బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గ్లోబల్ మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే 'కింగ్' మూవీ ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ.175 కోట్లకు అమ్ముడుపోవడం ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో సరికొత్త సంచలనం. కేవలం ఫేస్ వాల్యూతోనే ఈ రేంజ్ మినిమమ్ గ్యారెంటీ బిజినెస్ జరగడం చూస్తుంటే.. గ్లోబల్ మార్కెట్‌లో షారుఖ్ ఖాన్ బ్రాండ్ ముందు హాలీవుడ్ సినిమాలు సైతం తలవంచాల్సిందే అన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది.
[FEATURED_IMAGE]ఆల్ టైమ్ రికార్డ్.. రూ.175 కోట్ల డీల్!
'వార్', 'పఠాన్' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ 'కింగ్'. తాజాగా ఈ సినిమా విదేశీ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ 'ఫార్స్ ఫిల్మ్స్' ఏకంగా రూ.175 కోట్లకు దక్కించుకుంది. సినిమా హిట్టా ఫ్లాపా అన్నదానితో సంబంధం లేకుండా నిర్మాతలకు ఈ కనీస హామీ (మినిమమ్ గ్యారెంటీ) మొత్తం అందుతుంది.
ఇంతకుముందు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందని వార్తలు వచ్చినా, ఇప్పుడు ఆ భారీ డీల్ ఫార్స్ ఫిల్మ్స్ చేతికి దక్కినట్లు పింక్‌విల్లా స్పష్టం చేసింది. భారతీయ సినిమా చరిత్రలో ఇలా మినిమమ్ గ్యారెంటీ పద్ధతిలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా 'కింగ్' చరిత్ర సృష్టించింది.
కూతురితో కలిసి బాద్‌షా విధ్వంసం
ఈ సినిమా షారుఖ్ ఖాన్‌కు ఎంత స్పెషలో.. ఆయన కూతురు సుహానా ఖాన్‌కు కూడా అంతే స్పెషల్. ఎందుకంటే ఈ మూవీతోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా ఒక ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించనుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
అదరగొట్టే కాస్టింగ్.. డిసెంబర్‌లో రచ్చ!
ఇక ఈ మూవీ కాస్టింగ్ చూస్తే కళ్లు చెదరడం ఖాయం. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ లాంటి ఉద్దండులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ భారీ విజువల్ వండర్ 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
గ్లోబల్ మార్కెట్‌లో 'కింగ్' ఖాన్ రూలింగ్
సినిమా ఇంకా పూర్తి కాకుండానే రూ.175 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ జరగడం అంటే.. అది ఒక కేవలం ఒక సినిమాపై పెట్టిన పెట్టుబడి కాదు, షారుఖ్ ఖాన్ అనే గ్లోబల్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకం. పఠాన్, జవాన్ సినిమాలతో ఓవర్సీస్‌లో ఆయన సృష్టించిన సునామీ చూశాకే డిస్ట్రిబ్యూటర్లు ఇంత భారీ రిస్క్ చేయడానికి ముందుకొచ్చారు. సరైన కంటెంట్ పడితే, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ మూవీ వసూళ్లు వెయ్యి కోట్లు దాటడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇండియన్ సినిమా హద్దులు చెరిపేస్తూ.. గ్లోబల్ స్థాయిలో మన సత్తా చాటుతున్న ఇలాంటి ట్రెండ్ నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం!

