Stock Market Crash: గల్ఫ్ యుద్ధంతో మార్కెట్లు క్రాష్.. ఆవిరైన 10 లక్షల కోట్లు

naveen
By -

పశ్చిమాసియాలో పడుతున్న బాంబుల సౌండ్ కంటే.. ఇక్కడ మన స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న సౌండ్ ఇన్వెస్టర్ల గుండెల్ని ఎక్కువగా పిండేస్తోంది. "యుద్ధం ఎక్కడో జరుగుతుంటే మనకెందుకులే" అని లైట్ తీసుకుంటే పొరపాటే.. కేవలం ఒక్కరోజులోనే దలాల్ స్ట్రీట్‌లో 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయంటే సామాన్యుడి ఈఎంఐలు (EMI), పెట్రోల్ ఖర్చులు రేపు ఎలా పెరగబోతున్నాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ మార్కెట్ మారణహోమానికి కారణం ఏంటి? ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆర్బీఐ వడ్డీ రేట్లకు ఎందుకు లింక్ పడిందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.


Stock Market Crash


సెన్సెక్స్ బ్లడ్‌బాత్.. 10 లక్షల కోట్లు ఫసక్!


ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఐదో రోజుకు చేరిన యుద్ధం దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు పేకమేడలా కూలిపోయాయి. బుధవారం (మార్చి 4న) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1122 పాయింట్లు పతనమై 79,116 వద్ద ముగియగా, నిఫ్టీ 385 పాయింట్లు కోల్పోయి 24,480కి పడిపోయింది.


ఈ భారీ పతనంతో బీఎస్ఈ (BSE)లో నమోదిత కంపెనీల విలువ అమాంతం రూ.10 లక్షల కోట్లు హరించుకుపోయి, మొత్తం మార్కెట్ విలువ రూ.456 లక్షల కోట్లకు పడిపోయింది. యుద్ధ భయంతో విదేశీ మదుపరులు భారీగా అమ్మకాలకు తెగబడటం, రూపాయి విలువ పతనం కావడం మార్కెట్ల నడ్డి విరిచాయి.


హార్ముజ్ జలసంధి క్లోజ్.. మండుతున్న ఆయిల్ రేట్లు


ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే మెయిన్ గేట్ లాంటి 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ మూసివేయడంతోనే అసలు టెన్షన్ మొదలైంది. దీని దెబ్బకు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లు దాటేయగా, పెట్టుబడులకు సేఫ్ ఆప్షన్ అయిన బంగారం ధర ఔన్స్ 5185 డాలర్లకు చేరుకుంది.


మన ఇండియా వాడే ఆయిల్‌లో 85 శాతం దిగుమతుల మీదే ఆధారపడింది. ఇప్పుడు క్రూడాయిల్ రేట్లు ఇలాగే పెరిగితే.. మన దేశంలో కరెంట్ ఖాతా లోటు పెరిగి, పెట్రోల్ రేట్లతో పాటు ద్రవ్యోల్బణం మళ్లీ భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది.


వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమే.. ట్రంప్ కామెంట్స్ తో టెన్షన్


ఈ యుద్ధం ఇంకో నాలుగైదు వారాలు, లేదా అంతకంటే ఎక్కువే కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లను మరింత భయపెడుతోంది. గ్లోబల్ గా నెలకొన్న ఈ ఉద్రిక్తతల వల్ల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఆయిల్ రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగితే.. ఆర్బీఐ (RBI) కానీ, అమెరికా ఫెడ్ కానీ ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తే ఉండదు. దీనివల్ల ఇల్లు, బండి కొనుక్కున్న సామాన్యుడి ఈఎంఐ (EMI) భారం ఏమాత్రం తగ్గకపోగా, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది కేవలం షేర్లు కొన్నవాళ్లకే కాదు, బ్యాంక్ లోన్ కడుతున్న, పెట్రోల్ బండి వాడుతున్న ప్రతి సామాన్యుడికి అతిపెద్ద అలర్ట్. యుద్ధం ముదిరి ఆయిల్ రేట్లు ఇంకా పెరిగితే పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరగడం తథ్యం. కాబట్టి ప్రస్తుత మార్కెట్ పతనాన్ని చూసి ప్యానిక్ అయ్యి ఉన్న షేర్లను నష్టాలకు అమ్మేసుకోకుండా ఉండాలి. ఈ గ్లోబల్ అనిశ్చితి తగ్గేదాకా కొత్త పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి, చేతిలో ఉన్న క్యాష్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడమే అత్యంత తెలివైన పని!