వీకెండ్ పార్టీలు చేసుకుని, ఫుల్లుగా మద్యం తాగి స్టీరింగ్ పడుతున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే పోలీసులు ఏకంగా బండిని సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకువెళుతున్నారనే భయం మిమ్మల్ని వెంటాడుతోందా? అయితే వాహనదారులకు ఇది నిజంగా ఊపిరి పీల్చుకునే బ్రేకింగ్ న్యూస్! తెలంగాణ హైకోర్టు పోలీసుల దూకుడుకు కళ్లెం వేస్తూ, సగటు వాహనదారుడికి ఊరటనిచ్చే ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ఈ సంచలన తీర్పు వెనుక ఉన్న పూర్తి కథ ఏంటి? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం!
బండి సీజ్ చేసే హక్కు లేదు.. చార్జ్‌షీట్‌కు డెడ్‌లైన్!
తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం, రవాణా శాఖ నిబంధనల్లోని 'రూల్ 44ఏ'ను పోలీసులు కచ్చితంగా, తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో ఎవరైనా పీకలదాకా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే.. వారిపై చట్టప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయవచ్చని, కానీ ఆ సాకుతో వారి వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం పోలీసులకు ఏమాత్రం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, పట్టుబడిన వ్యక్తిని నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే, కేవలం మూడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులకు కఠిన డెడ్‌లైన్ విధించింది.
న్యాయపోరాటం మొదలైంది ఇలా..
ఈ సంచలన తీర్పు వెనుక ఒక సుదీర్ఘ న్యాయపోరాటం దాగి ఉంది. 2025లో సాయిరాం రావు అనే వ్యక్తి పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు. ఆ సమయంలో పోలీసులు నిబంధనలను పక్కనపెట్టి ఆయన వాహనాన్ని సీజ్ చేసి నేరుగా స్టేషన్‌కు తరలించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆ వాహన అసలు యజమాని విజయ్ హైకోర్టు మెట్లు ఎక్కారు. కేవలం డ్రైవర్ మద్యం తాగాడనే ఒకే ఒక్క కారణంతో పోలీసులు తమ వాహనాన్ని ఎలా సీజ్ చేస్తారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులకు షాక్.. పత్రాలు ఇస్తే బండి ఇచ్చేయాల్సిందే!
విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై లోతుగా విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. కేవలం డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్నాడన్న కారణం చూపి, ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారమే పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ వాహన యజమాని తన వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపిస్తే, వెంటనే ఆ వాహనాన్ని తిరిగి యజమానికి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
బండి ఎవరికి ఇవ్వాలి? రూల్స్ ఏం చెబుతున్నాయి?
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి అతడిని వాహనం నడపడానికి పోలీసులు ఎలాగూ అనుమతించరు. మరి ఆ బండి ఏమవ్వాలి? దీనిపై కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ వ్యక్తితో పాటు వాహనంలో ఎవరైనా మద్యం తాగని వారు ఉండి, వారికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. బండిని క్షేమంగా వారికి అప్పగించాలని కోర్టు తెలిపింది. ఒకవేళ ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పక్కన ఎవరూ లేక ఒంటరిగా దొరికిపోతే.. వెంటనే వారి బంధువులకు గానీ, స్నేహితులకు గానీ సమాచారం ఇచ్చి పిలిపించి, వాహనాన్ని వారికి అప్పగించాలని ఆదేశించింది.
ఈ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే..
ఒకవేళ ఎంతసేపు చూసినా స్నేహితులు, బంధువులు ఎవరూ రాని పక్షంలో.. అప్పుడు మాత్రమే, వేరే గత్యంతరం లేక ఆ వాహనాన్ని భద్రత నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించాలని న్యాయస్థానం సూచించింది. కేవలం డ్రైవర్ మద్యం సేవించాడనే కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి నొక్కి చెప్పింది. తెలంగాణ మోటార్ వెహికిల్ రూల్స్ 1989ను పోలీసులు కచ్చితంగా పాటించి తీరాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఏది ఏమైనా, న్యాయస్థానం ఊరటనిచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్లు తాగి బండి నడపడం మీ ప్రాణాలకే కాదు, రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పే అన్న నగ్న సత్యాన్ని మరువకండి! డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ మీద చేతులు ఉండాలి కానీ, మత్తులో కళ్లు మూసుకుపోకూడదు!

