Imran Khan News : ఇమ్రాన్‌ను చంపేందుకు కుట్ర!

naveen
By -
Former Pakistan PM Imran Khan and his wife Bushra Bibi


ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తినే జైలు గోడల మధ్య చిత్రహింసలు పెడుతుంటే.. ఇక ఆ దేశంలో సామాన్యుడి బతుకుకు భద్రత ఎక్కడుంటుంది? పాకిస్థాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయంగా అంతమొందించేందుకు అక్కడి సైన్యం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి ఆడుతున్న ఒక భయంకరమైన మైండ్ గేమ్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇమ్రాన్‌ను లొంగదీసుకునేందుకు ఆయన భార్యపై ప్రయోగిస్తున్న రాక్షసత్వం గురించిన మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి!


అడియాలా జైల్లో చీకటి కోణం.. బుష్రా బీబీకి నరకం!


ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని అడియాలా జైల్లో ఉండి శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఇద్దరినీ పాక్ న్యాయ వ్యవస్థ, జైలు అధికారులు అత్యంత దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.


తమను రాజకీయంగా అణచివేసేందుకు ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థ కూడా పక్కా కుట్ర పన్నుతోందని ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుమ్ సంచలన ఆరోపణలు చేశారు. అడియాలా జైల్లో బుష్రా బీబీని అత్యంత కఠినమైన ఏకాంత కారాగారంలో బంధించారని, ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్‌ను మానసికంగా దెబ్బతీసి లొంగదీసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న బ్లాక్‌మెయిల్ వ్యూహమని ఆమె నిప్పులు చెరిగారు.


ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ సైతం ధృవీకరించారు. బుష్రా బీబీని శారీరకంగా, మానసికంగా కుంగదీయడం ద్వారానే ఇమ్రాన్‌ను తమ దారికి తెచ్చుకోవాలని అధికారులు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.


న్యాయమూర్తులు ఆత్మలు అమ్ముకున్నారు.. ఇమ్రాన్ గర్జన!


ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే బెయిల్ విచారణలను జాప్యం చేస్తున్నారని అలీమా ఖానుమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. "న్యాయమూర్తులు ఇక్కడ న్యాయం చేయడం లేదు. వారు కేవలం విచారణలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ ఈ కేసు గనుక విచారణకు వస్తే అది ఎంత బలహీనమైనదో ప్రపంచానికి బయట పడుతుంది, అందుకే ప్రభుత్వం భయపడుతోంది" అని ఆమె కుండబద్దలు కొట్టారు.


తన భార్య పట్ల జరుగుతున్న ఈ అమానవీయ ప్రవర్తనపై ఇమ్రాన్ ఖాన్ తన కుమారుడు కాసిం ఖాన్‌తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "వారు నన్ను ఏం చేయలేరని వాళ్లకు బాగా తెలుసు. అందుకే కక్ష కట్టి నా భార్యను టార్గెట్ చేశారు. కనీసం వారానికి 30 నిమిషాలు కూడా ఆమెను నన్ను కలవనివ్వడం లేదు. ఈ దేశంలోని న్యాయమూర్తులు వారి ఆత్మలను అమ్ముకున్నారు" అని ఇమ్రాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ కఠిన పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనక్కి తగ్గని ఇమ్రాన్.. "ఒప్పందాలు లేవు.. లొంగుబాటు లేదు. స్వేచ్ఛ లేదా మరణం.. అంతే!" అంటూ జైలు గోడల నుంచే తన పట్టుదలను, సింహగర్జనను వినిపించారు.


స్లో పాయిజన్ కుట్ర.. కంటి చూపు కోల్పోయిన మాజీ ప్రధాని!


ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం స్థాయికి చేరాయన్న వార్తలు పాక్‌ను కుదిపేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లోనే స్లో పాయిజన్‌ (విషం) ఇచ్చి, లేదా మరేదైనా పద్ధతిలో అంతమొందించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతోందని ఆయన సోదరీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటికే 73 ఏళ్ల వయస్సులో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఈ జైలు జీవితంలో తన కుడి కంటి చూపును దాదాపు కోల్పోయినట్లు సమాచారం రావడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. గతేడాది ఆగస్టు నుంచి జైలు జీవితం గడుపుతున్న ఖాన్, తనపై పెట్టినవన్నీ కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులేనని, తనను అంతం చేయడానికే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారని బలంగా వాదిస్తున్నారు.


ఒక దేశ మాజీ ప్రధానికే కనీస న్యాయం దొరకని పాకిస్థాన్ దుస్థితి చూస్తుంటే.. అక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడో సమాధి అయిపోయిందని స్పష్టమవుతోంది. "స్వేచ్ఛ లేదా మరణం" అంటూ 73 ఏళ్ల వయసులో, ఒక కంటి చూపు కోల్పోయి కూడా ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఈ సింహగర్జన పాక్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బుష్రా బీబీని పావుగా వాడుకుని ఇమ్రాన్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదైనా, పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ వేదికపై తన పరువును పూర్తిగా బజారుకీడ్చుకుంటోంది!