వందల కోట్లు పెట్టి తీస్తున్న పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు హీరోల కంటే 'బ్యాక్‌గ్రౌండ్ స్కోర్' పెద్ద ప్రాణంగా మారింది. ఏమాత్రం సౌండ్ తగ్గినా బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా కొట్టడం ఖాయం కావడంతో.. టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ఏమాత్రం మొహమాటపడటం లేదు. ఒకరిని తీసుకుని, మధ్యలో అవుట్‌పుట్ నచ్చకపోతే వెంటనే మరొకరిని మార్చేస్తున్న ఈ 'మ్యూజిక్ కుర్చీలాట' వెనుక ఉన్న ఆసక్తికర నిజాలేంటో చూద్దాం.
[FEATURED_IMAGE]'డ్రాగన్'లో డబుల్ మ్యూజిక్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అనగానే కచ్చితంగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ పేరే వినిపిస్తుంది. కానీ ఈమధ్య ఆయన బిజిఎమ్ బాగానే ఉన్నా, హిట్ ట్యూన్స్ ఇవ్వడంలో వెనుకబడ్డారనే టాక్ నడుస్తోంది. దీంతో 'డ్రాగన్' మూవీ కోసం జాతీయ అవార్డు గ్రహీత శాశ్వత్ సచ్దేవ్ను కూడా మేకర్స్ రంగంలోకి దించారు. ఈ డబుల్ మ్యూజిక్ డైరెక్టర్ల సెటప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
పుష్ప 2 నుంచి విశ్వంభర వరకు..
అల్లు అర్జున్ 'పుష్ప 2'కు దేవిశ్రీ ప్రసాద్ ఉన్నప్పటికీ.. ఆర్ఆర్ (RR) పనుల్లో స్పీడ్, డెప్త్ కోసం సామ్ సీఎస్‌ను రంగంలోకి దించారు. మెగాస్టార్ 'విశ్వంభర'కు కీరవాణి లాంటి ఆస్కార్ లెజెండ్ ఉన్నా.. ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియోను, అదనపు బీజీఎం కోసం హరిగౌరను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
తప్పుకుంటున్న డైరెక్టర్లు వీరే!
మరోవైపు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా, ఆయన ప్లేస్‌లోకి తమన్ వచ్చారు. అలాగే త్రివిక్రమ్ తన కొత్త సినిమా 'ఆదర్శ కుటుంబం' కోసం మొదట హర్షవర్ధన్ రామేశ్వర్‌ను తీసుకుని, ఆయనతో సింక్ అవ్వకపోవడంతో మళ్లీ తన ఆస్థాన విద్వాంసుడు తమన్‌కే ఫిక్స్ అయ్యారు.
సినిమా బతికేది ఆ 'సౌండ్' మీదే!
నిజానికి మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్లను మార్చడం వ్యక్తిగతంగా వారికి ఇబ్బందే అయినా మేకర్స్‌ను తప్పుబట్టలేం. కంటెంట్ ఎంత బాగున్నా దాన్ని ఎలివేట్ చేసే బీజీఎం లేకపోతే 300 కోట్ల సినిమా అయినా ఢమాల్ అనాల్సిందే. అందుకే స్టార్ డమ్, పాత బంధాలు పక్కనపెట్టి సినిమా క్వాలిటీ కోసమే దర్శకులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో పాటలకో డైరెక్టర్, బీజీఎంకో డైరెక్టర్ పనిచేసే హాలీవుడ్ కల్చర్ మన టాలీవుడ్లో పూర్తిగా స్థిరపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

