్కడి నుంచి తన కారులో ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు. కర్ణాటక హోంమంత్రికి చెందిన కాలేజీలో జరిగిన ఈ దారుణ ఘటనపై యాజమాన్యం వెంటనే తీవ్రంగా స్పందించింది. ఆ కీచక ప్రొఫెసర్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి, ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

గురువు అనే పదానికే మచ్చతెచ్చిన ఇలాంటి కీచకులు కాలేజీల్లో ఉన్నంతకాలం.. ఆడపిల్లలకు రక్షణ ఎక్కడిది?