ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించే పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలవుతోంది! ఆరు వారాలుగా ఏకధాటిగా సాగుతున్న ఈ భీకర యుద్ధం గ్లోబల్ ఎకానమీని అతలాకుతలం చేస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సరికొత్త దౌత్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం ఉక్కుపాదం మోపుతూ దిగ్బంధనం విధించడం పట్ల.. అమెరికాకు అత్యంత ఆప్తమిత్రుడైన సౌదీ అరేబియా సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మిత్రదేశాల మధ్యే చిచ్చు పెడుతున్న ఈ నావల్ బ్లాకేడ్ వెనుక ఉన్న అసలు భయం ఏంటి?
సౌదీ గుండెల్లో దడ.. ఆ జలసంధి మూతపడితే కుప్పకూలడమే!
అమెరికా తన నౌకాదళంతో ఇరాన్ పోర్టులను శాశ్వతంగా మూసివేస్తే పరిస్థితి మరింత విషమిస్తుందని సౌదీ అరేబియా తీవ్రంగా భయపడుతోంది. తక్షణమే ఈ నౌకాదళ దిగ్బంధాన్ని విరమించుకొని, శాంతియుత చర్చల వైపు అడుగులు వేయాలని రియాద్ సర్కార్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ఒక అంతర్జాతీయ మీడియా ఛానెల్ నివేదిక బట్టబయలు చేసింది.
సౌదీ అరేబియా వెన్నులో వణుకు పుట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. అమెరికా గనుక ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకుంటే, దానికి ప్రతీకారంగా ఇరాన్ తన కరుడుగట్టిన మిత్రదేశమైన హౌతీల ద్వారా 'బాబ్ అల్ మందేబ్' జలసంధిని సైతం పూర్తిగా మూసివేయిస్తుందని సౌదీ సర్కార్ వణికిపోతోంది.
ప్రస్తుతం 'హార్మూజ్ జలసంధి' మూతపడటంతో సౌదీ అరేబియా ఎంతో వ్యూహాత్మకంగా తన 70 లక్షల బ్యారెళ్ల చమురును పైపులైన్ల ద్వారా ఎర్ర సముద్ర తీరానికి తరలించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ఎర్ర సముద్ర ప్రవేశ మార్గమైన ఆ బాబ్ అల్ మందేబ్ జలసంధి కూడా మూతపడితే.. సౌదీ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కుప్పకూలిపోవడం ఖాయం. సరిగ్గా ఈ భయంతోనే సౌదీ అరేబియా ఇప్పుడు అమెరికా మెడలు వంచే ప్రయత్నం చేస్తోంది.
ఒక్క సిగ్నల్ చాలు.. ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్!
సౌదీ ఒక పక్క భయపడుతుంటే, ఇరాన్ మాత్రం ఆత్మరక్షణ పేరుతో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ సోషల్ మీడియా వేదికగా అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
"మాకు హార్మూజ్ జలసంధి ఎంత ముఖ్యమో, బాబ్ అల్ మందేబ్ కూడా అంతే ముఖ్యం. వైట్ హౌస్ గనుక ఇంకేమైనా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటే.. ప్రపంచ ఇంధన సరఫరా మొత్తం మా ఒక్క సిగ్నల్‌తో ఆగిపోతుందని అమెరికా గుర్తిస్తే మంచిది" అంటూ ఆయన సింహంలా గర్జించారు.
దీనికి తోడు ఇరాన్ ఆర్మీ కూడా సోమవారం నాడు అత్యంత ఘాటుగా స్పందించింది. గల్ఫ్ తీరంలో తమ రేవులకే గనుక భద్రత లేకపోతే.. ఇక ఆ ప్రాంతంలోని ఏ ఒక్క దేశపు ఓడరేవూ సురక్షితంగా ఉండదంటూ పరోక్షంగా గల్ఫ్ దేశాలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చింది.
ట్రంప్ పంతం.. బ్యారెల్ సెంచరీతో గల్ఫ్ ఉక్కిరిబిక్కిరి!
ఇరాన్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా అమెరికా మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇరాన్ ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసి, ఆ దేశాన్ని తమ పాదాల చెంత లొంగదీసుకోవాలన్నదే డొనాల్డ్ ట్రంప్ అసలు వ్యూహం. హార్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా తెరవడమే ట్రంప్ ఏకైక లక్ష్యమని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అన్నా కెల్లీ స్పష్టంగా కుండబద్దలు కొట్టారు.
కానీ, ఈ అగ్రరాజ్యాల పంతాల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఈ భీకర ఆరు వారాల యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరిగిపోవడం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు భారీ ముప్పు ఏర్పడటం ఇప్పుడు గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దశాబ్దాలుగా అమెరికాతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినడంతో యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ లాంటి అగ్రశ్రేణి గల్ఫ్ దేశాలు సైతం ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. యుద్ధాలు, దిగ్బంధనాలు మాని వెంటనే శాంతియుత చర్చల ద్వారానే ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించుకోవాలని అవి తీవ్రంగా కోరుతున్నాయి.
ఆధిపత్యం కోసం అమెరికా ఆడుతున్న చదరంగంలో, ఇంధనం కోసం ప్రపంచం బలైపోతోంది! గల్ఫ్ మిత్రదేశాలు సైతం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క సిగ్నల్‌తో బాబ్ అల్ మందేబ్ జలసంధి కూడా మూతపడితే.. అది కేవలం ఇరాన్, సౌదీలకే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే మరణశాసనం అవుతుంది. పాలకుల అహంకారాల మధ్య, అంతిమంగా నలిగిపోయేది మాత్రం సగటు మనిషే!
Also Read:
మీలో టాలెంట్ ఉన్నా ఎందుకు వెనుకబడి ఉన్నారో తెలుసా? కారణం ఇదే!జీవితంలో ఎదురుదెబ్బ తగిలిందా? అయితే మళ్ళీ ఇలా బౌన్స్ బ్యాక్ అవ్వండి!
అతిగా ఆలోచించడం (Overthinking) ఆపడం ఎలా? సింపుల్ ట్రిక్స్
5 AM క్లబ్: ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే జీవితం ఎలా మారుతుంది?
మోటివేషన్ కంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు గొప్పదో తెలుసా?

