అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై మన లోకల్ కుర్రాడు ప్రతీకారం తీర్చుకోవడం.. పాయింట్ వినడానికే ఎంతో వింతగా, థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! మరి మే 1న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'గాయపడ్డ సింహం' సినిమా.. సగటు ప్రేక్షకుడికి ఆశించిన వినోదాన్ని పంచిందా?
పెళ్లిచూపుల నుంచి గ్యాంగ్‌స్టర్స్ దాకా!
దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా వినూత్న కథతో సాగుతుంది. దరహాస్ (తరుణ్ భాస్కర్), యూట్యూబర్ షాలిని (ఫరియా అబ్దుల్లా) ఒక పెళ్లిచూపుల సెటప్‌లో కలుసుకుని పెళ్లికి సిద్ధమవుతారు. కానీ షాలిని తండ్రి, ఐజీ విజయకాంత్ (శుభలేఖ సుధాకర్)కి దరహాస్ గతం ముందే తెలుసన్న నిజం షాలినిని షాక్‌కు గురిచేయడంతో కథ మలుపు తిరుగుతుంది.
గ్యాంగ్‌స్టర్ బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి)కి, దరహాస్‌కి ఉన్న లింక్ ఏంటి? అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దరహాస్ ఎందుకు పగబట్టాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
క్రేజీ పాయింట్.. నవ్వించిన నటులు
టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక అత్యంత వింతైన, క్రేజీ పాయింట్. ఇలాంటి విభిన్నమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశం ఉన్న యువకుడి పాత్రలో తరుణ్ భాస్కర్ అద్భుతంగా ఒదిగిపోయాడు.
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కేవలం కెమెరా వెనుకే కాకుండా, తెరపై హీరో స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని కామెడీ ఎపిసోడ్స్ థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తాయి.
తేలిపోయిన స్క్రీన్‌ప్లే.. నిరాశపరిచిన ద్వితీయార్థం
ఐడియా ఎంత అద్భుతంగా ఉందో, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు అంతగా తడబడ్డాడు. సినిమా సెకండాఫ్‌లో ఆ క్రేజీనెస్ మొత్తం పేలుతుందని ఆశించిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది. ఫస్ట్ హాఫ్ కేవలం పాత్రల పరిచయానికే పరిమితమై అత్యంత నెమ్మదిగా నత్తనడకన సాగుతుంది.
సినిమాలో ఎంతో కీలకమైన శ్రీవిష్ణు పాత్ర ఆరంభంలో అదరగొట్టినా, ముగింపు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది. ఆయన వింత కుటుంబం ట్రాక్ కొంతవరకే వర్కవుట్ అయింది. ఇక జేడీ చక్రవర్తి లాంటి టాలెంటెడ్ నటుడికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఇచ్చి వృధా చేశారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి లాంటి ఫీమేల్ లీడ్స్ కు కథలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. విష్ణు ఓయ్, హర్షవర్ధన్ లాంటి వారు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
బెడిసికొట్టిన స్పూఫ్ కామెడీ
క్లైమాక్స్‌ను ఉత్కంఠభరితంగా మలచాల్సిన దర్శకుడు.. ప్యారడీల బాట పట్టి సినిమాను గాడి తప్పించాడు. కేజీఎఫ్ (KGF) స్టైల్ నెరేషన్, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌పై వేసిన సెటైర్లు ఏమాత్రం పేలలేదు. పైగా అవి కథలోని ఎమోషన్‌ను చంపేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతికంగా ఎలా ఉందంటే..
సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి అందించిన మ్యూజిక్ సోసోగా అనిపిస్తుంది. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ మాత్రం నీట్‌గా, ఆకట్టుకునేలా ఉంది. విప్లవ్ నైషధం ఎడిటింగ్‌కు ఇంకాస్త కత్తెర పడాల్సింది. నిర్మాతలు కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సాల్ ఎక్కడా రాజీ పడకుండా పెట్టిన నిర్మాణ విలువలు తెరపై రిచ్‌గా కనిపిస్తాయి.
ఒక అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనను.. సరైన కథనం లేక ఎలా నీరుగార్చొచ్చో చెప్పడానికి 'గాయపడ్డ సింహం' ఒక పక్కా ఉదాహరణ. ప్యారడీల పిచ్చికి పోకుండా, కామెడీపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఉంటే ఇది కచ్చితంగా ఒక బ్లాక్‌బస్టర్ అయ్యేది. తరుణ్ భాస్కర్ నటన కోసం ఒకసారి చూడొచ్చు కానీ.. భారీ అంచనాలతో థియేటర్‌కు వెళితే మాత్రం నిరాశ తప్పదు.
రేటింగ్: 2.75/5
Also Read:
Jetlee Movie Review : సత్య హీరోగా జెట్లీ మూవీ రివ్యూరాజా శివాజీ రివ్యూ: తానాజీని మించిన అసలు సిసలైన పోరాటం!
అషురెడ్డికి హైకోర్టు ఊరట.. నెటిజన్లకు, మీడియాకు కఠిన హెచ్చరికలు
అషురెడ్డి వాయిస్ రికార్డ్ లీక్: ఏకంగా వేణుస్వామి పేరు వాడుకుంటూ ఎన్నారైకి బెదిరింపులు!
Akira Nandan : అకీరా ఎంట్రీపై అడివి శేష్ హాట్ కామెంట్స్

