సినిమా అనగానే క్రియేటివ్ లిబర్టీ తీసుకోవడం కామనే. కానీ, దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక చారిత్రక మహనీయుడిని, కేవలం హీరో ఎలివేషన్ కోసం 'సైడ్ క్యారెక్టర్'గా వాడితే ఏమవుతుంది? సరిగ్గా ఇప్పుడు ఇదే పాయింట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఫౌజీ’ టీజర్‌ను ఓ పెద్ద వివాదంలోకి నెట్టేసింది. స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు రంగంలోకి దిగి టీజర్‌ను డిలీట్ చేయాలని డిమాండ్ చేయడంతో, ఒక కమర్షియల్ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. అసలు చరిత్రను వక్రీకరించి స్టార్ హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న సామాన్యుల్లో సైతం మొదలైంది.
[FEATURED_IMAGE]దర్శకుడు హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఫౌజీ' ప్రీ-ఇండిపెండెన్స్ పీరియడ్ డ్రామా. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే కానుకగా వచ్చిన ఈ టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతూ ప్రభాస్ పాత్రను ఆకాశానికెత్తేయడం ఈ మొత్తం వివాదానికి మూలకారణం.
దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీని, ఇలా ఒక ఫిక్షనల్ హీరోను పొగిడేందుకు వాడుకోవడంపై చరిత్రకారులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మేకర్స్‌పై ఫైర్ అయ్యారు. "చరిత్రకు కల్పితాలను జోడించి చూపించడం పెద్ద నేరం" అంటూ వారి తీరును తప్పుబట్టారు.
చరిత్రను వక్రీకరించిన ఆ టీజర్‌ను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని, దాని స్థానంలో కొత్త టీజర్ రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్శకుడు హను, మైత్రీ సంస్థతో పాటు హీరో ప్రభాస్ కూడా ఈ వివాదంపై దృష్టి సారించాలని చంద్రకుమార్ బోస్ కోరారు. అయితే ఈ విమర్శలపై డార్లింగ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ఇది కేవలం నిజమైన పాత్రల ఆధారంగా అల్లుకున్న ఫిక్షనల్ డ్రామా మాత్రమేనని, క్రియేటివ్ లిబర్టీని అర్థం చేసుకోవాలని సర్దిచెబుతున్నారు.
ఇక ఈ టీజర్‌లో ప్రభాస్‌ను "ఇండియాస్ బిగ్గెస్ట్ రెబెల్ సోల్జర్"గా పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. నేతాజీ ప్రసిద్ధ నినాదమైన 'రక్తాన్ని ఇవ్వండి.. స్వాతంత్య్రాన్ని ఇస్తాను' అనే డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. "అబేయ్ ఓ ఫిరంగీ.. నేను నీ రక్తం తీసుకుంటాను, ఆజాదీ కూడా లాక్కుంటాను" అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇమాన్వి హీరోయిన్‌గా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
క్రియేటివ్ లిబర్టీ పేరుతో చారిత్రక వాస్తవాలతో ఆడుకోవడం ఏ మేకర్స్‌కైనా కత్తిమీద సామే. జాతీయ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న నేతాజీ లాంటి నాయకుడి విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే, రేపు సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ సెగలు తప్పవు. వివాదం మరింత ముదరకముందే మైత్రీ సంస్థ స్పందించి టీజర్‌ను రీ-ఎడిట్ చేసి రిలీజ్ చేయడమే ప్రాజెక్ట్‌కు శ్రేయస్కరం. లేదంటే ఈ చిన్న నిప్పురవ్వ, సినిమా ప్రమోషన్స్ నాటికి భారీ దావానలంగా మారే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

