Raakasa Telugu Movie Review | రాకాస మూవీ రివ్యూ: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కామెడీ!

naveen
By -

కంటెంట్ ఎంత అద్భుతంగా ఉన్నా.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషన్స్ లేకపోతే చతికిలబడ్డ సినిమాలు కోకొల్లలు. కానీ, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇక్కడే తన మాస్టర్ మైండ్ ఉపయోగించారు. పక్కా ప్రణాళికతో, బాక్సాఫీస్ దద్దరిల్లేలా మెగా ప్రమోషన్స్‌తో సాక్షాత్తూ మెగా పవర్ స్టార్‌నే అబ్బురపరిచారు. సినిమాను కేవలం 55 రోజుల్లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ కంప్లీట్ చేసి, ఏకంగా 60 రోజుల పాటు ప్రమోషన్స్‌కే కేటాయించి టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ ఏ ఒక్క ప్రాంతాన్ని వదలకుండా 'రాకాస' ప్రకంపనలు సృష్టించారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే పాజిటివ్ వైబ్స్ తెచ్చుకున్న ఈ సినిమా, కష్టేఫలి అన్నట్లుగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఈ ఎక్స్‌క్లూజివ్ రివ్యూలో చూద్దాం!


రాకాస మూవీ రివ్యూ

వెయ్యేళ్ల నాటి భయం.. బ్రహ్మరాక్షసుడి మాయాజాలం! 


కథలోకి వెళితే.. ఇది వెయ్యేళ్ల నాటి సోషియో ఫాంటసీ ఇతివృత్తం. ఓ ఊరి చివర ఉన్న భారీ కోటలో భీకరమైన బ్రహ్మరాక్షసుడు (రాకాస) కొలువై ఉంటాడు. రాజుల కాలం నుంచి ఆ దెయ్యానికి నరబలి అర్పించడం ఆ ఊరి ఆచారం. ఆ కోట గడప తొక్కిన ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రారు. రాక్షసుడి నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఊరి జనం వణికిపోతూ ఒక నిండు ప్రాణాన్ని, చివరకు ఓ పసిబిడ్డను సైతం బలికి పంపిస్తుంటారు. ఒకవేళ బలి ఇవ్వకపోతే.. ఊరంతా మాయా వలయంలో చిక్కుకుంటుందని, ఎవరూ ఊరు విడిచి వెళ్లలేరని, ఊరు నాశనమైపోతుందని వారి మూఢనమ్మకం. ఆ రాకాసని అంతం చేయడానికి వెళ్లిన ఓ వీర రాజు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఎవరూ ఆ కోట వైపు కన్నెత్తి చూసే సాహసం చేయరు.


2026లో వీరబాబు ఎంట్రీ.. అసలు ఆట షురూ! 

సరిగ్గా వెయ్యేళ్ల తర్వాత, 2026లో ఆ ఊరికే చెందిన అమెరికా రిటర్న్ అబ్బాయి, మన పిరికి వీరుడు వీరబాబు (సంగీత్ శోభన్) తన ప్రేయసి సుకన్య కోసం వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఆమె అప్పటికే వేరొకరిని పెళ్లి చేసుకుని వీరబాబుకు దిమ్మతిరిగే షాకిస్తుంది. ఆ బ్రేకప్ బాధలో పూటుగా తాగిన మన హీరో, ఆ ఊరివాడైన సోము (వెన్నెల కిషోర్) హత్య కేసులో ఊహించని విధంగా ఇరుక్కుంటాడు. ఈ మర్డర్ కేసు నుంచి బయటపడే ప్రాసెస్‌లో ఉండగానే.. కోటలో ఉన్న ‘రాకాస’ నుంచి ఊరికి మూడు డేంజర్ హెచ్చరికలు వస్తాయి.


దీపం ఆర్పినవాడే.. దెయ్యానికి బలి! 


దీంతో ఊరి పెద్దలంతా కోటలోకి నరబలి పంపడానికి సిద్ధపడతారు. ఈసారి వీరబాబు ప్రాణ మిత్రుడైన బాలరాజు (గెటప్ శీను)ని బలిపశువును చేయాలని తీర్మానిస్తారు. మిత్రుడ్ని కాపాడుకునే ఆరాటంలో, ఇదంతా వట్టి మూఢనమ్మకమేనని బాలరాజు ఆర్పాల్సిన దీపాన్ని వీరబాబు స్వయంగా ఆర్పేస్తాడు! రూల్ ప్రకారం దీపం ఆర్పిన వారే కోటలోకి వెళ్లాలి. ఇంకేముంది.. పిరికివాడైన వీరబాబును బలి కోసం ఆ భయంకరమైన కోటలోకి నెట్టేస్తారు. అసలు ఆ కోటలోకి వెళ్లిన తర్వాత వీరబాబు ఏం చేశాడు? రాకాస అసలు రూపం ఏంటి? హత్యకు గురయ్యాడనుకున్న సోము ఏమయ్యాడు? వీరబాబుపై ప్రాణాలు పెట్టుకున్న సుబ్బలక్ష్మి (నయన్ సారిక) ఎలా కాపాడింది? ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడా లేదా? అన్నదే ఈ హై-ఓల్టేజ్ కథాంశం.


చందమామ కథలో.. నాన్ స్టాప్ కామెడీ పేలుళ్లు! 


రాజ్యాలు, భారీ కోట, రాక్షసుడు.. ఈ గ్రాండ్ సెటప్ అంతా చూస్తుంటే దర్శకురాలు మానస శర్మ థియేటర్లలో ఏదో గట్టి మ్యాజిక్కే ప్లాన్ చేసిందన్న ఫీల్ కలుగుతుంది. అయితే కథలోకి మన అమెరికా వీరబాబు (సంగీత్ శోభన్) ఎంటర్ అవ్వగానే సినిమా స్వరూపమే పూర్తిగా మారిపోతుంది. అప్పటివరకూ గూస్‌బంప్స్ తెప్పించిన సోషియో ఫాంటసీ ట్రాక్.. ఒక్కసారిగా హిలేరియస్ కామెడీ ట్రాక్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఒక చందమామ కథ లాంటి ఫీల్ కలిగిస్తూనే, వీరబాబు పాత్రలోని ఫన్ ఎలిమెంట్స్‌ని దర్శకురాలు వాడుకున్న తీరు అద్భుతం. ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జోనర్‌లను ఒకే ట్రాక్‌పై సమాంతరంగా నడిపిస్తూ.. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూశామనే కిక్ ప్రేక్షకుడికి దక్కుతుంది.


లాజిక్కులు లాగొద్దు.. మ్యాజిక్ ఫీల్ అవ్వండి! 


సాధారణంగా హారర్, సోషియో ఫాంటసీ కథలు వాస్తవానికి కాస్త దూరంగానే ఉంటాయి. చూస్తున్నంతసేపు లాజిక్కులు పక్కనపెట్టి ఎంజాయ్ చేయాల్సిందే. వెయ్యేళ్ల నాటి కథ 2026కి వచ్చినప్పుడు.. "ఈ రోజుల్లో కూడా రాక్షసుడు ఏంటి? కోట ఏంటి? పోలీసులు, కోర్టులు ఏమీ లేవా?" అని లాజిక్‌లు వెతికితే మాత్రం రాకాస మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయలేరు. క్లైమాక్స్‌లో రాకాస గురించి ఏదో అద్భుతమైన ట్విస్ట్ ఊహించుకుంటే కాస్త నిరాశ తప్పదు. అందులోని రియలైజేషన్ ఎపిసోడ్ కొంచెం అతికించినట్లు అనిపిస్తుంది. కానీ, చివర్లో "దెయ్యం లేదు గియ్యం లేదు" అనే రొటీన్ ముగింపు ఇవ్వకుండా, భిన్నమైన కాన్సెప్ట్‌తోనే డైరెక్టర్ ముగించడం సినిమాకు ప్లస్ అయ్యింది.


సంగీత్ శోభన్ విశ్వరూపం.. థియేటర్లలో నవ్వుల సునామీ! 


ఫస్టాఫ్‌లో రాకాస నేపథ్యం ఒక హారర్ అనుభూతిని ఇస్తే, ఆ తర్వాత సంగీత్ శోభన్ అల్లరి థియేటర్లను షేక్ చేస్తుంది. వెన్నెల కిషోర్, గెటప్‌ శీనులతో కలిసి అతను అందించిన ఫన్ రైడ్ నెక్స్ట్ లెవెల్! సంగీత్ శోభన్ వేసే సింగిల్ లైన్ పంచ్‌లు ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వవు. వస్తున్నాడంటే చాలు పంచ్ గ్యారెంటీ అన్నట్లుగా మొహాలపై ముందే నవ్వులు పూయిస్తాడు. నటిస్తున్నట్లు కాకుండా, వీరబాబు పాత్రను ఓన్ చేసుకున్నాడు. కోటలోకి వెళ్లి దెయ్యాన్ని చూసి భయపడటం రొటీన్ సెటప్పే అయినా, దానికి సోషియో ఫాంటసీ ఫన్ జోడించి వినోదపు విందు అందించాడు. విఠలాచార్య తరహా కథకు సంగీత్ సెట్ అవుతాడా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ, తన కామెడీ టైమింగ్‌తో సినిమాను పరుగులు పెట్టించాడు. కథ రాశాక అతన్ని ఎంచుకున్నారో, అతన్ని చూశాకే కథ రాసుకున్నారో కానీ.. వీరబాబు పాత్రకు అతనే పర్ఫెక్ట్!


సర్‌ప్రైజ్ చేసిన వెన్నెల కిషోర్.. క్యూట్ గా నయన్ సారిక! 


హీరోయిన్ నయన్ సారిక తెరపై చాలా క్యూట్‌గా మెరిసింది. కేవలం పాటలకే పరిమితం కాకుండా, కోటలోకి అడుగుపెట్టే స్కోప్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. ప్రమోషన్స్‌లో గెటప్ శీను ఎక్కువగా కనిపించడంతో అతనే మెయిన్ లీడ్ అనుకుంటే, వెన్నెల కిషోర్ రోల్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. శీను కంటే కూడా కిషోర్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. కిషోర్ పక్కన జబర్దస్త్ రోహిణి తనదైన మార్క్ కామెడీ పండించింది. బ్రహ్మాజీ సింగిల్ లైన్ పంచ్‌లు అదిరిపోయాయి. తనికెళ్ల భరణి బ్రాహ్మణుడి పాత్ర రొటీన్ అయినా, కథలో దానికి సరైన ప్రాధాన్యత దక్కింది.


అనుదీప్ బీజీఎమ్ థ్రిల్స్.. రాజు ఎదురోలు విజువల్ మ్యాజిక్! 


హారర్ ఫాంటసీ సినిమాలకు ప్రాణం పోసేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్! చిన్న చిన్న సన్నివేశాలను కూడా తన ఆర్ఆర్‌తో భయపెడుతూ అనుదీప్ దేవ్ ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. అటు కామెడీని, ఇటు సోషియో ఫాంటసీని బ్యాలెన్స్ చేస్తూ థ్రిల్ చేశాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కినా ఆ లోపం ఏమాత్రం కనిపించకుండా కెమెరామెన్ రాజు ఎదురోలు అద్భుతమైన ఫ్రేమ్స్ సెట్ చేశారు. వందల కోట్ల వీఎఫ్ఎక్స్ వండర్ అనిపించకపోయినా, ఎక్కడా నాసిరకంగా అనిపించకుండా సెన్సిబుల్ విజువల్స్ అందించారు.


నిర్మాణ విలువలతో మరోసారి మెగా ప్రొడ్యూసర్‌గా తన సత్తా చాటారు నిహారిక కొణిదెల. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసాకు ఈ సినిమా న్యాయం చేస్తుందని ఆమె ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిజమైంది. సమ్మర్ సెలవుల్లో పిల్లలను, పెద్దలను థియేటర్లకు క్యూ కట్టించే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ 'రాకాస'. లాజిక్కులు పక్కనపెట్టి ఫ్యామిలీతో కలిసి ఈ నవ్వుల రాకాసని నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయొచ్చు. బాక్సాఫీస్ వద్ద రాకాసకు కాసుల వర్షం కురవడం ఖాయం!


Tags: