అమెరికా-ఇరాన్ దాడులు, విఫలమైన శాంతి చర్చలు, డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు.. ఇలా రాజకీయ కారణాలు ఏవైనా సరే.. సామాన్యుడికి అర్థమయ్యే ఒకే ఒక్క చేదు నిజం "భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు"! అగ్రరాజ్యాల పంతాల మధ్య సమిధలవుతున్న సామాన్యులు.. రాబోయే నెలల పాటు ఇంధన ధరల మంటల్లో కాలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆకాశాన్ని తాకిన చమురు ధరలు.. భయపెడుతున్న బ్రెంట్ క్రూడ్!
ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌లో మొదలైన వివాదం.. ప్రపంచ చమురు మార్కెట్‌ను భయంకరంగా కుదిపేసింది. అప్పటినుంచి గ్లోబల్ ఆయిల్ ధరలు ఏకంగా 35 నుంచి 50 శాతం మేర భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర.. మార్చి నెలలో ఏకంగా 119 డాలర్ల గరిష్ట స్థాయిని తాకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ ధర 100 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, మార్కెట్లో ఇంకా తీవ్ర అస్థిరత కొనసాగుతూనే ఉంది.
అమెరికాకు ద్రవ్యోల్బణ సెగ.. క్రిస్ రైట్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎలాంటి స్పష్టమైన ముగింపు లేకుండానే ముగిశాయి. దీనివల్ల కీలకమైన హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు అలాగే కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ చేసిన వ్యాఖ్యలు సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అమెరికాలో గ్యాలన్ గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం పాటు 3 డాలర్ల పైనే కొనసాగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరినా.. అవి రాబోయే నెలల్లో, బహుశా వచ్చే ఏడాది వరకు కూడా కిందికి దిగిరావని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇరాన్ యుద్ధానికి ముందున్న 3 డాలర్ల ధర కూడా ఇప్పటికే చాలా ఎక్కువని 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' కార్యక్రమంలో ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ అంచనాలు తలకిందులు.. రాకెట్‌లా దూసుకెళ్తున్న రేట్లు!
'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించిన అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ డేటా చూస్తే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వకమానదు. యుద్ధం మొదలవ్వక ముందు కేవలం 2.98 డాలర్లుగా ఉన్న గ్యాలన్ ఇంధన ధర, ఆదివారం నాటికి ఏకంగా 4.05 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేతే ఈ ఘోరానికి ప్రధాన కారణం. జలసంధి చుట్టూ ఇరాన్ తీసుకుంటున్న సైనిక చర్యల వల్ల షిప్పింగ్ ట్రాఫిక్ పూర్తిగా నెమ్మదించింది. క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి.
ఇంధన ధరల పెరుగుదల కేవలం కొద్దిరోజులే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ వాస్తవ డేటా మాత్రం ఆయన అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తోంది. 2026 నవంబర్ నాటికి కూడా ధరలు ప్రస్తుత స్థాయిలోనే లేదా అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"ధరలు రాకెట్‌లా పెరుగుతాయి.. ఈకలా నెమ్మదిగా కింద పడతాయి" అన్న నానుడి చమురు పరిశ్రమలో ఎప్పుడూ వినిపించేదే! మూతపడిన షిప్పింగ్ మార్గాలను తెరిచినంత మాత్రాన ఇంధన ధరలు వెంటనే దిగిరావని ఆయిల్ ఎగ్జిక్యూటివ్‌లు స్పష్టం చేస్తున్నారు. బలహీనమైన కాల్పుల విరమణ, దెబ్బతిన్న చమురు కర్మాగారాలు, తగ్గిన ట్యాంకర్ల రద్దీ.. ఈ పరిణామాలన్నీ సమీప భవిష్యత్తులో సామాన్యుడికి చౌక ఇంధనం దొరకదనే కఠోర నిజాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు.. సుల్తాన్ అల్ జాబర్ ఆవేదన
ఈ యుద్ధం కేవలం ఇంధనం మీదే కాదు, మొత్తం ప్రపంచ శక్తి వనరులపై ఎలాంటి భయంకరమైన ప్రభావం చూపుతోందో యూఏఈ (UAE) పరిశ్రమల, అధునాతన సాంకేతిక శాఖ మంత్రి సుల్తాన్ అల్ జాబర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కళ్లకు కట్టారు. గత 50 రోజులుగా హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల కలిగిన తీవ్ర నష్టాలను ఆయన ఏకరువు పెట్టారు. ఏకంగా 600 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణాకు ఆటంకం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల ద్రవీకృత సహజ వాయువు (LNG), విమాన ఇంధనం, ఎరువులతో పాటు ప్రపంచం ఆధారపడే అత్యంత అవసరమైన వస్తువులపై 50 రోజులుగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సరఫరా కాని ప్రతి చమురు బ్యారెల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుల జేబులను ఖాళీ చేస్తోందని మండిపడ్డారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇకపై ఏమాత్రం అనిశ్చితిని తట్టుకునే స్థితిలో లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జలసంధిని బెదిరింపులకు అడ్డాగా మార్చకూడదని, నౌకల సురక్షిత ప్రయాణానికి డబ్బులు డిమాండ్ చేయడాన్ని నేరుగా 'బలవంతపు వసూళ్లు' అనే పిలవాలని ఆయన ధైర్యంగా వ్యాఖ్యానించారు. హార్మూజ్ జలసంధి ఒక అంతర్జాతీయ జలమార్గమని, అది ఎప్పటిలాగే తిరిగి ప్రపంచానికి అందుబాటులోకి రావాలని సుల్తాన్ అల్ జాబర్ కుండబద్దలు కొట్టారు.
సామాన్యుడి బతుకుబండి నడవాలంటే చమురు కావాలి. కానీ అగ్రరాజ్యాల పంతాలకు సముద్ర మార్గాలు బలైపోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే 2026 ముగిసేలోపు పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో వెంటనే శాంతి నెలకొనకపోతే కేవలం ఇంధనమే కాదు.. నిత్యావసరాలు, ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకి మరో పెను ఆర్థిక మాంద్యానికి దారితీసే విపత్తు ముంచుకొస్తోంది! కాబట్టి రాబోయే నెలల్లో ఇంధన పొదుపు, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలపై సామాన్యులు ఇప్పటినుంచే దృష్టి పెట్టడం అత్యంత ఆవశ్యకం!
Also Read:
Iran Arms Smuggling: అమెరికాకు చిక్కిన లేడీ స్మగ్లర్జపాన్లో సముద్రపు అడుగున మహా భూకంపం.. 3 మీటర్ల ఎత్తున సునామీ ముప్పు!
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్: ఇస్లామాబాద్ చర్చలు అవాస్తవం!
రెండు నెలలైనా ఖమేనీకి దక్కని ఆరడుగుల నేల.. ఇరాన్ ఎందుకు భయపడుతోంది?
US Iran Conflict: ఇరాన్‌కు ట్రంప్ విధ్వంసకర వార్నింగ్

