ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టే అవుట్‌సైడర్లకు ఎదురయ్యే సవాళ్లు ఎంత భయానకంగా ఉంటాయో నటి శోభిత ధూళిపాళ తాజాగా బయటపెట్టారు. తనకు సాయం చేయడానికి ఏ గాడ్‌ఫాదర్ లేకపోవడం వల్లే ఆ తొలి రోజుల జర్నీ తనను ఎంతో భయపెట్టిందని ఈ విశాఖపట్నం బ్యూటీ ఎమోషనల్ అయ్యారు. ఆడిషన్ల చుట్టూ తిరిగిన కష్టాల నుంచి, ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదిగిన తన సుదీర్ఘ ప్రయాణంలోని ఒడిదుడుకులను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
[FEATURED_IMAGE]సినీ పరిశ్రమ అనేది పైకి కనిపించేంత రంగుల ప్రపంచం కాదు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ నిలదొక్కుకోవడం కత్తిమీద సాము లాంటిదే. తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ తన సినీ కెరీర్ ఆరంభంలో పడిన కష్టాలను, అవుట్‌సైడర్‌గా ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
ఏటా వేలాది మంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తున్నా, సరైన మార్గదర్శకత్వం లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టమన్నారు. తనకు ఏ గాడ్‌ఫాదర్ గానీ, గాడ్‌మదర్ గానీ లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో తన తొలి అడుగులు అత్యంత భయానకంగా గడిచాయని మనసులోని మాటను బయటపెట్టారు.
విశాఖపట్నంలో పుట్టి పెరిగిన శోభిత, చదువు కోసం ముంబై వెళ్లి అక్కడ మోడలింగ్‌లో అడుగుపెట్టారు. మ్యాగజైన్ కవర్ పేజీలపై తనను తాను చూసుకున్నప్పుడు.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తాను సినిమా ప్రపంచంలోకి వెళ్లగలనా అని ఎంతో మదనపడేవారట. ఎవరి పరిచయం లేకుండా ఆడిషన్ల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం, అవకాశాల కోసం వేచిచూడటం ఎంతో కష్టంతో కూడుకున్నదని ఆమె తెలిపారు.
అయితే, ఎక్కడా పట్టుదలను వీడకుండా ప్రయత్నించడంతో, చివరకు అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 (2016) చిత్రంతో తన కల నిజమైందని ఆమె వెల్లడించారు. తొలి సినిమాతోనే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడవడం తన కెరీర్‌ను మార్చేసిందని తెలిపారు.
కెరీర్‌లో ఎదిగే కొద్దీ ఒకరి అప్రూవల్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మనపై మనకు నమ్మకం ఉంటే ఎంతో స్వేచ్ఛగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చని శోభిత యువ నటీనటులకు సూచించారు.మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న శోభిత.. ఆ తర్వాత 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్', 'కూరుప్' వంటి పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటారు.
గత ఏడాది ఏకంగా దేవ్ పటేల్ హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ లోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పా. రంజిత్ స్పోర్ట్స్ డ్రామా వెట్టువంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఎవరి సపోర్ట్ లేకపోయినా నమ్మకం ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని నిరూపిస్తున్నారు.

