ఎప్పుడూ ఒకే విమానాశ్రయం.. ఒకే నగరం! కానీ ఇప్పుడు తెలంగాణ ఆకాశ చిత్రపటం పూర్తిగా మారిపోబోతోంది. విమానం ఎక్కాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కే వెళ్లాల్సిన కష్టాలు ఇక శాశ్వతంగా తీరబోతున్నాయి. మన సొంత జిల్లాల్లోంచే విమానాలు గాల్లోకి ఎగరబోతున్నాయి! ముఖ్యంగా స్థానిక యువతకు పారిశ్రామికంగా వేలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను మోసుకొస్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద విమానాశ్రయం రాబోతోంది!
ఢిల్లీ వేదికగా ఫైనల్ డెసిషన్!
దేశవ్యాప్తంగా వస్తున్న ఎయిర్‌పోర్టుల డిమాండ్లను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో కలిసి పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు అత్యంత కీలక భేటీ నిర్వహించారు.
అనంతరం కిషన్‌రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అక్కడ ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్‌లో తెలంగాణలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్రం బలంగా భావిస్తోందని ప్రకటించారు.
రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. 17న క్షేత్రస్థాయి పరిశీలన!
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అక్కడ ఇప్పటికే రక్షణ శాఖ ఆధీనంలో 300 ఎకరాల భూమి ఉందన్న ఆయన.. సివిల్ ఏవియేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు రక్షణ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.
సైనిక బలగాల శిక్షణతో పాటు, పౌర విమానయాన (సివిల్ ఏవియేషన్) అవసరాల కోసం ఈ ఎయిర్‌పోర్టును వాడుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఈ నెల 17వ తేదీన ఏవియేషన్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనున్నారు.
ఈ ఎయిర్‌పోర్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉంటుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భూసేకరణ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవని ఆదిలాబాద్ జిల్లా నేతలు ఇప్పటికే తమకు భరోసా ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
మూడు నెలల్లో వరంగల్ మామునూరుకు శంకుస్థాపన!
ఆదిలాబాద్‌తో పాటు ఇతర జిల్లాల ఎయిర్‌పోర్టులపైనా మంత్రి కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. చారిత్రక నగరం వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రానున్న 3 నెలల్లోనే శంకుస్థాపన చేయాలని కేంద్రం భావిస్తోందని ఆయన ప్రకటించారు.
గతంలోనే అక్కడ ఎయిర్‌స్ట్రిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదనపు భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందని, భూసేకరణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. మరోవైపు, పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, అక్కడ కూడా ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని, అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు.
జూన్ 2 లోపు పనులు షురూ.. కొలువుల జాతర!
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఎయిర్‌పోర్టు గురించి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడులతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేశామని సీఎం తెలిపారు.
జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎయిర్‌పోర్టు మాత్రమే కాకుండా దాని చుట్టూ అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌ను సైతం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీని ద్వారా స్థానిక యువతకు, నిరుద్యోగులకు కళ్లు చెదిరే ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రామ్మోహన్ నాయుడు తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన జిల్లా ఎయిర్‌పోర్టుల కలలు.. ఇప్పుడు డబుల్ ఇంజిన్ స్పీడ్‌తో పట్టాలెక్కుతున్నాయి. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ-సివిల్ ఏవియేషన్ జాయింట్ వెంచర్‌తో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ రావడం, చారిత్రక నగరమైన వరంగల్ మామునూరు విమానాశ్రయానికి నిధులు విడుదల కావడం చూస్తుంటే రాబోయే రెండేళ్లలో తెలంగాణ ముఖచిత్రమే మారబోతోంది. నా అంచనా ప్రకారం.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే, కేవలం రవాణా వ్యవస్థే కాకుండా ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలు అనూహ్యంగా పుంజుకుని సామాన్యుడి ఆర్థిక రూపురేఖలను సమూలంగా మార్చేస్తాయి!
Also Read:
Nadargul Lands Issue: హరీష్‌పై మంత్రి పొంగులేటి ఫైర్హైడ్రా మాస్ ఆపరేషన్: బౌన్సర్లను పెట్టినా ఆగని బుల్డోజర్లు!
Moinabad Farmhouse Case: డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
Telangana Future City: రేవంత్ కలల ప్రాజెక్టుకు ఎన్జీటీ బ్రేక్ వేస్తుందా? విచారణలో కీలక ట్విస్ట్!
రేవంత్ మాటలు నమ్మకండి.. కేరళ ప్రజలకు తెలంగాణ బిడ్డ విజ్ఞప్తి

