అప్పుడే పంటలు చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. కళ్లెదుటే తమ కష్టం నీటిపాలవ్వడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అకాల వర్షాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల రైతులకు తీరని నష్టం కలిగించాయి. ఎంతో శ్రమించి పండించిన పంట వర్షానికి నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పాటు వీచిన ఈదురు గాలులకు మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి.
ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ మరో ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండకపోవచ్చని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద కాకుండా సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు హెచ్చరించారు.
భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు:
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీలు, ప్రకాశం పెద్దదోర్నాలలో 40.7 డిగ్రీలు, నంద్యాల దొర్నిపాడులో 40.6 డిగ్రీలు, పల్నాడు రావిపాడులో 40.5 డిగ్రీలు, శ్రీకాకుళం పొందూరులో 40.3 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.

