ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు భూకంపం పుట్టిస్తున్న ఒకే ఒక్క పేరు రాఘవ్ చద్దా! ఒకప్పుడు పార్టీకి పోస్టర్ బాయ్‌గా, స్టార్ క్యాంపెయినర్‌గా వెలుగొందిన ఈ యంగ్ టైగర్‌కు సొంత పార్టీయే ఇప్పుడు వరుస షాకులతో ఊపిరి సలపకుండా చేస్తోంది. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి అత్యంత అవమానకరంగా ఉద్వాసన పలికిన పార్టీ అధిష్టానం, ఇప్పుడు ఆయనకున్న కట్టుదిట్టమైన భద్రతను సైతం లాగేసుకుంది. మోదీని ఎదిరించడానికి భయపడుతున్నాడంటూ సొంత నేతలే ఆయనపై ఏకిపారేస్తుంటే, తాను గందరగోళం సృష్టించడానికి రాలేదని రాఘవ్ ఫైర్ అవుతున్నాడు. అసలు ఆప్‌లో ఏం జరుగుతోంది? కేజ్రీవాల్ కోటలో రాఘవ్ చద్దా ఒంటరి ఎందుకు అయ్యాడు?
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఢమాల్.. రాఘవ్‌కు మరో షాక్!
ఇటీవలే రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి అవమానభారం మిగిల్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. యువ ఎంపీ రాఘవ్ చద్ధాకు ఇప్పుడు మరో ఊహించని మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. ఆయనకు కల్పించిన అత్యున్నత 'జెడ్ ప్లస్' (Z+) కేటగిరీ భద్రతను పంజాబ్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు బట్టబయలు చేశాయి.
ఆయన భద్రత కోసం కేటాయించిన పోలీస్ అధికారులందరినీ వెంటనే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో ఆప్ అధినాయకత్వానికి, ఎంపీ రాఘవ్ చద్ధాకు మధ్య రగులుతున్న ఆధిపత్య విబేధాలు ఇప్పుడు వీధినపడి మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే రాఘవ్ చద్దాను ఆ పదవి నుంచి తొలగించిన ఆప్.. ఆ వెంటనే ఆయన స్థానంలో లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను డిప్యూటీ లీడర్‌గా నియమించి కుండబద్దలు కొట్టింది.
మోదీ పేరు చెబితే వణుకా? సాఫ్ట్ పీఆర్‌లో రాఘవ్!
రాఘవ్ చద్దాపై ఆప్ అధినాయకత్వం చేస్తున్న ఆరోపణలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చద్దా వెనుకాడుతున్నాడని, భయపడుతున్నాడని అధిష్టానం తీవ్రంగా మండిపడింది. కేంద్రంపై పోరాడాల్సిన నాయకుడు, దానికి బదులుగా తన ఇమేజ్ పెంచుకునే 'సాఫ్ట్ పీఆర్'లో (పబ్లిక్ రిలేషన్స్) నిమగ్నమయ్యారని ఆరోపిస్తూ.. ఏప్రిల్ 2వ తేదీనే ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించింది.
పంజాబ్ ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో చద్ధా పూర్తిగా విఫలమయ్యారని ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. పార్లమెంట్‌లో ఆయన ప్రదర్శిస్తున్న ‘నిష్క్రియాత్మకత’ (సైలెంట్ గా ఉండటం) పార్టీ మూల సూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది.
రూ. 60 వేల కోట్ల నష్టం.. పెదవి విప్పని ఎంపీ!
రాఘవ్ చద్దా వ్యవహార శైలిపై పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, రాష్ట్ర ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా, పార్టీ సీనియర్ నేత కుల్దీప్ సింగ్ ధాలివాల్ ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై చద్ధా ఏమాత్రం నోరు మెదపకపోవడం, మౌనం వహించడం తమను తీవ్ర ‘నిరాశ’కు గురిచేసిందని వారు బాంబు పేల్చారు.
పంజాబ్ ఎమ్మెల్యేల మద్దతుతో సగర్వంగా రాజ్యసభకు ఎన్నికైన చద్ధా.. జాతీయ స్థాయిలో రాష్ట్ర సమస్యలను బలంగా ప్రస్తావిస్తారని తామంతా ఎంతగానో ఆశించామన్నారు. కానీ ఆయన పార్లమెంటులో పంజాబ్‌కు సంబంధించిన ‘ఒక్క సున్నితమైన అంశాన్ని కూడా’ కనీసం లేవనెత్తలేదని మంత్రి చీమా మండిపడ్డారు. ముఖ్యంగా పలు ఆర్థికపరమైన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించడంలో రాఘవ్ చద్ధా ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపించారు.
వీటిలో సుమారు రూ. 8,500 కోట్ల గ్రామీణాభివృద్ధి నిధుల (RDF) బకాయిలతో పాటు, దాదాపు రూ. 60,000 కోట్ల మేర పంజాబ్‌కు జరిగిన జీఎస్టీ నష్టాలు కూడా ఉండటం గమనార్హం. కేంద్రం చేసిన జీఎస్టీ పరిహారంలో మార్పులతో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన సమస్యలను కూడా ఆయన ఎప్పుడూ ప్రస్తావించలేదని చీమా ఆవేదన వ్యక్తం చేశారు.
నేను గందరగోళం సృష్టించడానికి రాలేదు.. చద్దా ఫైర్!
తన సొంత పార్టీ నేతలు, మంత్రులు తనపై చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలను రాఘవ్ చద్ధా ఏమాత్రం అంగీకరించలేదు. తనపై బురద చల్లే ప్రయత్నంలో భాగమే ఈ ఆరోపణలని, ఇవన్నీ పచ్చి అవాస్తవాలని ఆయన కుండబద్దలు కొట్టారు. "తాను ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తడానికే పార్లమెంటుకు వెళ్లాననీ, అక్కడ కేవలం గందరగోళం సృష్టించడానికి కాదని" ఆయన తనదైన శైలిలో పార్టీ అధిష్టానానికి ధీటుగా బదులిచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు నడుస్తున్నది కేవలం క్రమశిక్షణా చర్య కాదు, ఇదొక పక్కా రాజకీయ ప్రక్షాళన! ఒక నాయకుడు పార్టీ లైన్ దాటితే ఎంతటి స్టార్ ఇమేజ్ ఉన్నా నిర్దాక్షిణ్యంగా పక్కనపెడతామని కేజ్రీవాల్ అండ్ టీమ్ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ ఇది. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి పోవడం, జెడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేయడం చూస్తుంటే రాఘవ్ చద్దా పొలిటికల్ కెరీర్ పెద్ద అగాధంలో పడినట్లే కనిపిస్తోంది. ఆయన తిరిగి ఆప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడా, లేక ఈ ఈగో క్లాషెస్ కొత్త రాజకీయ కుంపటికి దారితీస్తాయా అన్నది కాలమే తేల్చాలి!

