తారిఖ్ రంజాన్‌కు 18 ఏళ్ల జైలు: ఆక్స్‌ఫర్డ్ మాజీ ప్రొఫెసర్ అత్యాచార పర్వం!

naveen
By -

తారిఖ్ రంజాన్‌కు 18 ఏళ్ల జైలు


ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ముసుగులో కీచక పర్వం.. ప్రపంచ ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడికి 18 ఏళ్ల కఠిన కారాగారం!


సమాజానికి నీతులు చెప్పే నోళ్లే.. తెరవెనుక చీకటి పనులు చేస్తే ఎలా ఉంటుంది? ఒకప్పుడు ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పిన ఒక విద్యావేత్త.. ఇప్పుడు అత్యాచార దోషిగా బోనులో నిలబడటం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన స్విస్ ఇస్లామిక్ పండితుడు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ తారిఖ్ రంజాన్ అరాచకాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. 


ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు మహిళలపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టులో నిస్సందేహంగా రుజువైంది. దీంతో పారిస్ క్రిమినల్ కోర్టు బుధవారం ఆయనకు 18 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఐరోపా ఇస్లామిక్ విద్యావేత్తగా ఎంతో గౌరవం పొందిన ఈ పెద్దమనిషి.. ఇంతటి క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని తెలిసి ప్రపంచం నివ్వెరపోతోంది.


ఏడేళ్ల చీకటి సామ్రాజ్యం.. ముగ్గురిపై అఘాయిత్యాలు! 


కోర్టు వెల్లడించిన నిజాలు వింటే గుండె రక్తం కన్నీరవుతుంది. 2009 నుంచి 2016 మధ్యకాలంలో.. అంటే ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు ముగ్గురు అమాయక మహిళలపై తారిఖ్ రంజాన్ విచక్షణారహితంగా అత్యాచారానికి పాల్పడినట్లు కోర్టు స్పష్టంగా నిర్ధారించింది. ఈ ఏడాది (2026) మార్చి 2 నుంచి పారిస్‌లో ఈ సంచలన కేసు విచారణ కొనసాగుతోంది. 


కానీ, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రంజాన్ ఏ ఒక్క రోజూ విచారణకు హాజరు కాలేదు. పైగా, తనకు 'మల్టిపుల్ స్క్లెరోసిస్' అనే భయంకరమైన వ్యాధి తీవ్రత పెరిగిందని, జెనీవాలో ఆసుపత్రి పాలయ్యానంటూ ఆయన న్యాయవాది ద్వారా కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అదంతా పచ్చి అబద్ధమని తేలడంతో కోర్టు ఆ వాదనను నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది.


ఫ్రాన్స్‌లో శాశ్వత నిషేధం.. తక్షణ అరెస్టుకు ఆదేశాలు! 


అతడి ఆగడాలపై ప్రిసైడింగ్ జడ్జి కోరిన్ గోట్జ్‌మాన్ సీరియస్ అయ్యారు. 63 ఏళ్ల తారిక్ రంజాన్‌ను ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయాలని గట్టిగా ఆదేశిస్తూ వారెంట్ జారీ చేశారు. అంతేకాదు, 18 ఏళ్ల శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా ఆ కీచకుడు భవిష్యత్తులో ఫ్రాన్స్ భూభాగంలో అడుగు పెట్టకుండా శాశ్వత నిషేధం (లైఫ్ టైమ్ బ్యాన్) విధిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది.


అటు స్విట్జర్లాండ్‌లో కూడా అతడి పాపాలు పండాయి. గత ఏడాది (2025లో) స్విట్జర్లాండ్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో రంజాన్‌కు అక్కడి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దానికి వ్యతిరేకంగా ఆయన స్విస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ అప్పీల్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది.


మీ టూ (MeToo) ఉద్యమంతో బద్దలైన అసలు బాగోతం! 


ఒకప్పుడు ఈయన ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కాంటెంపరరీ ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్‌గా, ఖతార్, మొరాకో విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా తారిఖ్ రంజాన్ ఎన్నో అత్యున్నత సేవలు అందించారు. కానీ, 2017లో ప్రపంచాన్ని కుదిపేసిన 'మీ టూ' ఉద్యమ సమయంలో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా ఈయనపై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఒక గొప్ప విద్యావేత్తగా ఉన్న ఆయన ప్రతిష్ట ఒక్కసారిగా మంటగలిసిపోయింది. ఆ దెబ్బకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెంటనే ఆయన్ని విధుల నుంచి అవమానకరంగా తొలగించింది.


తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను నిర్దోషినని రంజాన్ ఇప్పటికీ కోర్టులో మొండిగా వాదిస్తున్నాడు. కానీ, బాధితుల వాంగ్మూలాలు, కళ్లముందున్న పక్కా ఆధారాలను నిశితంగా పరిశీలించిన పారిస్ కోర్టు.. ఆయన చేసిన నేరాలు అత్యంత ఘోరమైనవని అభివర్ణించింది. ప్రొఫెసర్ ముసుగులో ఏళ్ల తరబడి మహిళల జీవితాలతో ఆడుకున్న ఈ నరరూప రాక్షసుడికి.. ఎవరూ ఊహించని విధంగా 18 ఏళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తూ న్యాయదేవత తన ప్రతాపాన్ని చూపించింది!