విజయ్, రష్మిక సీరియస్: సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

naveen
By -
విజయ్, రష్మిక సీరియస్ యాక్షన్: సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు!

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) తమపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితంపై లేనిపోని కట్టుకథలు అల్లుతూ, మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేస్తున్న వారిపై విరోష్ టీమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం హద్దులు దాటి ట్రోల్ చేస్తున్న వారి భరతం పట్టేందుకు ఈ జంట చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

[FEATURED_IMAGE]

హద్దులు దాటిన ట్రోలింగ్


గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ, రష్మికల జంటపై ఎన్నో అసత్య కథనాలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. తమపై వస్తున్న ఈ పుకార్లపై రీసెంట్‌గా ఈ జంట సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించి కౌంటర్ ఇచ్చినా కూడా కొందరు ఆకతాయిలు ఆగలేదు.


ఫేక్ చాట్స్, మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు


ఈ స్టార్ కపుల్ పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్‌ను స్ప్రెడ్ చేస్తున్నారు. కావాలనే మార్ఫింగ్ చేసిన నకిలీ స్క్రీన్‌షాట్లను నెట్టింట వైరల్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్ వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం తమ పరువు తీసేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వీరి వెనుక ఉన్నదెవరో తేల్చాలని విరోష్ టీమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.


రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు


ఇక ఈ ఆన్‌లైన్ వేధింపులను ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న విరోష్ టీమ్.. ఆయా ఖాతాల వివరాలను ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు ఆ నకిలీ పోస్టులు పెట్టిన ఖాతాలను, వాటిని సర్క్యులేట్ చేసిన అడ్మిన్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. తప్పుడు రాతలు రాసేవారికి, ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవారికి కఠిన శిక్షలు పడేలా ఈ కేసు విచారణ వేగవంతం కానున్నట్లు సమాచారం.