ట్రంప్‌తో నో.. వాన్స్‌తో ఓకే: అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్!

naveen
By -

US Iran War, Donald Trump, JD Vance

ట్రంప్‌తో నో.. వాన్స్‌తో అయితే ఓకే: అమెరికాకు ఇరాన్ ఝలక్! డబుల్ గేమ్ ఆడుతున్న అగ్రరాజ్యం


పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను విడగొట్టేందుకు తెరవెనుక దౌత్య మంత్రాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండుతున్న ఇరాన్-అమెరికా పచ్చగడ్డి మధ్య నీళ్లు చల్లేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగింది. కానీ, శాంతి కోసం చేయి చాస్తున్నట్లే కనిపిస్తున్న ఇరాన్.. ఒక ఊహించని మెలిక పెట్టింది. "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గానీ, ఆయన అధికారులతో గానీ మేము ఎలాంటి చర్చలు జరపబోం. మాకు అమెరికా వైస్-ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో చర్చలు జరపడానికే ప్రాధాన్యత ఇస్తాం" అని ఇరాన్ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ ఒక్క ప్రకటనతో అమెరికా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేగింది.


కుష్నర్, విట్కాఫ్ వద్దు.. వాన్స్ మాత్రమే ముద్దు! 


ప్రస్తుతం అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ సొంత అల్లుడు జారెడ్ కుష్నర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ చర్చలు ఏమాత్రం విజయవంతమయ్యే అవకాశం లేదని ఇరాన్ ప్రతినిధులు ఖరాఖండీగా చెప్పినట్లు ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. గతంలో వీరు చేసిన చర్చలన్నీ దారుణంగా విఫలం కావడం, వారిపై ఇరాన్‌కు కనీస నమ్మకం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది.


మరి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను మాత్రమే ఇరాన్ ఎందుకు విశ్వసిస్తోంది? ట్రంప్ ప్రభుత్వంలోని మిగతా అధికారులందరి కంటే, ఈ భీకర యుద్ధాన్ని ముగించేందుకు జేడీ వాన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ భయంకరమైన సంఘర్షణకు బాంబులతో కాదు, దౌత్యపరమైన పరిష్కారమే సరైనదని ఆయన మద్దతు ఇస్తున్నారు. సరిగ్గా యుద్ధం ప్రారంభానికి ముందు.. అణు చర్చల సమయంలో కూడా వాన్స్ "సామరస్యంగా దారికి తెచ్చుకోవాలి" అని అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క పాయింటే వాన్స్‌పై ఇరాన్‌కు అపారమైన నమ్మకాన్ని కలిగించింది.


అయితే, ఈ యుద్ధాన్ని ముగించేలా ఒక ఒప్పందానికి రావడం అనేది అత్యంత సంక్లిష్టమైన, రాజకీయంగా సున్నితమైన వ్యవహారం కావడంతో.. ప్రత్యక్ష చర్చలు జేడీ వాన్స్‌కు ముప్పు కలిగించవచ్చనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


టీమ్ ఎంపిక ట్రంప్‌దే.. వైట్‌హౌస్ కౌంటర్! 


కానీ, ఈ మహా చదరంగంలో తుది నిర్ణయం ఎవరిది? అమెరికా తరపున చర్చల్లో ఎవరు కూర్చోవాలనే ఫైనల్ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌దేనని ఇరాన్ అధికారులు కూడా అంతర్గతంగా ఒప్పుకున్నారు. సంప్రదింపుల బృందాన్ని కేవలం అధ్యక్షుడు మాత్రమే నిర్ణయిస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టీ అధికారికంగా స్పష్టం చేశారు.


ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీవ్ విట్కాఫ్, కుష్నర్‌లతో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ చారిత్రాత్మక దౌత్య చర్చల్లో భాగస్వామ్యం కాబోతున్నారని లెవిట్టీ కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ వారంలోనే ఈ మహా చర్చలు జరిగే అవకాశం ఉంది.


అమెరికా డబుల్ గేమ్.. శాంతి మంత్రం, సైనిక తంత్రం! 


ఒకవైపు చర్చలు జరుపుతామని ప్రపంచానికి తీయ్యగా చెబుతున్న అమెరికా.. పశ్చిమాసియాకు మాత్రం సైలెంట్‌గా మరిన్ని యుద్ధ బలగాలను పంపుతూనే ఉంది. ఇప్పటికే పశ్చిమాసియా గడ్డపై 50 వేల మంది అత్యంత సుశిక్షితులైన అమెరికా సైనికులు మొహరించి ఉండగా.. కేవలం మూడు రోజుల్లోనే అత్యంత భయంకరమైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన మరో 1000 మంది కమాండోలను అమెరికా అక్కడికి పంపడం గమనార్హం. వీరికి తోడుగా, ఇంకో 5 వేల మంది భీకర మెరైనర్లను (సైనికులను) పంపేందుకు అగ్రరాజ్యం చాపకింద నీరులా సన్నాహాలు చేస్తోంది.


కండిషన్స్ అప్లై.. ఎవరికి వారే యమునా తీరే! 


ఈ హై-వోల్టేజ్ డ్రామా మధ్య, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, హెజ్బొల్లా, హౌతీల (Houthi) వంటి సాయుధ ఉగ్ర గ్రూపులకు ఇకపై ఎలాంటి సహకారం అందించబోమని పక్కా హామీ ఇవ్వాలంటూ.. ట్రంప్ మొత్తం 15 కఠినమైన ప్రతిపాదనలు (కండిషన్లు) చేశారు. కానీ, ఇరాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, "అసలు అమెరికాతో మాకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలే జరగడం లేదు. ట్రంప్ బహుశా తనతో తానే చర్చించుకుంటున్నట్లు ఉన్నారు" అని టెహ్రాన్ ఘాటుగా ఎద్దేవా చేసింది.


ఇది చాలదన్నట్లు, అమెరికాతో ఒప్పందం చేసుకోవాలంటే ఇరాన్ కూడా అసాధ్యమైన ఐదు కండిషన్లు పెట్టింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలని, యుద్ధం వల్ల తమకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనికి తోడు.. ప్రపంచ వాణిజ్య నాడి అయిన హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తిస్థాయి హక్కులు ఉండాలని, అక్కడి నుంచి వెళ్లే ప్రతి కంటెయినర్‌కు 'అదనపు రుసుం' వసూలు చేసుకునే అధికారం తమకే ఇవ్వాలని ఇరాన్ పట్టుబడుతోంది.


శాంతి కోసం వేసే ప్రతి అడుగులోనూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ పశ్చిమాసియా మహా సంగ్రామం.. చివరకు ముగుస్తుందా? ముంచుతుందా? కాలమే తేల్చాలి.