ఐపీఎల్ ఫీవర్: 'మేము వీఐపీలం.. క్యూలో నిలబడలేం' తలా 5 ఫ్రీ టికెట్లు కావాల్సిందేనని ఎమ్మెల్యేల దంగల్!
క్రికెట్ అభిమానుల నరనరాల్లో ఉత్సాహం నింపుతూ మరో రెండు రోజుల్లో (మార్చి 28న) 'ఐపీఎల్ 2026' మెగా సంగ్రామం మొదలుకాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తొలి మ్యాచ్‌లో ఢీకొట్టనున్నాయి. గ్రౌండ్‌లో క్రికెట్ యుద్ధం మొదలవ్వకముందే అటు కర్ణాటక అసెంబ్లీలో మాత్రం 'టికెట్ల దంగల్' మొదలైంది! "మేము వీఐపీలం, సామాన్యుల్లా క్యూలో నిలబడలేం.. మాకు కచ్చితంగా ఐదు టికెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే" అంటూ కర్ణాటక ఎమ్మెల్యేలు క్రికెట్ అసోసియేషన్‌పై కన్నెర్రజేస్తున్నారు.
వీఐపీలం.. సామాన్యుల్లా క్యూలో నిలబడాలా?
హుంగుండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ ఈ వివాదానికి అసెంబ్లీ వేదికగా ఆజ్యం పోశారు. ప్రజాప్రతినిధులైన తమ కోసం స్టేడియంలో ప్రత్యేకంగా వీఐపీ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఐపీఎల్ పండుగ మొదలవుతోంది కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలు మ్యాచ్ చూసేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) కనీసం టికెట్లు కూడా కేటాయించలేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నుంచి కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటారు, అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు, కానీ ప్రజాప్రతినిధులైన మమ్మల్ని మాత్రం ఏమాత్రం గౌరవించరు అంటూ ఆయన మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు.
బ్లాక్ మార్కెట్ దందా.. స్పీకర్‌కు ఫిర్యాదు
ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో భారీగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కాశప్పనవర్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు లేవనెత్తగా, తాను పూర్తి మద్దతు తెలిపానని ఆయన చెప్పారు. KSCAపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఎమ్మెల్యేకు కనీసం ఐదు టికెట్లు ఇచ్చేలా ఆదేశించాలని నేరుగా స్పీకర్‌నే కోరినట్లు ఆయన వెల్లడించారు.
అసోసియేషన్‌పై ఎమ్మెల్యే ఫైర్.. తీవ్ర హెచ్చరికలు
మేము ప్రజాప్రతినిధులం, వీఐపీలం! సామాన్యుల్లా గంటల తరబడి క్యూ లైన్లలో అస్సలు నిలబడలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. గతసారి మ్యాచ్‌కు వెళ్ళినప్పుడు క్యూలో నిలబడాల్సి వచ్చిందని, తమను కూడా సాధారణ ప్రజలతో కలిపి ఒకే గ్యాలరీలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని ఆయన తేల్చిచెప్పారు. వాళ్లు ఎవరి మాటా వినరని, తాము చాలా పెద్దవాళ్లం అయిపోయామని ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. జనం దగ్గర డబ్బులు దండుకుని వాళ్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోనని కాశప్పనవర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రూ.1600 అద్దెకే 16 ఎకరాలా? ప్రతిపక్ష నేత ఆగ్రహం
అధికార పక్షం మాత్రమే కాదు.. ప్రతిపక్ష నేత ఆర్ అశోక సైతం KSCA తీరుపై నిప్పులు చెరిగారు. చిన్నస్వామి స్టేడియం కోసం ఏకంగా 16.32 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని నెలకు కేవలం రూ. 1600 నామమాత్రపు అద్దెకు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. కానీ, తీరా మ్యాచ్‌లు వచ్చేసరికి తమ దగ్గరే టికెట్లకు వేలాది రూపాయలు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వారి వద్ద ఇప్పటికే కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయని, వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వం వెంటనే మరో కొత్త స్టేడియం నిర్మించాలని ఆయన అసెంబ్లీని కుదిపేశారు.
రంగంలోకి స్పీకర్, డిప్యూటీ సీఎం!
ఈ పొలిటికల్ హీట్‌పై అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సైతం సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేల ఆవేదన సరైనదేనని, ఈ సమస్యపై ప్రభుత్వం తప్పక క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరపాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలకు వాళ్లు ఒక్కోసారి కేవలం ఒకే ఒక్క టికెట్ ఇస్తున్నారని, వాళ్లు కుటుంబంతో వెళ్లినప్పుడు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని గట్టిగా చెప్పాలని స్పీకర్ సూచించారు. దీనిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెంటనే స్పందిస్తూ.. ఈ విషయాన్ని కచ్చితంగా KSCA అధికారుల దృష్టికి తీసుకెళ్తానని సభలో హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు టికెట్లు అడిగే హక్కు నూటికి నూరు శాతం ఉందని, ఆ గౌరవం వారికి దక్కితీరాల్సిందేనని శివకుమార్ తేల్చిచెప్పారు.
గ్రౌండ్‌లో బ్యాట్లు ఝుళిపించే ఆటగాళ్ల కంటే ముందే.. అసెంబ్లీలో పొలిటికల్ లీడర్లు చేస్తున్న ఈ 'టికెట్ల బ్యాటింగ్' చూస్తుంటే.. ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థమైపోతోంది!
Also Read:
గల్ఫ్ యుద్ధం.. భారత్‌లో టెన్షన్: రేపు సీఎంలతో ప్రధాని మోదీ మీటింగ్!గల్ఫ్ యుద్ధం ఎఫెక్ట్: కేరళ ఎలక్షన్స్‌లో 22 లక్షల ఓటర్ల పరిస్థితి ఏంటి?
గ్యాస్ సిలిండర్ రూల్స్ మారాయా? అసలు నిజం బయటపెట్టిన కేంద్రం!
పిల్లల సోషల్ మీడియా వాడకంపై మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
ఢిల్లీలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఆ భవనాలు ఖాళీ చేయాలి!

