ముంబై లాంటి మహా నగరంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికీ భద్రత లేదా? అనే ఆందోళన ఇప్పుడు కలవరపెడుతోంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'తో పాటు ముంబైలోని పలు కీలక ప్రాంతాలను పేల్చేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టి, నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
[FEATURED_IMAGE]బిలియనీర్లు, బడా స్టార్లు నివసించే ముంబై నగరాన్ని వరుస బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. తాజాగా శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒక మెయిల్ అధికారులను పరుగులు పెట్టించింది. ఏకంగా బొంబాయి హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), వర్లీ-మహాలక్ష్మి రేస్కోర్స్లతో పాటు అమితాబ్ బచ్చన్ ఇల్లు 'జల్సా'ను టార్గెట్ చేస్తూ ఈ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో అణువణువూ గాలించారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది కేవలం ఆకతాయిలు చేసిన ఫేక్ (హోక్స్) మెయిల్ అని నిర్ధారించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
'జల్సా' చుట్టూ ఇనుప కంచె.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్!
ఈ బెదిరింపుల నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఇంటి చుట్టూ ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. జుహులోని ఆయన బంగ్లా వద్ద అదనపు బలగాలను మోహరించి, అభిమానులు దగ్గరకు రాకుండా భారీ ఇనుప బారికేడ్లు, సీసీటీవీ నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే నవంబర్ 1న ఆదివారం ఫ్యాన్స్‌ను కలిసే సంప్రదాయంలో భాగంగా.. బిగ్ బి తొలిసారిగా ఒక ప్రత్యేకమైన పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆ గ్యాంగ్ పేరుతో చిల్లర రౌడీల ఆగడాలు!
ముంబైలో ప్రముఖులను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో మేయర్ ఆఫీసు, సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈవెంట్‌తో పాటు, రీసెంట్గా యువ హీరో ఆయుష్మాన్ ఖురానాకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు చెప్పి, ఆ ముసుగులో కొందరు చిల్లర గ్యాంగ్‌లు సెలబ్రిటీలను, పోలీసులను భయపెట్టేందుకు ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఈ ఆకతాయిల కోసం డిజిటల్ వేట మొదలుపెట్టారు. అయితే, ఇలాంటి ఫేక్ బెదిరింపుల వల్ల సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. నేరగాళ్లు ఎంతటి హోక్స్ మెయిల్స్ పంపినా, సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సైబర్ పోలీసులకు చిక్కడం ఖాయం. కానీ, ఇలాంటి బెదిరింపులు పదే పదే పునరావృతం కాకుండా చూడాలంటే.. పట్టుబడిన సైబర్ నేరగాళ్లపై మరింత కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

