యుద్ధం ఎఫెక్ట్: సామాన్యుడి దాహానికి చమురు సెగ.. వాటర్ బాటిళ్ల ధరలు పెంపు

naveen
By -
Packaged drinking water bottles representing the price hike due to the global oil crisis


ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో పశ్చిమాసియా ఎడారుల్లో బాంబులు పేలుతుంటే.. ఆ మంటల సెగ ఇక్కడ భారతదేశంలో మన గొంతును ఎండబెడుతోంది! రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య రగులుకున్న యుద్ధ జ్వాలలు కేవలం పెట్రోల్, డీజిల్ రేట్లనే కాదు, ఏకంగా సగటు మనిషి ప్రాణాధారమైన మంచినీటిని సైతం అగ్నిగుండంగా మారుస్తున్నాయి. అవును, ఆశ్చర్యంగా అనిపించినా ఇది పచ్చి నిజం. గ్లోబల్ వార్ ఎఫెక్ట్ దెబ్బకు.. ఒకప్పుడు దొరకని నీరు, ఇప్పుడు కొనుక్కోలేని పరిస్థితికి చేరుకుంది.


పెట్రోల్ మంట.. వాటర్ బాటిల్‌కు ఎసరు!


హోర్ముజ్ జలసంధి గుండా సాగే చమురు రవాణాకు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరుకుని ఆకాశాన్ని తాకాయి. 


అయితే ఇక్కడే ఒక వింతైన లాజిక్ ఉంది. అసలు మన మంచినీటి ధర పెరగడానికి కారణం ఆ నీరు కాదు.. దాన్ని నింపే ప్లాస్టిక్ బాటిల్! ఆ ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు.. ముడి చమురు (Crude Oil) నుంచే తయారవుతాయి. ఇంకేముంది, చమురు మండిపోవడంతో గత పక్షం రోజుల్లోనే ఈ ముడిపదార్థాల ధరలు అమాంతం రెక్కలు విప్పుకున్నాయి.


బాటిల్ రేట్లకు రెక్కలు.. బిస్లరీ షాక్!


ప్యాకేజింగ్ ఖర్చుల బాదుడుతో ప్రముఖ మార్కెట్ లీడర్ బిస్లరీ (Bisleri) ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను ఏకంగా 11 శాతం పెంచేసింది. 12 లీటర్ల బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది. 


ప్యాకేజింగ్ ఖర్చులు ఊహించని విధంగా 70 శాతం పెరగడంతోనే, లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని స్వయంగా బిస్లరీ సీఈఓ ఏంజెలో జార్జ్ కుండబద్దలు కొట్టారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుంచి ఏకంగా రూ. 180కి పెరగడమే కాకుండా, మార్కెట్లో సరుకు దొరకని తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.


మంచినీళ్లే కాదు.. ఫుడ్ డెలివరీ, మందులకూ సెగ!


కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే, ఈ ప్యాకేజింగ్ మంట కేవలం తాగునీటికే పరిమితం కాలేదు. మన దైనందిన జీవితంలో PET ప్యాకేజింగ్‌ను విపరీతంగా వాడే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ ప్యాకింగ్, ప్రాణాధారమైన ఫార్మాస్యూటికల్స్ (మందులు), కాస్మెటిక్స్ (సౌందర్య సాధనాలు) రంగాలు కూడా ఈ యుద్ధ ఎఫెక్ట్ బారిన పడనున్నాయి. త్వరలోనే వీటి ధరలు కూడా సామాన్యుడిని వణికించడం ఖాయంగా కనిపిస్తోంది.


కలుషిత జలాలు.. నీటి కోసం పేదోడి తండ్లాట


భారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే ఒక పెను సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు విషతుల్యంగా, కలుషితంగా మారాయని సర్వే నివేదికలు ఘోషిస్తున్నాయి. 


ఈ భయానక నేపథ్యంలో.. పట్టణాల్లో 15 శాతం, పల్లెల్లో 6 శాతం కుటుంబాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి కేవలం ఈ బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఈ బాటిళ్ల రేట్లు కూడా మండిపోతుంటే.. ఆ పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.


మూతపడుతున్న ప్లాంట్లు.. ముంచుకొస్తున్న ముప్పు!


పెరిగిన ముడిసరుకు ఖర్చులను భరించలేక.. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు 20 శాతం వాటర్ తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. ఈ పరిణామాలు చూస్తుంటే.. భవిష్యత్తు మరింత భయానకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.


పశ్చిమాసియాలో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు సామాన్యుడికి శాపంగా మారడం, గుక్కెడు నీళ్ల కోసం దప్పికతో అలమటించడం ఖాయం!