[FEATURED_IMAGE]
సినిమా రైటర్ అవ్వాలని కలలు కనే ఒక సాధారణ కానిస్టేబుల్, క్లోజ్ అయిపోయిన పాత ఆత్మహత్య కేసును రీఓపెన్ చేయడం ఈ కథకు ప్రాణం. లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆ మరణం వెనుక ఒక సైకోపాత్ ఉన్నాడని గ్రహించిన ఆ కానిస్టేబుల్.. తన సొంత భ్రమలతో, భయాలతో ఎలా పోరాడాడనేది ఇందులో కీలకం. శత్రువు బయట కాకుండా తన బుర్రలోనే ఉన్నాడనే పాయింట్ చుట్టూ అల్లిన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ముల్లుమీద కూర్చోబెడుతుంది.
మలయాళ స్టార్ హీరో కుంచాకో బోబన్ ఇందులో కానిస్టేబుల్ పాత్రలో జీవించగా, 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. 'జోసెఫ్', 'నాయట్టు' లాంటి అద్భుతమైన కంటెంట్‌ను అందించిన షాహి కబీర్ కలం నుంచి ఈ స్టోరీ పుట్టడం దీనికి అతిపెద్ద బలం. ప్రముఖ ఎడిటర్ కిరణ్ దాస్ తొలిసారి మెగాఫోన్ పట్టి 143 నిమిషాల పాటు ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ మిస్టరీని నడిపించారు.
జూలై 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెలాఖరు నాటికి 'ఉన్మాదం' స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు లాజిక్స్‌కు పెద్దపీట వేస్తాయి. ఈ మధ్య సోనీలివ్‌లో వస్తున్న ప్రాంతీయ క్రైమ్ కథలు క్వాలిటీ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. బుర్రకు పదునుపెట్టే సస్పెన్స్, ఊహించని ట్విస్టులు ఇష్టపడే వారికి 'ఉన్మాదం' కచ్చితంగా ఒక బెస్ట్ వాచ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు ఓటీటీ స్పేస్‌లో మంచి వ్యూవర్‌షిప్ రికార్డులు నమోదు చేయడం పక్కా!

