భార్యతో సరదాగా సెల్ఫీ దిగుతున్న ఆ భర్తకు తెలియదు.. అది తన జీవితంలో చివరి ఫోటో అని! వీకెండ్ కదా అని కుటుంబంతో బయటకు వెళ్లే సామాన్యుడా కాస్త జాగ్రత్త.. ఎందుకంటే డబ్బు, మందు మత్తులో కళ్లు మూసుకుపోయిన కొందరు సంపన్నుల రాష్ డ్రైవింగ్ మీ ప్రాణాలను క్షణాల్లో గాల్లో కలిపేయొచ్చు. నిన్న మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ఘోర ప్రమాదం చూశాక.. అసలు రోడ్డు మీద నడవాలంటేనే సామాన్యుడు వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
గాల్లో ఎగిరిపడ్డ ప్రాణం.. రక్తమోడిన కేబుల్ బ్రిడ్జి
ఆదివారం తెల్లవారుజాము సమయం.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై గోస శ్యామ్ రాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఎంతో ఆనందంగా ఫోటోలు తీసుకుంటున్నాడు. అంతలోనే జూబ్లీహిల్స్ వైపు నుండి ఐకియా వైపు మృత్యువులా అత్యంత వేగంగా దూసుకొచ్చింది ఓ మెర్సిడెస్ బెంజ్ కారు. అతివేగంతో నియంత్రణ కోల్పోయిన ఆ కారు.. క్షణాల వ్యవధిలో శ్యామ్ రాజ్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆయన గాలిలో ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. కళ్లెదుటే భర్త నెత్తుటి మడుగులో పడిపోవడంతో ఆ భార్య గుండె పగిలేలా రోదించింది.
ఆసుపత్రిలో పోరాటం.. పారిపోయిన కిలాడీ డ్రైవర్
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో ఆ భార్య తన భర్తను హుటాహుటిన సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్యామ్ రాజ్‌ను బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, విధి మరోలా తలచింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం ఆయన కన్నుమూశారు.
మరోవైపు, ఈ ఘోరానికి కారణమైన బెంజ్ కారు డ్రైవర్, కారును అక్కడే వదిలేసి అత్యంత కిరాతకంగా ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక నిద్రమత్తులో వాహనం నడిపాడా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారైన నిందితుడి కోసం సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
సంపన్నుల విలాసాలు.. సామాన్యులకు శాపాలు
కేబుల్ బ్రిడ్జిపై రోజురోజుకూ పెరుగుతున్న మితిమీరిన వేగం, వరుస ప్రమాదాలపై నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సంపన్నులు విలాసాలకు బానిసలై, అర్థరాత్రి దాటే వరకు పబ్బుల్లో పీకల దాకా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మద్యం మైకంలో కళ్లు మూసుకుపోయి, రోడ్లపై నడిచే అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఉందన్న అహంకారంతో ప్రాణాలు తీస్తున్న అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
తృటిలో తప్పిన మరో పెను విషాదం!
రోడ్లపై నెత్తుటి దాహానికి ఇది ఒక్కటే ఉదాహరణ కాదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేటు వద్ద ఈ ఉదయం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక డీసీఎం వ్యాన్, ముందు వెళ్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవటంతో అతిపెద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు.
రోడ్డు మీద కారు ఎంత వేగంగా వెళుతుందనేది డ్రైవర్ బ్యాంక్ బ్యాలెన్స్‌ను బట్టి కాదు, బతికే అర్హత ఉన్న ఎదుటి మనిషి ప్రాణాన్ని బట్టి నిర్ణయించబడాలి. పబ్బుల చుట్టూ, ఖరీదైన కార్ల చుట్టూ తిరిగే ట్రాఫిక్ నిఘా కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా, కటకటాల వెనక్కి నెట్టేంత కఠినంగా మారాలి. సామాన్యులారా, వీకెండ్ సరదాల కోసం రాత్రి పూట రోడ్ల మీద నిలబడేటప్పుడు మీ ప్రాణాలకు మీరే రక్షకులు. విలాసాలకు బానిసలైన కొందరు మృగాల్లా వాహనాలు నడుపుతున్న ఈ రోజుల్లో, రోడ్డు మీద అడుగేస్తే వెయ్యి కళ్లతో అప్రమత్తంగా ఉండటం మినహా మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు!
Also Read:
ఆపరేషన్ ఆక్టోపస్-2.0: 32 మంది బ్యాంక్ అధికారుల అరెస్ట్!భవన నిర్మాణ కార్మికులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. త్వరలోనే పెన్షన్లు!
తెలంగాణకు వాతావరణ శాఖ హై అలెర్ట్: రాబోయే 5 రోజులు భారీ వర్షాలు!
Revanth Reddy: చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hit and Run Case: జూబ్లీహిల్స్ కేసులో రాహెల్ లొంగుబాటు

