[FEATURED_IMAGE]
ఒకప్పుడు తన గ్లామర్, నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ, 2016లో అమెరికన్ సిటిజన్ జీన్ గూడెనఫ్‌ను పెళ్లాడి పూర్తిగా అక్కడే స్థిరపడింది. ఆ తర్వాత 2021లో సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన ఆమె, మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా తన భర్త, పిల్లల తర్వాతేనని, పిల్లలను పెంచడంలో దొరికే ఆనందం ఏ విజయానికీ సాటిరాదని ఆమె కుండబద్దలు కొట్టింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో వెబ్ సిరీస్‌ల హవా నడుస్తున్నప్పటికీ, ఓటీటీ ఆఫర్లను మాత్రం ప్రీతి సున్నితంగా తిరస్కరిస్తోంది. ఒక వెబ్ సిరీస్ చేయాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు కేటాయించాల్సి వస్తుందని, అంతకాలం తన చిన్నారులకు దూరం కావడం తనవల్ల కాదని స్పష్టం చేసింది. తనను ప్రోత్సహించే కథలు వస్తే సినిమాలు చేస్తానని చెబుతూనే, కెరీర్ కోసం కుటుంబానికి ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ఇక ఇండియాలో షూటింగ్ ఉన్నప్పుడు పిల్లల బాధ్యతను ఎలాంటి ఫిర్యాదు లేకుండా తన భర్త చూసుకుంటారని, అలాంటి భాగస్వామి దొరకడం తన అదృష్టమని ఆమె మురిసిపోయింది. తన పిల్లలు సగం అమెరికన్లు అయినప్పటికీ, వారికి పూర్తిగా భారతీయ సంప్రదాయాలు, విలువలనే నేర్పిస్తున్నట్లు తెలిపింది. కేవలం కీర్తి కోసమే ఆరాటపడే ప్రస్తుత సమాజంలో, కుటుంబ బంధాలకు ప్రీతి ఇస్తున్న ప్రాధాన్యత నిజంగా స్ఫూర్తిదాయకం. ఆగస్టు 14న విడుదల కానున్న 'బత్వారా 1947' మూవీతో ఈ సీనియర్ నటి తన మార్క్ నటనతో ప్రేక్షకులను మరోసారి సర్ ప్రైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

