సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో జూబ్లీహిల్స్ డాక్టర్ అరెస్ట్.. ఊహించని మలుపులు!
రాజకీయం, డబ్బు, డ్రగ్స్.. ఈ మూడు కలిస్తే అది పక్కా హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను తలపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కూడా అచ్చం ఇలాగే ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ, ఆపై ఏకంగా పోలీసుల పైనే జరిగిన కాల్పుల వ్యవహారం.. ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ హై-ప్రొఫైల్ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. నిజాలను నిగ్గు తేల్చేందుకు 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)'ను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన 'బాలాజీ' అనే డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడంతో.. ఈ కేసు ఒక ఊహించని మలుపు తిరిగింది.
జూబ్లీహిల్స్ డాక్టర్ ఇల్లే.. డ్రగ్స్ డెన్!
చదువుకున్న డాక్టరే.. ఇలాంటి చీకటి దందాకు తెరతీశాడని తెలిసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. డాక్టర్ బాలాజీ ఇంటినే ఒక రహస్య 'డెన్'గా మార్చుకుని.. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి సహా మరికొంతమంది బడాబాబులు ప్రతీ నెలా క్రమం తప్పకుండా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్లు సిట్ అధికారుల విచారణలో బట్టబయలైంది. అదే సమయంలో స్వయంగా డాక్టర్ బాలాజీ కూడా డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు మెడికల్ రిపోర్ట్స్ ద్వారా తేలింది.
బుధవారం అర్ధరాత్రి ఆ డాక్టర్ ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాకేష్ వర్మ అనే ఒక పేరుమోసిన డ్రగ్ పెడ్లర్ నుంచి డాక్టర్ బాలాజీ.. ప్రాణాలు తీసే ఎండీఎంఏ సహా మరికొన్ని రకాల ఖరీదైన డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలు దొరికాయి. అలా కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు విచ్చలవిడిగా వినియోగించారని, వాటికి సంబంధించిన కోట్ల రూపాయల చీకటి ట్రాన్సాక్షన్లను కూడా సిట్ అధికారులు చాకచక్యంగా సేకరించారు.
పెరుగుతున్న నిందితులు.. రాజస్థాన్‌లో డ్రగ్ పెడ్లర్ వేట
సిట్ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తులో సినిమాలోని ట్విస్ట్‌ల మాదిరిగా ప్రతిరోజూ మరికొందరు కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సంచలన డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు 11 మందిని నిందితులుగా గుర్తించగా.. తాజాగా డాక్టర్ బాలాజీ ఎంట్రీతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య ఏకంగా 15కి పెరిగింది. మరోవైపు.. ఈ చీకటి సామ్రాజ్యానికి సరుకు సరఫరా చేస్తున్న కీలక డ్రగ్ పెడ్లర్ 'రాకేష్ వర్మ'.. ప్రస్తుతం రాజస్థాన్‌లో తలదాచుకున్నట్లు సిట్ అధికారులు పక్కాగా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
కస్టడీలో రోహిత్ రెడ్డి.. ఐదేళ్లుగా డ్రగ్స్ వ్యసనం!
మరోవైపు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ అయి కటకటాలు లెక్కపెడుతున్న ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీ బడా బిజినెస్‌మెన్ నమిత్ శర్మలను.. సిట్ అధికారులు కోర్టు అనుమతితో రెండో రోజు కూడా కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో ఇంటరాగేట్ చేశారు.
ఈ దర్యాప్తులో అదిరిపోయే నిజం ఏంటంటే.. దాదాపు గత 5 ఏళ్ల నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ తీసుకునే తీవ్రమైన అలవాటు ఉన్నట్లు అధికారులు పక్కాగా గుర్తించారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న కొందరు స్మగ్లర్లతో, డ్రగ్ పెడ్లర్లతో ఆయనకున్న చీకటి సంబంధాలు, అనేక భారీ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. గతంలో టాలీవుడ్‌ను కుదిపేసిన కొన్ని డ్రగ్స్ కేసుల్లోనూ పైలట్ రోహిత్ రెడ్డి పేరు బయటికి రాగా.. ఆ కోణంలో కూడా సిట్ అధికారులు ఇప్పుడు ఆయనను ఓ రేంజ్‌లో ప్రశ్నిస్తున్నారు.
పార్టీలో రెండు రకాల డ్రగ్స్.. పోలీసుల ఆధారాలివే!
రెండో రోజు కస్టడీలో ప్రధానంగా ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న 11 మంది నిందితుల మధ్య ఉన్న అక్రమ సంబంధాలపై సిట్ లోతుగా ఆరా తీసింది. వీరు తరచూ ఎందుకు కలుస్తున్నారు? ఆ అనుమానాస్పద బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఎవరి కోసం చేశారనేది గట్టిగా ప్రశ్నించారు. ఈ కిలాడీ నిందితులు పోలీసుల కళ్లుగప్పి వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ సేవించినట్లు సాంకేతిక ఆధారాలు సేకరించారు.
ఈనెల 14వ తేదీన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఆ పాడు పార్టీకి.. ఏకంగా 2 రకాల డ్రగ్స్ ఉపయోగించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పార్టీకి ముందుగా ఖరీదైన కొకైన్, ఆ తర్వాత ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం.
ఎంపీకి కూడా డ్రగ్స్ లింక్? మెడికల్ రిపోర్ట్స్‌లో సంచలనం!
పార్టీ జరిగిన రోజు రాత్రి.. తెలంగాణ ఈగల్ టీమ్, మొయినాబాద్ పోలీసులు ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేసినప్పుడు, అక్కడ వారు వినియోగించగా మిగిలిపోయిన 0.26 గ్రాముల కొకైన్‌ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు ఈ రెండు రకాల డ్రగ్స్‌ను అత్యంత ఖరీదైన మద్యంలో కలిపి సేవించి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే వైద్య పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి నలుగురికీ కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని.. ఇక ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ శాంపిల్స్‌లో అయితే యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు స్పష్టంగా తేలిందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో ఇరుక్కున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శాంపిల్స్‌లో కూడా యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఉన్నట్లు వెల్లడికావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
క్లైమాక్స్ ఏంటి?
డబ్బు, పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకునే బడా నేతలకు ఈ కేసు ఒక చెంపపెట్టు లాంటిది. సిట్ దర్యాప్తు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో ఈ డ్రగ్స్ కేసు ఇంకెంత మంది పెద్దల మెడకు ఉచ్చు బిగిస్తుందో చూడాలి!
Also Read:
పాతబస్తీలో నకిలీ ఓనర్ల స్కెచ్.. అద్దె ఇళ్లతో టోకరా!ప్రభుత్వ బడుల్లో చేపల కూర.. సర్కార్ దవాఖానాల్లో విదేశీ వైద్యులు!
ఇప్ప పువ్వుతో 100 ఏళ్ల ఆయుష్షు గ్యారెంటీనా? డాక్టర్లు, సైన్స్ ఏం చెబుతున్నాయంటే!
ఇప్ప సారా తాగితే 100 ఏళ్లు గ్యారెంటీ.. అసెంబ్లీలో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కర్మసిద్ధాంతం ఎటు తీసుకెళ్తే అటు.. రాజీనామా వేళ జీవన్ రెడ్డి ఎమోషనల్

