అమెరికా వెళ్లడం అనేది ప్రతి మధ్యతరగతి యువకుడి అతిపెద్ద కల. ఆ కలను నిజం చేసుకోవడానికి లక్షల రూపాయలు అప్పు చేసి మరీ విమానం ఎక్కుతారు. కానీ, ఒక్కసారిగా ఆ కల చెదిరిపోయి, చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. లక్షల అప్పుతో బలవంతంగా ఇండియాకు తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుభవిస్తున్న ఈ నరకం.. హెచ్-1బీ (H-1B) వీసాలపై అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరూ, భవిష్యత్తులో వెళ్లాలనుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం!
హెచ్-1బీ లాటరీ దెబ్బ.. ఉన్న పళంగా ఇండియాకు ప్యాకప్!
కలల దేశంలో నెలకు లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ ఎన్నారై టెక్కీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. హెచ్-1బీ లాటరీలో పేరు రాకపోవడంతో, ఆయన వీసా గడువు ముగిసిపోయింది.
అమెరికాలో తాను పనిచేస్తున్న కంపెనీకి ఇండియాలో ఎలాంటి బ్రాంచ్ లేకపోవడంతో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా దక్కలేదు. చేసేదేమీ లేక బ్యాగులు సర్దుకుని బలవంతంగా ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది.
ఈ విషాదాన్ని వివరిస్తూ ఆ టెక్కీ 'రెడిట్' (Reddit) వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. "హెచ్1బీ లాటరీ రాలేదు, బలవంతంగా ఇండియాకు వచ్చేశా.. ఇక్కడ టఫ్ ఇంటర్వ్యూలతో నరకం అనుభవిస్తున్నా" అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక్కడి పోటీని చూసి తనకు మతిపోతోందని పేర్కొన్నాడు.
2 లక్షల డాలర్ల జీతం నుంచి.. జీరో ఆదాయానికి!
అమెరికాలో ఉన్నప్పుడు ఆ టెక్కీ ఏటా ఏకంగా 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.6 కోట్లు) భారీ ప్యాకేజీని అందుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఆదాయం జీరోకి పడిపోవడం అతనికి అతిపెద్ద షాక్ ఇచ్చింది.
అంతకుమించి నెత్తి మీద ఏకంగా రూ.40 లక్షల భారీ అప్పు ఉండటం అతని మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తోంది. ఈ ఒత్తిడిలో ఇండియాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతనికి ఇక్కడి పరిస్థితులు మరింత భయంకరంగా మారాయి.
అమెరికా కంటే ఇండియాలోనే ఇంటర్వ్యూలు మహా టఫ్!
ఇండియాలో ప్రస్తుత జాబ్ మార్కెట్ చూసి ఆ టెక్కీ వణికిపోతున్నాడు. ఇక్కడ ఉన్న విపరీతమైన పోటీ, దారుణమైన పరిస్థితులు చూసి అతనికి ముచ్చెమటలు పడుతున్నాయి.
కానీ అతన్ని అంతకంటే ఎక్కువగా భయపెడుతున్నది.. ఇక్కడి టెక్ ఇంటర్వ్యూల తీరు. టెక్ ఇంటర్వ్యూలలో అడుగుతున్న ప్రశ్నలు అమెరికా కంటే ఇక్కడ ఎంతో కష్టంగా ఉన్నాయని ఆయన వాపోయాడు.
"ఇండియన్ టెక్ ఇంటర్వ్యూలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడి ప్రశ్నల స్థాయి అమెరికాలో నేను ఫేస్ చేసిన దానికంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది" అని ఆ టెక్కీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
నా పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? టెక్కీ ఆవేదన
నలభై లక్షల అప్పు కట్టాలనే భయంకరమైన ఒత్తిడి, మరోవైపు అత్యంత కఠినంగా సాగుతున్న ఇంటర్వ్యూలు తనను మానసికంగా కుంగదీస్తున్నాయని ఆ టెక్కీ వాపోయాడు.
"నాలాంటి పరిస్థితిని ఎవరైనా ప్రస్తుతం ఎదుర్కొంటున్నారా? ఈ బలవంతపు మార్పును ఎవరైనా విజయవంతంగా దాటారా? దయచేసి నాకు సలహాలు ఇవ్వండి. నేను ఒంటరిని కాదని తెలుసుకోవడం నాకు ఎంతో ఊరటనిస్తుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అంచనాలు తగ్గించుకో.. ఇగో పక్కనపెట్టు!
ఈ రెడిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతనికి రియాలిటీ చెక్ ఇస్తూ ఘాటుగానే స్పందించారు. భారీ ప్యాకేజీల గురించి ఆలోచించడం మానేసి, ముందు ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని సలహా ఇచ్చారు.
"అమెరికాలో 2 లక్షల డాలర్లు సంపాదించి కూడా, ఇంకా రూ.40 లక్షల అప్పు ఉంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది" అని ఒక నెటిజన్ సూటిగా ప్రశ్నించాడు. "నీ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్, 2 లక్షల డాలర్ల అమెరికా ఇగోను పక్కనపెట్టు.. ఇప్పుడు నీకు 15 నుంచి 20 లక్షల ప్యాకేజీ వస్తే అదే మహా భాగ్యం, ముందు ఆ జాబ్ తీసుకో" అని మరో యూజర్ చురకలంటించాడు.
"నేను కూడా ఇలాగే ఇండియాకు వచ్చేశాను, కాకపోతే 1.5 ఏళ్లలోనే నా అప్పులన్నీ తీర్చేసి వచ్చాను.. ఇక్కడ అమెరికా స్థాయి జీతాలు ఆశించొద్దు. నీ దగ్గర ఉన్న సేవింగ్స్‌తో నెలనెలా ఈఎమ్ఐలు కట్టుకో. పెద్ద ప్యాకేజీ కోసం ఎదురుచూడకుండా కనీస స్థాయి జాబ్ దొరికినా చేరిపో" అని మూడో వ్యక్తి సలహా ఇచ్చాడు.
"నీ అంచనాలను బాగా తగ్గించుకో. అమెరికాలో ఎంత సంపాదించావో పూర్తిగా మర్చిపో. ఇక్కడ నీ అనుభవానికి ఎంత జీతం ఇస్తారో మార్కెట్‌లో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మాత్రమే అంచనాలు పెట్టుకో" అంటూ నాలుగో యూజర్ వాస్తవాన్ని కళ్లకు కట్టాడు.
అమెరికా వీసా అనగానే ఎగిరి గంతేసే యువతకు ఈ ఘటన ఒక అతిపెద్ద కనువిప్పు. లక్షల డాలర్ల జీతం వచ్చినా, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఇండియాకు వచ్చాక పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. డాలర్ల మోజులో పడి భవిష్యత్తును గాలికి వదిలేయకుండా.. ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే, అందులో అప్పులు ఎంత త్వరగా తీరుస్తున్నాం, పొదుపు ఎంత చేస్తున్నాం అన్నదే అంతిమంగా మిమ్మల్ని కాపాడుతుంది. గాల్లో మేడలు కట్టే ముందు, ఇలాంటి రివర్స్ గేర్ పడితే తట్టుకునే ధైర్యం ఉందా లేదా అనేది యువత పదేపదే ఆలోచించుకోవాలి!
Also Read:
Mt Everest Climbing: మృత్యువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఎవరెస్ట్..Karachi Gas Crisis: కరాచీలో గ్యాస్ బెలూన్ల దడ!
UAE OPEC Exit: చమురు కోటలో ప్రకంపనలు.. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన యూఏఈ!
Drone War: రష్యా షాహెద్ డ్రోన్ల విధ్వంసం.. ఆకాశంలో ఉక్రెయిన్ ఇంటర్సెప్టర్ల వార్!
US Iran War: ట్రంప్‌ను మోసం చేస్తున్న పెంటగాన్?

