భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత భయంకరమైన జైలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు 'తీహార్'. సినిమాల్లో చూపించే ఎలివేషన్లు, అక్కడ ఉండే కరుడుగట్టిన హై-ప్రొఫైల్ నేరస్థులను చూసి, ఆ జైలు పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో ఒక రకమైన దడ పుడుతుంది. అయితే, బయట ప్రపంచం ఊహించుకుంటున్నంత క్రూరంగా తీహార్ జైలు ఉండదని, అక్కడ సీన్ వేరేలా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సంచలనాత్మక మనీలాండరింగ్ కేసులో కవిత సుమారు ఐదు నెలల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా అదే తీహార్ జైలులో ఖైదీగా జీవితం గడిపారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితను పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత తన ఐదు నెలల తీహార్ జైలు అనుభవాలను పూసగుచ్చినట్లు వివరించారు.
అరటిపండు దొంగతనం.. మజా డబ్బా గొడవ!
తీహార్ అనగానే కేవలం ఉగ్రవాదులు, దారుణమైన నేరస్థులు మాత్రమే ఉంటారని అనుకుంటే పొరపాటేనని కవిత స్పష్టం చేశారు. మెుదట్లో తాను కూడా అలాగే భావించినా, లోపలికి వెళ్లాక అసలు నిజం తెలిసిందన్నారు. అక్కడ చాలా మంది ఎంతో చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య జరిగే కోట్లాటల వంటి పిచ్చి కేసుల్లో కూడా ఏడున్నర, ఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న అభాగ్యులు అక్కడ ఉన్నారని తెలిపారు.
చుట్టుపక్కల రాష్ట్రాల్లోని చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారిని సైతం నేరుగా తీహార్‌లోనే పడేస్తారని చెప్పారు. కేవలం ఒక అరటిపండు దొంగతనం చేశాడన్న నెపంతో ఓ వ్యక్తిని, పాన్ షాప్‌లో ఒక 'మజా' డబ్బా కోసం జరిగిన చిన్న గొడవకు మరో వ్యక్తిని తీహార్ జైలుకు తీసుకురావడం చూసి తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని, ఇదెలా జరుగుతుందని అత్యంత సిల్లీగా అనిపించిందని కవిత చెప్పుకొచ్చారు.
అమాయక సాఫ్ట్‌వేర్ పిల్లలు.. సంకెళ్ల అవమానం!
చిన్న నేరాలకే కాకుండా, ఏ పాపం ఎరుగని అమాయకులు కూడా ఆ జైలు నాలుగు గోడల మధ్య మగ్గుతున్నారని కవిత తెలిపారు. తాను జైలులో ఉన్న సమయంలో కొందరు సాఫ్ట్‌వేర్ కుర్రాళ్లు కూడా అక్కడికి వచ్చారని గుర్తుచేసుకున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీ థాయ్‌లాండ్ కేంద్రంగా సైబర్ క్రైమ్స్ చేస్తోందని తెలియడంతో.. ఆ నేరాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ అమాయక పిల్లలను తీహార్ జైలుకు లాక్కొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తన జైలు జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సైతం కవిత పంచుకున్నారు. తనను జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఒకసారి పోలీసులు ఏకంగా తన చేతులకు సంకెళ్లు కూడా వేశారని ఆమె సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే, వెంటనే మరో ఆఫీసర్ చూసి అలా చేయవద్దని వారించడంతో.. అప్పటినుంచి నార్మల్‌గానే కోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తన కోసం ప్రత్యేకంగా ఒక వాహనం ఏర్పాటు చేసి, అందులోనే జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లేవారని.. ఆ సమయంలో తనకు 'ఒంటరి' అన్న ఫీలింగ్ తీవ్రంగా కలిగిందని కవిత భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
సినిమాల్లో విలన్లకు అడ్డాగా కనిపించే తీహార్ జైలు.. నిజానికి ఎందరో అమాయకుల కన్నీటి గాథలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని కవిత మాటలు స్పష్టం చేస్తున్నాయి!

