జేబులో చిల్లిగవ్వ లేదు.. కానీ ఊరంతా పెద్దరికం చలాయించాలనే ఆరాటం! దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం భయం నెలకొన్న వేళ.. రెండు అగ్ర దేశాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి దూతగా మధ్యవర్తిత్వం వహించాలని ఉబలాటపడ్డ పాకిస్థాన్ పరువు ఇప్పుడు బజారున పడింది. ఇస్లామాబాద్ వేదికగా ఆర్భాటంగా శాంతి చర్చలు నిర్వహించిన పాక్ సర్కార్.. తీరా అతిథులు వెళ్లిపోయాక హోటల్ బిల్లు కట్టలేక చేతులెత్తేసిన దివాళాకోరుతనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర హాస్యాస్పదంగా మారింది.
శాంతి దూత వేషం.. బొక్కబోర్లా పడ్డ దాయాది!
గత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం పశ్చిమాసియాను అల్లకల్లోలం చేస్తోంది. ఈ భీకర యుద్ధాన్ని ముగించి, అంతర్జాతీయంగా తామేదో గొప్ప శాంతిదూతలమని ప్రపంచానికి ప్రచారం చేసుకునేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ఊవిళ్లూరింది. అందుకోసమే అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలకు స్వయంగా మధ్యవర్తిత్వం వహించి రాజధాని ఇస్లామాబాద్‌లో ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది.
తడిసి మోపెడైన బిల్లు.. ముఖం చాటేసిన షెహబాజ్ సర్కార్!
ఇస్లామాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన 'సెరెనా హోటల్'లో ఈ చారిత్రక చర్చల కోసం పాక్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికా, ఇరాన్ దేశాల తరఫున భారీ సంఖ్యలో ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే, కొండంత ఆశతో నిర్వహించిన ఆ శాంతి చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. కానీ, పాకిస్థాన్‌కు మాత్రం ఆ హోటల్ బిల్లు తడిసి మోపెడయ్యిందని అంతర్జాతీయ నిఘా వర్గాలను ఉటంకిస్తూ గ్లోబల్ మీడియా కథనాలు బట్టబయలు చేశాయి. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల బిల్లుల్ని పాకిస్థాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెల్లించలేకపోయిందట!
రంగంలోకి ఓనర్.. పరువు తీసిన 'ప్రాథమిక వైఫల్యం'!
ప్రభుత్వం బిల్లు కట్టకుండా చేతులెత్తేయడంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా ఆ హోటల్ యజమాన్యమైన 'అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్' నేరుగా రంగంలోకి దిగాల్సి రావడం పాక్ దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అయ్యే సాధారణ ఖర్చులను సైతం చెల్లించడంలో ఇస్లామాబాద్ దారుణంగా విఫలమైందని గ్లోబల్ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. పాకిస్థాన్ దౌత్యపరమైన ఆశయాలకు, ఆ దేశంలో పేరుకుపోయిన అంతర్గత ఆర్థిక అస్థిరతకు మధ్య ఎంత భారీ వ్యత్యాసం ఉందో ఈ ఘటనే చెబుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అప్పుల కుప్పలో పాక్.. మళ్లీ చర్చలట!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ఒక దౌత్యపరమైన కార్యక్రమం సందర్భంగా.. ఆతిథ్య దేశం తన ప్రాథమిక ఆర్థిక కట్టుబాట్లను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమంలో జరిగిన ఈ వైఫల్యం, సాధారణ కార్యాచరణ చెల్లింపులను కూడా నిర్వహించలేని ఆ దేశ అసమర్థతను పచ్చిగా బయటపెడుతోందని అగ్రశ్రేణి నిఘా వర్గాలు నొక్కిచెబుతున్నాయి. ఇది పాకిస్థాన్ పరిపాలనా, ఆర్థిక బలహీనతను ప్రపంచం ముందు మరింతగా నిరూపించింది.
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. దాని నుంచి గట్టెక్కేందుకు నానా అవస్థలు పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) దగ్గర అప్పు కోసం చేయిచాచి దయనీయ స్థితిలో ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 7 నుంచి 9 శాతం మధ్య రగులుతోంది. ఇంతటి దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య మరో దఫా శాంతి చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇచ్చేందుకు పాట్లు పడుతుండటం చూస్తుంటే, అప్పు చేసి పప్పుకూడు తిన్న చందంగా ఉంది పాక్ తీరు!
Also Read:
డొనాల్డ్ ట్రంప్‌కు సౌదీ అరేబియా షాక్.. ఆ దిగ్బంధనం ఆపేయాలని ఒత్తిడి!US Iran Peace Talks: మరోసారి అమెరికా, ఇరాన్ చర్చలు
HIV Outbreak: పాకిస్థాన్‌లో 331 మంది పసిపిల్లలకు ఎయిడ్స్
మూడో పక్షం జోక్యం వద్దు.. ఇరాన్ అంశంపై అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
125 ఏళ్ల చరిత్రలో తొలిసారి: ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్‌గా మహిళ!

