ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై మరో సెన్సేషన్! ఢిల్లీ పార్లమెంట్‌లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై ఓ వైపు సీరియస్ చర్చలు రగులుతున్న వేళ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేల్చిన 'మావిగన్' బాంబు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల కలయికతో 'మావిగన్' (MAVIGAN) పేరుతో సరికొత్త రాజధాని ఏర్పాటు చేయాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం.. రగులుతున్న చర్చ!
మావిగన్ పేరు తెరపైకి రాగానే సోషల్ మీడియా అడ్డంగా రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు జగన్ విజన్‌కు బ్రహ్మరథం పడుతుంటే.. ఇంకొందరు మాత్రం దారుణమైన సెటైర్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మావిగన్ చుట్టూ రకరకాల మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ హై-ఓల్టేజ్ పొలిటికల్ డ్రామా మధ్య, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ రంగంలోకి దిగి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
ఆ సలహా ఇచ్చినవాడిని తరిమి తన్నాలి: కేఎస్ ప్రసాద్ ఫైర్!
ఒక తాజా ఇంటర్వ్యూలో కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. జగన్‌కు ఇలాంటి దిక్కుమాలిన 'మావిగన్' సలహా ఇచ్చిన ఆ వ్యక్తిని క్షమాభిక్ష లేకుండా వెంటపడి తన్నాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ముమ్మాటికీ ఒక తెలివితక్కువతనానికి నిదర్శనమని ఆయన ఘాటుగా విమర్శించారు.
గతంలో మూడు రాజధానుల సలహాతో పార్టీని గందరగోళంలోకి నెట్టిన ఆ వ్యక్తులే.. ఇప్పుడు మళ్లీ ఈ మావిగన్ లాంటి తెలివితక్కువ ఐడియా ఇచ్చారని మండిపడ్డారు. జగన్ చుట్టుపక్కల ఏదో ఒక అంతర్గత శత్రువు దాగి ఉన్నాడని, ఆ కారణంగానే ఇలా జరుగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. వైఎస్ జగన్ విజన్, ఆయన ఐడియాలజీని కచ్చితంగా అర్థం చేసుకుని ముందుకు నడిపించే నాయకులు వైసీపీలో పూర్తిగా కరువయ్యారని ఆయన విశ్లేషించారు.
ఆలోచన అద్భుతం.. కానీ టైమింగ్ మిస్సయింది!
కేఎస్ ప్రసాద్ కేవలం విమర్శలకే పరిమితం కాలేదు, జగన్ ఆలోచనలోని ఇన్నర్ మీనింగ్‌ను కూడా విశ్లేషించారు. మచిలీపట్నం పోర్టు, అద్భుతమైన హైవే కనెక్టివిటీ, రాష్ట్రానికి అవసరమైన రెవెన్యూ జనరేషన్ వంటి కీలక పాయింట్స్ పరంగా చూస్తే జగన్ 'మావిగన్' ఆలోచన నిజంగా మంచిదేనని ఆయన మెచ్చుకున్నారు. కానీ, ఆ బ్రహ్మాస్త్రాన్ని బయటపెట్టిన సందర్భమే ఏమాత్రం బాగోలేదన్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత.. అప్పటి నుంచే ఈ మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు కేఎస్ ప్రసాద్. అలా కాకుండా, పార్లమెంట్‌లో అమరావతి బిల్లుపై సీరియస్ చర్చ జరుగుతున్న సమయంలో సడెన్‌గా ఈ ప్రతిపాదన తేవడం తెలివితక్కువతనమని అభిప్రాయపడ్డారు. తీరా ఇప్పుడు ఈ మావిగన్ పేరుతో జగన్ మళ్లీ అధికార టీడీపీ చేతికి ఏకే-47 లాంటి గన్ ఇచ్చారని ఆయన విశ్లేషించారు.
అమరావతిపై స్పష్టత ఏది? ప్రజలకు ఆ నిజాలు చెప్పాలి!
రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ తన వైఖరిని ప్రజలకు సూటిగా, స్పష్టంగా చెప్పాలని కేఎస్ ప్రసాద్ సూచించారు. అమరావతికి ఆయన అనుకూలమా, లేక వ్యతిరేకమా అనేది తేల్చి చెప్పాలన్నారు. "అమరావతి ఇష్టమే.. కానీ అలా అయితే ఓకే, ఇలా అయితే ఓకే" అనే గందరగోళ మాటలు మాట్లాడకూడదన్నారు.
రాష్ట్రానికి ఇప్పుడు రెవెన్యూ ఎంతో అవసరమని, ఇందుకోసమే మావిగన్ అంశాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. అమరావతి నిర్మించడానికి లక్షల కోట్లు అవసరమని, అదే 20 వేల కోట్లతో ఇక్కడ రాజధాని అద్భుతంగా ఏర్పాటు చేసుకోవచ్చని.. ఈ నిజాన్ని రెండేళ్ల క్రితమే జగన్ ప్రజల మెదళ్లలోకి ఎక్కించి ఉండాల్సిందని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
ఏదేమైనా.. 'మావిగన్' అనే ఈ సరికొత్త పదం ఏపీ రాజకీయాల్లో ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇది జగన్ మాస్టర్ స్ట్రోకా? లేక సెల్ఫ్ గోలా? అనేది కాలమే నిర్ణయిస్తుంది!
Also Read:
TTD Temple in Netherlands: నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయంAP High Court : గర్భగుడి పవిత్రతపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. పూజారులకు షాక్!
Thalliki Vandanam Scheme: తల్లికి వందనం నిధులపై సీఎం గుడ్‌న్యూస్!
Nara Lokesh: సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. భావోద్వేగానికి గురైన లోకేష్
Chandrababu Naidu: ఏపీ జలాల్లోకి తమిళ జాలర్లు వస్తే సహించం

