ప్రపంచ వినాశనానికి అడుగు దూరంలో ఉన్నామా? అగ్రరాజ్యం అమెరికాకు, ఇరాన్ సుప్రీం లీడర్‌కు మధ్య సాగుతున్న ఈ ‘యుద్ధం’ సామాన్యుడి వంటగదిని, పెట్రోల్ ధరలను ఎలా తలకిందులు చేయబోతోందో తెలుసా? ఇరాన్ గడ్డపై నుంచి వెలువడిన ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ చేసిన భీకర గర్జన వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇవే!
అణు సంపదే మా ఆత్మగౌరవం.. 9 కోట్ల మంది ప్రాణాలకు ప్రతీక!
గురువారం నాడు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ఒక ప్రకటన ప్రతిధ్వనించింది. అది కేవలం మాటలు కాదు, అగ్రరాజ్యం అమెరికా పంతానికి ఇరాన్ ఇస్తున్న గట్టి సమాధానం. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను ఒక జాతీయ సంపదగా ఖమేనీ అభివర్ణించారు.
"దేశ విదేశాల్లో ఉన్న 9 కోట్ల మంది గర్వించదగ్గ ఇరానియన్లు.. నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు అన్నింటినీ తమ జాతీయ ఆస్తులుగా భావిస్తారు. తమ దేశ భూభాగం, జలాలు, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. వీటిని కూడా అలాగే రక్షించుకుంటారు" అని ఖమేనీ కుండబద్దలు కొట్టారు. అణు ఒప్పందం కుదిరే వరకు హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని వదిలేది లేదని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఇది ఇరాన్ ఇచ్చిన పదునైన కౌంటర్!
అమెరికా లేని భవిష్యత్తు.. సముద్ర గర్భమే వారికి దిక్కు!
అమెరికా తీరుపై ఖమేనీ నిప్పులు చెరిగారు. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్లకు చోటు లేదని, ఒకవేళ వారు ఇక్కడ ఉండాలనుకుంటే అది కేవలం "సముద్ర గర్భం"లో మాత్రమేనని అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు.
"దేవుడి దయ వల్ల, పెర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అతి త్వరలోనే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.. అది అమెరికా లేని భవిష్యత్తు! ఇక్కడి ప్రజల పురోగతికి, సుఖసంతోషాలకు, శ్రేయస్సుకు అది దారి తీస్తుంది" అని ఖమేనీ తన లేఖలో పేర్కొన్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి దురాశతో, దుర్బుద్ధితో వచ్చే విదేశీయులకు ఈ గడ్డపై స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు.
అగ్రరాజ్యానికి ‘అవమానకర పరాజయం’.. కొత్త అధ్యాయం షురూ!
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ప్రాంతీయ 'గూండాలు'గా అభివర్ణించిన ఖమేనీ.. ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. అమెరికా వ్యూహాలకు "అవమానకర పరాజయం" ఎదురైందని, పెర్షియన్ గల్ఫ్ మరియు హర్మూజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఒక 'కొత్త అధ్యాయం' మొదలైందని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం ఇరాన్ చమురు ట్యాంకర్లు సముద్రంలోకి వెళ్లకుండా అమెరికా నౌకాదళం దిగ్బంధించినప్పటికీ.. ఇరాన్ పట్టు సడలించడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్నాయి. జూన్ డెలివరీ కోసం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గురువారం ఒక్కరోజే బ్యారెల్‌కు ఏకంగా 126 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ చమురు, సహజవాయువు వాణిజ్యంలో ఐదో వంతు ప్రవహించే హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణం.
గొంతు నులిమిన దిగ్బంధనం.. నిలిచిపోయిన ఉత్పత్తి!
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్ తన చమురును అమ్ముకోకుండా అడ్డుకోవడం ద్వారా, ఆ దేశ ఆదాయ వనరులను దెబ్బతీయాలన్నదే అమెరికా వ్యూహం. అయితే, దీనివల్ల మరో భయంకరమైన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.
ఒకవేళ విదేశాలకు అమ్మడం సాధ్యం కాకపోతే, నిల్వ చేయడానికి స్థలం లేక ఇరాన్ తన చమురు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఒకవైపు కాల్పుల విరమణ అమలులో ఉన్నా.. హర్మూజ్ జలసంధి వేదికగా సాగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నాయి.
అగ్రరాజ్యాల అహంకారానికి, ఒక దేశపు ఆత్మగౌరవానికి మధ్య సాగుతున్న ఈ పోరాటంలో నలిగిపోతున్నది సామాన్యులే! ఇరాన్ తన అణు సంపదను ప్రాణంగా భావిస్తుంటే, అమెరికా దానిని తుడిచిపెట్టాలని చూస్తోంది. ఈ పంతం ఇలాగే కొనసాగితే.. పెట్రోల్ ధరలు 150 డాలర్లు దాటి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీయడం ఖాయం. యుద్ధం తుపాకులతోనే కాదు, చమురు పైపులతో కూడా జరుగుతుందని ఇరాన్ నిరూపిస్తోంది!
Also Read:
Healthcare Under Attack : ఆసుపత్రులే లక్ష్యంగా దాడులు: WHO సంచలన నివేదిక!US Iran War: అమెరికా గుండెల్లో ఇరాన్ సరికొత్త ఆయుధం
ప్రపంచాన్ని శాసించే ఫోన్ కాల్: ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక మంతనాలు
అమెరికా జాబ్ పోయింది.. 40 లక్షల అప్పు మిగిలింది: ఎన్నారై టెక్కీ కష్టాలు!
Mt Everest Climbing: మృత్యువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఎవరెస్ట్..

