ఆదర్శ కుటుంబం ఈవెంట్: త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

naveen
By -
ఫ్యామిలీనే ఆయన మాస్, మజిల్.. వెంకటేష్ పై త్రివిక్రమ్ ప్రశంసలు!

దశాబ్దాల తర్వాత విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. తన కెరీర్ తొలి అడుగుల నుంచి వెంకటేష్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, ఉద్ధవ గీత, శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ కుటుంబ విలువలపై ఇచ్చిన సందేశం అందరినీ కట్టిపడేసింది. ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ చిత్ర కథ అని చెబుతూ త్రివిక్రమ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

[FEATURED_IMAGE]

వెంకటేష్‌ గారే నాతో ఓనమాలు దిద్దించారు


టాలీవుడ్ స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో 'ఆదర్శ కుటుంబం' వేదికపై ఎమోషనల్‌గా పంచుకున్నారు. రచయితగా తన తొలి అడుగు విక్టరీ వెంకటేష్ నటించిన 'పవిత్ర బంధం' సినిమాతోనే మొదలైందని గుర్తుచేసుకున్నారు. ఒక రకంగా వెంకటేష్ గారే తనతో ఇండస్ట్రీలో ఓనమాలు దిద్దించారని, ఆ తర్వాత వచ్చిన 'పెళ్లి చేసుకుందాం' సమయంలోనూ తనను ఎంతగానో ఎంకరేజ్ చేశారని త్రివిక్రమ్ కృతజ్ఞతలు తెలిపారు.


నువ్వు నాకు నచ్చావ్.. అప్పుడే ఓకే అయింది


ఇక తన కెరీర్‌ను మలుపుతిప్పిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా కథ చెప్పినప్పటి సంఘటనను త్రివిక్రమ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. తాను ఆ కథ చెప్పడం పూర్తయిన వెంటనే వెంకటేష్ పైనుంచి కిందకు వచ్చి, "ఈ సినిమా మనం చేస్తున్నాం.. ఎవరేం చెప్పినా నువ్వు పట్టించుకోవద్దు" అని అప్పటికప్పుడే నిర్మాతలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారట. ఆ ఒక్క మాటతో తన జీవితం వేరే టర్న్ తీసుకుందని త్రివిక్రమ్ సగర్వంగా చెప్పారు.


ఆ నలుగురి పద్మవ్యూహమే ఈ సినిమా!


మనుషుల్లో ఆశ, కోరిక, కలహ ప్రియత్వం ఎక్కువగా ఉంటాయని ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడని, ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో వివాదాలు పెరుగుతున్న వేళ కుటుంబం మాత్రమే మనకు మిగిలిన ఏకైక బంధమని త్రివిక్రమ్ విశ్లేషించారు. శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబం అనేది ఒక పద్మవ్యూహం లాంటిదని అన్నారు. అందులోకి వెళ్లి అభిమన్యుడిలా చనిపోతారా? అర్జునుడిలా గెలిచి వస్తారా? అనేదే ఈ చిత్ర కథ అని వివరించారు. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు వ్యక్తులు తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడిన కష్టమే 'ఆదర్శ కుటుంబం' అని హింట్ ఇచ్చారు.


వెంకటేష్ మాస్, బలం.. ఫ్యామిలీనే!


ఫ్యామిలీ సినిమాలతో కూడా ఒక హీరో సూపర్ స్టార్ అవ్వచ్చని ప్రూవ్ చేసిన ఏకైక నటుడు వెంకటేష్ అని త్రివిక్రమ్ కొనియాడారు. "ఫ్యామిలీనే ఆయన మాస్, ఫ్యామిలీనే ఆయన మజిల్, ఫ్యామిలీనే ఆయన బలం" అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. కుటుంబాన్ని మనం ఎంచుకోలేమని, అది దేవుడిచ్చిన బహుమతి అని చెబుతూ త్రివిక్రమ్ ముగించిన తీరు ఈవెంట్ మొత్తానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విక్టరీ కొట్టడం పక్కా అనే భరోసాను ఆయన మాటలు కలిగించాయి.