కథేంటంటే.. ఊహించని వింత అనుభవం!
డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) కు గ్యాంబ్లింగ్ (జూదం) అంటే విపరీతమైన పిచ్చి. ఆ వ్యసనం కారణంగా తన దగ్గర ఉన్నదంతా కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా, ఆ అప్పులు తీర్చడానికి క్రికెట్ బెట్టింగ్ వైపు అడుగులేస్తాడు. కానీ అక్కడ కూడా ఉన్న కాస్త డబ్బును పోగొట్టుకుని తీవ్ర నిరాశకు గురవుతాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో తన డబ్బును రికవరీ చేయడానికి ఒక పెద్ద గొడవకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు.
ఆ దెబ్బకు డాన్ జాన్ కోమాలోకి వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన అతడిని చూసి అంతా నార్మల్ అయిపోయాడు అనుకుంటారు. కానీ డాన్ కు మాత్రం తనలో ఏదో ఒక వింత మార్పు జరిగినట్లు అర్థమవుతుంది. అసలు డాన్ కు జరిగిన ఆ వింత అనుభవం ఏంటి? ఆ మాయాజాలం చుట్టూ జరిగే గందరగోళాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఈ గేమ్ నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: దుల్కర్ డెడికేషన్.. టెక్నికల్ బ్రిలియన్స్!
ఎప్పటిలాగే దుల్కర్ సల్మాన్ ఒక సరికొత్త ఐడియాతో కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ప్రధాన బలం ఆ కొత్త కాన్సెప్టే. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో ఈ కథ సక్సెస్ అయింది. ఇక దుల్కర్ నటన గురించి వంక పెట్టాల్సిన పనేలేదు. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో తనదైన మార్క్ చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో దుల్కర్ పడిన కష్టం స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. కథలో ఉన్న వేరియేషన్స్ వల్ల అతనికి నటనకు మంచి స్కోప్ దొరికింది.
హీరోయిన్ కాయదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, దుల్కర్ తో ఆమె కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. విలన్ గా మిస్కిన్ తన పరిధి మేరకు డీసెంట్ గా నటించగా, సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే ఆంటోనీ వర్గీస్ తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో సంయుక్త విశ్వనాథ్ మెప్పించింది. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్ సీన్స్ లో ఫాస్ట్ కట్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి ఒక గ్రాండ్ కమర్షియల్ ఫీల్ ను తీసుకొచ్చాయి.
మైనస్ పాయింట్స్: సాగతీత స్క్రీన్ప్లే.. విలన్ వీక్!
కథా నేపథ్యం కొత్తగా ఉన్నా, దర్శకుడు దాన్ని తెరపై చూపించిన విధానం మాత్రం కాస్త రొటీన్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ మంచి ట్విస్ట్ తో సెట్ చేసి అంచనాలు పెంచినా, సెకండాఫ్ కి వచ్చేసరికి ఆ గ్రిప్ మిస్ అయింది. చాలా సీన్స్ రిపీట్ అవ్వడం, కథ ఈజీగా ఊహించేలా ఉండటంతో ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. మొదట్లో యాక్షన్ సీన్స్ ఉత్కంఠగా అనిపించినా, తర్వాత ఏం జరగబోతోందో ముందే తెలిసిపోవడంతో ఆ కిక్ తగ్గుతుంది. అలాగే క్రికెట్ బెట్టింగ్ ట్రాక్ కూడా ఇదివరకే చాలా సినిమాల్లో చూసేయడంతో అందులో కొత్తదనం అనిపించదు.
ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ దాని రన్ టైమ్. దాదాపు మూడు గంటల నిడివి ఈ కథకు అవసరం లేదు. కనీసం ఒక 20-30 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా చాలా ఫాస్ట్ గా, ఎంగేజింగ్ గా ఉండేది. ఇక మిస్కిన్ విలనిజం అంత పవర్ ఫుల్ గా, భయపెట్టేలా అనిపించదు. హీరోకు దీటుగా ఒక యంగ్ అండ్ స్టైలిష్ విలన్ ఉండి ఉంటే, క్లాషెస్ ఇంకాస్త ఇంటెన్స్ గా వర్కౌట్ అయ్యేవి.
విశ్లేషణ - రేటింగ్: 2.75/5
దర్శకుడు నహాస్ హిదాయత్ ఒక ఎగ్జైటింగ్ పాయింట్ తో కథను మొదలుపెట్టినా, దాన్ని ఒక నాన్-స్టాప్ యాక్షన్ థ్రిల్లర్ గా మలచడంలో తడబడ్డాడు. కొన్ని సీక్వెన్స్ ల్లో తన టాలెంట్ చూపించినా, సెకండాఫ్ పై మరింత పట్టు సాధించాల్సింది. ఎడిటర్ చమన్ చాకో యాక్షన్ సీన్స్ లో మెప్పించినా, సాగతీత సీన్స్ కు కత్తెర వేయాల్సింది. విజువల్స్ పరంగా జిమ్షీ ఖలీద్, జోమోన్ టి జాన్, నిమిష్ రవి కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే, ఒక కొత్త ఫ్లాట్ లైన్ ఉన్నా సరే.. నెమ్మదించిన స్క్రీన్ ప్లే సినిమాను కిందకు లాగేసింది. మీరు దుల్కర్ సల్మాన్ అభిమాని అయి ఉండి, కొత్త తరహా యాక్షన్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వారైతే.. తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.

