పాన్ ఇండియా మూవీ 'ఫౌజీ' వాయిదాతో టాలీవుడ్‌లో కుర్ర హీరోలకు లైన్ క్లియర్ కాగా.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం డిసెంబర్ మొదటి వారంలో ముక్కోణపు పోటీకి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4న ఒకేరోజు ఏకంగా ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ట్రైన్’, ఆర్య ‘హలో కాదల్’, యువ నటుడు మణికందన్ ‘మక్కల్ కావలన్’ చిత్రాలు ఒకే రోజున థియేటర్లలో సందడి చేయనుండటంతో కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
[FEATURED_IMAGE]బాక్సాఫీస్ వద్ద డిసెంబర్ నెల బ్లాస్ట్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముందుగా డిసెంబర్ 3న రావాల్సిన భారీ బడ్జెట్ చిత్రం 'ఫౌజీ' వాయిదా పడటంతో టాలీవుడ్‌లో నాగ చైతన్య, నితిన్, విష్వక్ సేన్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు లైన్ క్లియర్ అయింది. అయితే తెలుగులో సోలో రిలీజ్‌లు ప్లాన్ చేస్తుంటే.. తమిళనాట మాత్రం డిసెంబర్ 4వ తేదీన ఏకంగా మూడు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయ్యాయి.
ఈ పోటీలో ముందుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న 'ట్రైన్' చిత్రం నిలిచింది. విలక్షణ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ పూర్తయినా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. మిస్కిన్ టేకింగ్, విజయ్ సేతుపతి నటన తోడవడంతో ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది.
విజయ్ సేతుపతికి పోటీగా హీరో ఆర్య కూడా అదే రోజున బరిలో దిగుతున్నాడు. ఆర్య కెరీర్‌లో 40వ చిత్రంగా రూపొందుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘హలో కాదల్’ డిసెంబర్ 4న విడుదల కానుంది. మలయాళ సూపర్ హిట్ 'ప్రణయ విలాసం' ఫేమ్ నిఖిల్ మురళీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ ఇద్దరు సీనియర్ల మధ్యలోకి యువ నటుడు మణికందన్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘గుడ్ నైట్’, ‘లవర్’, ‘కుడుంబస్తాన్’ లాంటి వరుస హిట్స్ తర్వాత మణికందన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మక్కల్ కావలన్’. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ సమర్పిస్తున్న ఈ సినిమాను కూడా డిసెంబర్ 4నే రిలీజ్ చేస్తున్నారు. ఒకవైపు థ్రిల్లర్, మరోవైపు లవ్ స్టోరీ, ఇంకోవైపు యాక్షన్ డ్రామా ఒకేసారి వస్తుండటంతో.. ఈ ముక్కోణపు పోటీలో బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారోనని కోలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

