నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ, రాబోయే ‘రామాయణ 2’ను నడిపించడం దర్శకుడికి పెను సవాలుగా మారింది. బాహుబలి తరహాలో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' లాంటి అంతుచిక్కని ట్విస్టులు లేని ఈ పౌరాణిక కథలో.. ఇప్పటికే రెండో భాగం షూటింగ్ పూర్తికావడం, రీషూట్లపై వందల కోట్ల బడ్జెట్ భారం పడే అవకాశం ఉండటంతో, కేవలం విజువల్స్ నమ్ముకోకుండా కథను ఎంత ఎమోషనల్‌గా నడిపిస్తారనే ఉత్కంఠ సినీ వర్గాల్లో మొదలైంది.
[FEATURED_IMAGE]
అందరికీ తెలిసిన పురాణ గాథను వెండితెరపై ఆవిష్కరించి మెప్పించడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. ఆ కథను ఎంత గ్రిప్పింగ్‌గా, భావోద్వేగభరితంగా తెరకెక్కించారనేదే విజయానికి అసలైన గీటురాయి. భారత ఇతిహాసాల ఆధారంగా గతంలో ఎన్నో సీరియళ్లు, సినిమాలు వచ్చినా కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా నితీశ్ తివారీ దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా దూసుకుపోతోంది.
బాహుబలి ట్విస్టులు లేవు.. మరి పార్ట్ 2 ఎలా?
మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో సహజంగానే రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ అంచనాలే ఇప్పుడు దర్శకుడు నితీశ్ తివారీకి అతిపెద్ద సవాలుగా మారాయి. రామాయణం అంటే చిన్నపిల్లాడిని అడిగినా కథ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేస్తారు. ఇందులో దాచడానికి రహస్యాలు ఉండవు, కల్పిత పాత్రలను చొప్పించడానికో లేదా కొత్తగా ట్విస్టులు పెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికో ఏమాత్రం ఆస్కారం లేదు.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మొదటి భాగం చివర్లో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఊహించని ప్రశ్నతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆ ఒక్క పాయింట్‌తోనే రెండో భాగాన్ని సూపర్ ఎంగేజింగ్‌గా నడిపించారు. కానీ రామాయణంలో అలాంటి సీక్రెట్స్ ఏమీ ఉండవు. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే రావణ సంహారం, లంకా దహనం వైపు కథను ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
రీషూట్ సాధ్యం కాదు.. నితీశ్ తివారీ ప్లాన్ ఏంటి?
ఒకవేళ కథను పక్కనపెట్టి కేవలం భారీ వీఎఫ్ఎక్స్, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తోనే రెండో భాగాన్ని నెట్టుకొద్దామంటే అది ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నితీశ్ తివారీ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌ను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉంటుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఇలాంటి దశలో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా రీషూట్లకు వెళ్లడం అసాధ్యం. అలా చేస్తే నిర్మాతలు మళ్లీ వందల కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ కుమ్మరించాల్సి ఉంటుంది. అందుకే విజువల్ హంగులతో పాటు శ్రీరాముడు, సీతాదేవి, రావణుడి పాత్రల ఔన్నత్యాన్ని చాటుతూ ఎంత చాకచక్యంగా ఎమోషన్స్‌ను పండిస్తారనే దానిపైనే పార్ట్ 2 భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి ఈ కఠినమైన సవాలును అధిగమించి నితీశ్ తివారీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

