బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న నితీశ్ తివారీ ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రానికి థియేటర్లలో పైరసీ ముప్పు వాటిల్లడంతో చిత్ర నిర్మాతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతున్న కీలక సన్నివేశాలను రహస్యంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేస్తున్న వారిపై ముందస్తు నోటీసులు లేకుండానే క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాపీరైట్, సినిమాటోగ్రాఫ్ చట్టాల ప్రకారం జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు తప్పవని మేకర్స్ అధికారికంగా లీగల్ నోటీసు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
[FEATURED_IMAGE]
ణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ భారీ చిత్రానికి ఇప్పుడు పైరసీ రూపంలో ఊహించని తలనొప్పి మొదలైంది. థియేటర్లలో సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు తమ మొబైల్స్‌తో కీలకమైన సీన్లను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలాంటి లీక్డ్ క్లిప్స్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లీగల్ నోటీస్ జారీ.. జైలు శిక్ష తప్పదు!
ఈ పైరసీ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న చిత్రబృందం, తమ అధికారిక ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల ద్వారా ఘాటైన లీగల్ నోటీసును విడుదల చేసింది. థియేటర్ల లోపల రికార్డ్ చేసిన వీడియోలను వాట్సాప్ గ్రూపులు, ఇతర మెసేజింగ్ యాప్స్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరూ షేర్ చేయవద్దని ప్రేక్షకులకు గట్టిగా విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఇలాంటి లీక్డ్ క్లిప్స్‌ను అప్లోడ్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేసింది.
కాపీరైట్ యాక్ట్ 1957, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023తో పాటు ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సినిమా క్లిప్పింగ్స్‌ను రికార్డ్ చేయడం లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం తీవ్రమైన నేరమని పేర్కొంది. ఇది నాన్-బెయిలబుల్ క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుందని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే నేరుగా సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని చిత్రబృందం తేల్చిచెప్పింది.
బాంబే హైకోర్టు ఆదేశాలు.. గూగుల్ నిఘా!
నిజానికి ఈ చిత్రం రిలీజ్ కాకముందే బాంబే హైకోర్టు పైరసీ నుంచి రక్షణ కల్పిస్తూ బలమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌తో పాటు ఓవర్సీస్లో రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ‘గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ వేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్దార్ ఈ ఆదేశాలు ఇచ్చారు. సినిమా కథ, పాత్రలు, వీడియో ఫుటేజ్, సాహిత్యం, ఆడియో రికార్డింగ్స్‌పై పూర్తి కాపీరైట్స్ సదరు సంస్థకే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ ప్రివ్యూల సమయంలో అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ ట్రైలర్ క్లిప్స్‌ను గతంలో కొందరు దొంగతనంగా లీక్ చేసిన ఉదంతాలను లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
అనుమతి లేని ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ సినిమా కంటెంట్ అప్లోడ్ కాకుండా బాంబే హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా నిర్మాతల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే అలాంటి పైరేటెడ్ కంటెంట్‌ను తక్షణమే బ్లాక్ చేయడానికి గూగుల్ వంటి అంతర్జాతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం అంగీకరించారు. నిర్మాతలు తీసుకుంటున్న ఈ దూకుడు లీగల్ చర్యలతో నెట్టింట లీకులకు పాల్పడుతున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి.

