ప్రపంచానికే పెద్దన్నగా ఫీలయ్యే అమెరికా.. ఇప్పుడు యుద్ధభూమిలో చిక్కుకున్న తమ సొంత పౌరులను రక్షించుకోలేక పూర్తిగా చేతులెత్తేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర దాడులతో "మిమ్మల్ని మేం కాపాడలేం, మీ ప్రాణాలకు మీదే పూచీ" అని అమెరికా ఎంబసీ చేసిన ప్రకటన ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యానికే ఈ గతి పడితే.. రేపు పొద్దున ఏ దేశంలోనైనా యుద్ధం వస్తే మన లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటన్న భయం అందరినీ వెంటాడుతోంది. అసలు ఇజ్రాయెల్‌లో అమెరికన్ల పరిస్థితి ఎందుకింత దారుణంగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్రరాజ్యం నిస్సహాయత.. బంకర్లలో అమెరికన్లు
పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్, హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోని టెల్-అవీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తున్నారు. ఈ భయానక పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తన పౌరులకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి నోటీసు వచ్చే వరకు అమెరికన్లు, తమ దౌత్య సిబ్బంది ఎక్కడికక్కడే బంకర్లలో తలదాచుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితిలో తాము లేమని కుండబద్దలు కొట్టింది. అమెరికా రాయబారి మైక్ హకబీ సైతం తమ సిబ్బంది మొత్తం బంకర్లలోనే ఉన్నారని, తరలింపు అభ్యర్థనలు వస్తున్నా తాము ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాలకు గ్యారెంటీ లేదు.. పారిపోలేరు!
కొందరు అమెరికన్లు ఈజిప్టు సరిహద్దుల (టాబా క్రాసింగ్) గుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాలని చూస్తున్నారు. కానీ ఆ మార్గంలో వెళ్లినా మీ భద్రతకు తాము ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేమని అమెరికా ఎంబసీ తేల్చిచెప్పింది. ఇరాన్‌పై దాడికి 24 గంటల ముందే విమానాల్లో దేశం విడిచి వెళ్లాలని మెయిల్స్ పంపినా చాలా మంది వెళ్లలేకపోయారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలన్నీ దాదాపు మూతపడ్డాయి. సిబ్బంది మొత్తం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మృత్యుఘోష.. మోగుతున్న ప్రమాద సైరన్లు
నిన్న (మంగళవారం) ఉదయం నుంచి జెరూసలెం, టెల్-అవీవ్ నగరాల్లో ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఇరాన్ చేసిన దాడుల్లో 12 మంది చనిపోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ముఖ్యంగా బైట్ షీమేష్‌లో దాక్కోవడానికి వెళ్లిన ఓ బాంబు షెల్టర్ కూలిపోయి 9 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా సమీపంలోని అమెరికా పౌరులకు ముప్పు పొంచి ఉందని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా పాస్‌పోర్ట్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాజాలా బతకొచ్చు అనుకునే వాళ్లకు ఈ పరిణామం ఒక అతిపెద్ద చెంపపెట్టు. యుద్ధం వస్తే అగ్రరాజ్యం కూడా తన పౌరులను నిస్సహాయంగా వదిలేస్తుందన్న నగ్నసత్యం ఇప్పుడు బయటపడింది. ఏ దేశమైనా యుద్ధం చేసే ముందు సామాన్యుల ప్రాణాల గురించి అస్సలు ఆలోచించదు. కాబట్టి, ఉపాధి కోసం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే మన యువత.. కేవలం డబ్బును మాత్రమే కాకుండా, ఆ దేశ భౌగోళిక భద్రతను కూడా ముందుగా బేరీజు వేసుకోవడం ఎంతో అవసరం.

