ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె తిరుగులేని తార. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా వెండితెరకు పరిచయమై తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 12 సినిమాల్లో నటించి సంచలనం సృష్టించింది. కానీ, ఆ తర్వాత ఏడాదిలోనే ఊహించని విధంగా కన్నుమూసింది. చిరంజీవి, వెంకటేశ్, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, దివంగత నటి దివ్య భారతి.
ఆ రోజుల్లోనే ఆమె పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ వంటి అప్పటి తారలు కూడా అందుకోలేని అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆమె నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 12 సినిమాల్లో నటించడం అప్పట్లో ఒక సంచలనం. 16 ఏళ్లకే చిత్ర పరిశ్రమను శాసించిన ఈ అందాల తార, 19 ఏళ్ల వయసులోనే అనుకోని రీతిలో మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టింది.
దివ్య భారతి 14 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించింది. 1990లో "నీలా పెన్నే" అనే తమిళ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేశ్ నటించిన "బొబ్బిలి రాజా" సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
1992లో "విశ్వాత్మ" సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. ఒకే సంవత్సరంలో ఆమె నటించిన 12 సినిమాలు విడుదల కావడం విశేషం. అయితే, ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, పెళ్లైన ఏడాదికే, 1993 ఏప్రిల్ 5న తన ఇంటి బాల్కనీ నుండి పడి మరణించింది. ఈ వార్త ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆమె మరణించి ఇప్పటికి 32 సంవత్సరాలు గడిచాయి.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకే సంవత్సరంలో ఏ హీరోయిన్ సాధించలేని అద్భుతాన్ని దివ్య భారతి చేసి చూపించింది. ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాలు విడుదలైన హీరోయిన్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. 1992లోనే ఆమె నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. ఆమె మరణానికి ముందు ఆమె సంతకం చేసిన అనేక చిత్రాల్లో నిర్మాతలు ఇతర నటీమణులను ఎంచుకోవాల్సి వచ్చింది.

